లాక్‌డౌన్‌లో ఫీ‘జులుం’! | Private Schools Force Parents To Pay Fees In Lockdown | Sakshi
Sakshi News home page

లాక్‌డౌన్‌లో ఫీ‘జులుం’!

Published Sun, Apr 19 2020 8:28 AM | Last Updated on Sun, Apr 19 2020 8:29 AM

Private Schools Force Parents To Pay Fees In Lockdown - Sakshi

సాక్షి, హైదరాబాద్ ‌: ఓవైపు లాక్‌డౌన్‌.. మరోవైపు పనుల్లేక ఖాళీ.. ఇంట్లో నిత్యావసర సరుకుల కొనుగోలుకే కష్టకాలం. ఇలాంటి పరిస్థితుల్లో పాఠశాలల యాజమాన్యాలు ఫీజులు చెల్లించాలంటూ తల్లిదండ్రులపై ఒత్తిడి తెస్తున్నాయి. పైసా అప్పు పుట్టని ఈ పరిస్థితుల్లోనూ ఫీజులు అడుగుతుండటంతో పాఠశాలల యాజమాన్యాలపై తల్లిదండ్రులు మండిపడుతున్నారు. ఆన్‌లైన్‌లో ఫీజులను చెల్లించాలంటూ పట్టణ ప్రాంతాల్లోని యాజమాన్యాలు మెసేజ్‌లు పంపిస్తుండటంతో తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కరోనా కారణంగా అసలే ఇబ్బందులు పడుతుంటే స్కూల్‌ యాజమాన్యాల తీరు ఆగ్రహం తెప్పిస్తోందని అంటున్నారు. 

ఫీజు వసూలే టార్గెట్‌ రాష్ట్రంలో 10,546 ప్రైవేటు పాఠశాలలు ఉన్నాయి. అందులో కార్పొరేట్‌ స్కూళ్లు 800 వరకు ఉండగా మిగతా వాటిలో మరో 3వేల వరకు కాస్త పేరున్నవి. మిగతావి సాధారణ పాఠశాలలు. లాక్‌డౌన్ నేపథ్యంలో ఒకటి నుంచి 9వ తరగతి వరకు మార్కులతో నిమిత్తం లేకుండా విద్యార్థుల్ని పై తరగతులకు ప్రమోట్‌చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో ఈ విద్యా సంవత్సరం ఇప్పటికే పూర్తయినట్టే. అయితే, జనవరి, ఫిబ్రవరి, మార్చి ఫీజులు మామూలుగా వార్షిక పరీక్షల సమయంలో చెల్లిస్తుంటారని, సరిగ్గా పరీక్షలకు ముందే లాక్‌డౌన్‌ ప్రకటించడంతో అవి వసూలుకాక ఇబ్బంది పడుతున్నామని ప్రైవేట్‌ విద్యాసంస్థలు అంటున్నాయి.

ఫీజుల వసూలుతో నిమిత్తం లేకుండా టీచర్లకు వేతనాలిస్తున్నామని, ఇప్పుడు విద్యార్థులను పై తరగతులకు ప్రమోట్‌ చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించడంతో ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నామని ఓ స్కూల్‌ కరస్పాండెంట్‌ చెప్పారు. కాగా, ఆయా తరగతులకు చెందిన క్లాస్‌ టీచర్లతో తల్లిదండ్రులకు స్కూలు యాజమాన్యాలు ఫోన్లు చేయిస్తూ, ఫీజులు చెల్లించాలని ఒత్తిడి తెస్తున్నాయి. ఈ క్రమంలోనే ఓ విద్యార్థి తండ్రికి టీచర్‌ ఫోన్‌ చేయించడంతో అసలే పనుల్లేక ఇబ్బందులు పడుతున్న సమయంలో ఫీజులు అడుగుతారా? అని ఆయన కొంత ఆగ్రహాన్ని ప్రదర్శించారు. కాగా, తరగతుల వారీగా ఫీజు పూర్తిగా చెల్లించని విద్యార్థులు వివరాలను టీచర్లకు అప్పగించి యాజమాన్యాలు టార్గెట్లను విధిస్తున్నాయి. ఫీజులు చెల్లించేలా చూస్తేనే పూర్తి వేతనం చెల్లిస్తామని తెగేసి చెబుతున్నాయి. దీంతో టీచర్లు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. కొన్ని యాజమాన్యాలైతే ఆన్‌లైన్‌లో ఫీజులు చెల్లించాలంటూ తల్లిదండ్రులకు మెస్సేజ్‌లు పంపిస్తున్నాయి.

  • రాష్ట్రంలోని మొత్తం ప్రైవేట్‌ పాఠశాలలు- 10,546
  • కార్పొరేట్, కాస్త పేరున్న స్కూళ్లు- 3,800

లాక్‌డౌన్‌లో అడ్మిషన్ల ప్రచార గోల
అత్యవసర సేవలు తప్ప అన్ని రంగాలను ప్రభుత్వం మూసివేసినా కార్పొరేట్‌ విద్యాసంస్థలు మాత్రం అడ్మిషన్లు ప్రారంభమయ్యాయంటూ ప్రచారానికి దిగాయి. తమ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించాలని, తమ వద్ద చదివితే ర్యాంకులు వస్తాయని ప్రచారం చేస్తున్నాయి. ప్రైవేటు స్కూళ్ల ఫీజులు, ప్రచార వ్యవహారాలపై తల్లిదండ్రుల సంఘాలు విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేశాయి. ఢిల్లీ ప్రభుత్వం చివరి టర్మ్‌ ఫీజు చెల్లింపును రద్దు చేసిందని, రాష్ట్రంలోనూ అటువంటి చర్యలు తీసుకోవాలని కోరాయి. ఈ మేరకు శుక్రవారం విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామ్‌చంద్రన్‌కు హైదరాబాద్‌ స్కూల్‌ పేరెంట్స్‌ అసోసియేషన్‌ విజ్ఞప్తి చేసింది.

ప్రమాదకర యాప్‌లతో ఆన్‌లైన్‌ పాఠాలు
ముఖ్యంగా కార్పొరేట్‌ స్కూళ్లతోపాటు కాస్త పేరున్న స్కూళ్లు ఇప్పుడు ఆన్‌లైన్‌ తరగతులు కొనసాగిస్తున్నాయి. ఇంట్లో సరదాగా గడుపుతున్న 5వ తరగతి విద్యార్థులను కూడా ఆన్‌లైన్‌ పాఠాల పేరుతో కూర్చోబెడుతున్నాయి. ఇంట్లో ఉండి పాఠం విన్నా స్కూల్‌ యూనిఫాం ధరించాలని, విద్యార్థులు చదువుకునేటప్పుడు వీడియోతీసి పంపించాలని మెున్నటివరకు నిబంధనలు విధించాయి. ఇప్పుడు మరో అడుగు ముందుకేసి ఆన్‌లైన్‌ పాఠాల నెపంతో ఫీజుల వసూలుపై పడ్డాయి. అవసరం లేకున్నా ఆన్‌లైన్‌ పాఠాలంటూ ఇబ్బందులకు గురిచేస్తున్న యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్‌ చేస్తున్నారు. సెక్యూరిటీపరంగా శ్రేయస్కరం కాని జూమ్‌ వంటి యాప్‌లను వినియోగించవద్దని కేంద్రం చెబుతున్నా అలాంటి యాప్‌లతో తరగతులను కొనసాగిస్తున్నాయి. వాట్సాప్‌లలో వర్క్‌షీట్స్‌ పంపించడం, ప్రశ్నలు ఇవ్వడం వంటి చర్యలతో తరగతులను కొనసాగిస్తున్న పాఠశాలలు జూమ్‌ ద్వారా తరగతుల వారీగా గ్రూప్‌లను ఏర్పాటుచేసి పాఠాలను బోధిస్తున్నాయి.
 
కార్పొరేట్‌ సంస్థలవే ఫీజు ఆగడాలు
ఈ సంక్లిష్ట పరిస్థితుల్లో ప్రజా శ్రేయస్సును పక్కనపెట్టి కొన్ని కార్పొరేట్‌ విద్యాసంస్థలే వ్యాపారాభివృద్ధి గురించి ఆలోచిస్తున్నాయి. ఫీజులు చెల్లించాలంటూ తల్లిదండ్రులపై ఒత్తిడి తెస్తున్నాయి. అలాంటి వ్యాపార సంస్థలను, వారి ఆగడాలను ఖండించాల్సిందే.–ప్రైవేటు యాజమాన్యాల సంఘం అధ్యక్షుడు యాదగిరి శేఖర్‌రావు 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement