అక్షరాలా అక్కడ ఫీజు లేదు | Assam couple starts school that accepts plastic waste as fees | Sakshi
Sakshi News home page

అక్షరాలా అక్కడ ఫీజు లేదు

Published Thu, May 23 2019 12:15 AM | Last Updated on Thu, May 23 2019 1:19 AM

Assam couple starts school that accepts plastic waste as fees - Sakshi

ప్రైవేట్‌ పాఠశాల అనగానే వెంటనే గుర్తుకొచ్చేది ఫీజులు. చదువు సంగతి ఎలా ఉన్నా.. ఫీజుల వసూళ్లలో మాత్రం పక్కాగా ఉంటాయి. అయితే అసోంలోని ఓ పాఠశాల మాత్రం విద్యార్థుల దగ్గర స్కూల్‌ ఫీజులను తీసుకోవడం లేదు. అందుకు బదులుగా కాసిన్ని ప్టాస్టిక్‌ వ్యర్థాలను ఇస్తే చాలని చెబుతోంది. వినడానికి విచిత్రంగా ఉన్నా... ఇది మాత్రం నిజం.  అసోంలోని పమోహీలోగల ‘అక్షర ’ పాఠశాల పేరుకు ప్రైవేటు పాఠశాల అయినప్పటికీ ఇక్కడ ఫీజు వసూలు చేసే పద్ధతి భిన్నంగా ఉంటుంది. ఈ పాఠశాలలో ఫీజు కట్టాలంటే నోట్ల కట్టలు తీసుకెళ్లాల్సిన అవసరం లేదు.

వీలైనన్ని ప్లాస్టిక్‌ వ్యర్థాలు తీసుకెళ్తే సరి. ఫీజు కట్టినట్లు రసీదు ఇచ్చేస్తారు. పాఠాలు మాత్రం చక్కగానే చెబుతారు. ప్లాస్టిక్‌ వ్యర్థాలను ఫీజుగా తీసుకొని పాఠశాలను ఎలా నిర్వహిస్తున్నారని అనుమానం రావొచ్చు. అక్కడికే వస్తున్నాం... పర్యావరణ పరిరక్షణ కోసం ఏర్పాటైన విద్యాలయమిది.ఈశాన్య రాష్ట్రమైన అసోంలో చలి ఎక్కువ. దీంతో చలిమంటల కోసం అక్కడి ప్రజలు ప్లాస్టిక్‌ వ్యర్థాలనే ఉపయోగిస్తారు. నిజానికి ప్లాస్టిక్‌ వ్యర్థాలను ఇలా బహిరంగంగా తగులబెట్టడం పర్యావరణానికి తీవ్రమైన హాని. దీనిపై అక్కడి ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఎంత ప్రయత్నించినా ఫలితం శూన్యం.

ప్లాస్టిక్‌ తగులపెట్టడం వల్ల వెలువడే విషవాయువులు పిల్లల ఆరోగ్యంపై తీవ్ర దుష్పభ్రావాన్ని చూపుతున్నాయి. దీంతో సామాజిక కార్యకర్త అయిన పర్మిత శర్మకు ఓ ఆలోచన తట్టింది. వెంటనే న్యూయార్క్‌లో ఓ స్కూల్‌ ప్రాజెక్టు చేస్తున్న మజిన్‌తో తన ఆలోచనను పంచుకుంది. టీఐఎస్‌ఎస్‌ (టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్స్‌)లో మాస్టర్స్‌ డిగ్రీ చేసిన పర్మిత... అసోం భౌగోళిక పరిస్థితుల గురించి, అక్కడ నెలకొన్న సవాళ్ల గురించి మజిన్‌కు వివరించింది. అలా వారిద్దరి ఆలోచనలో నుంచి పుట్టుకొచ్చిందే ‘అక్షర’ విద్యాలయం.

సంప్రదాయ విద్యకు, వృత్తి విద్యాశిక్షణకు మధ్య ఉన్న దూరానికి వారధిగా ప్రారంభించిన ఈ పాఠశాలకు విద్యార్థులను రప్పించడం మొదట్లో సవాలుగానే మారింది. అక్కడి పిల్లలు దగ్గర్లోనే ఉన్న రాళ్ల క్వారీలలో పనిచేసేవారు. వారిని బడికి పంపిస్తే ఆదాయం కోల్పోతామని తల్లిదండ్రులు పిల్లల్ని స్కూలుకు పంపేందుకు ససేమిరా అన్నారు. దీంతో తల్లిదండ్రుల అవసరాలకు తగిన విధంగా ఉపాధి పొందే విద్యాబోధనతో ‘అక్షర’ పాఠశాలను ఏర్పాటు చేశారు.

డబ్బుకు ప్రత్యామ్నాయం...
దగ్గరే ఉన్న షాపులో స్నాక్స్, బొమ్మలు, చాకొలెట్లు వంటివి కొనుక్కోడానికి టాయ్‌ కరెన్సీని వాడే వీలు కల్పించారు. ‘విద్యార్థులు తమ సేకరణలతో ఆన్‌లైన్‌లో వస్తువులు కొనేందుకు మా వద్దకు వస్తారు. మేం వారి కలెక్షన్స్‌ను తీసుకొని, డబ్బు చెల్లించి, అమెజాన్‌లో వారికి ఆ వస్తువులను కొనిపెడతాం. అంతేకాదు.. ప్లాస్టిక్‌ను కాల్చడం వల్ల కలిగే ముప్పు గురించి పిల్లల ద్వారానే తల్లిదండ్రుల్లో అవగాహన కలిగించాం. అందులో భాగంగా వ్యర్థాల రీసైకిలింగ్‌ డ్రైవ్‌ చేపట్టాం. మా వద్ద పోగయిన ప్లాస్టిక్‌ వ్యర్థాలతో రకరకాల నిర్మాణ సామగ్రి తయారీని కూడా చేపట్టాం’’ అంటున్నారు పర్మిత. దేశవ్యాప్తంగా అక్షర లాంటి స్కూళ్లను ఓ వంద వరకు ఏర్పాటు చేయాలన్న మజిన్, పర్మితల ఆశయం నెరవేరాలని ఆశిద్దాం.
– లక్ష్మీలావణ్య ఆర్‌. సాక్షి స్కూల్‌ ఎడిషన్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement