
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని 75 శాతం ప్రభుత్వ పాఠశాలల్లో కనీస వసతులు లేవని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) పేర్కొంది. 45 శాతం స్కూళ్లకు ఆట స్థలాలు లేవని, 39 శాతం బడులకు ప్రహరీ గోడలు లేవని వెల్లడించింది. విద్యా హక్కు చట్టం పక్కాగా అమలు కాకపోవడంతో విద్యార్థులకు ఆశించిన ప్రయోజనాలు చేకూరలేదని తెలిపింది. విద్యా హక్కు చట్టాన్ని అమలు చేసే రాష్ట్ర సర్వ శిక్షా అభియాన్‌కు (ఎస్‌ఎస్‌ఏ) కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు విడుదల చేయక కార్యక్రమాలు కుంటుపడ్డాయని కాగ్ స్పష్టం చేసింది. 50 శాతం వరకు నిధుల విడుదలలో కోత పెట్టడమే ఇందుకు కారణంగా పేర్కొంది. 2014 నుంచి 2017 మార్చి నాటికి విద్యారంగంలో పరిస్థితులను కాగ్ తన నివేదికలో వివరించింది.
ప్రభుత్వ ప్రైమరీ స్కూళ్లలో తగ్గుదల
రాష్ట్రంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో (స్థానిక సంస్థలు, ఎయిడెడ్ కలుపుకొని) 2014–17 మధ్య విద్యార్థుల సంఖ్య 1.12 లక్షల మేర (7.65 శాతం) తగ్గగా ప్రైవేటు ప్రాథమిక పాఠశాలల్లో 61 వేల మంది (3.67 శాతం) విద్యార్థుల సంఖ్య పెరిగిందని కాగ్ గుర్తించింది. ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలల్లో 20 వేల మంది విద్యార్థులు తగ్గిపోగా ప్రైవేటు ప్రాథమికోన్నత పాఠశాలల్లో 3 వేల మంది పెరిగినట్లు పేర్కొంది. మరోవైపు మూడేళ్ల కాలంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల సంఖ్య 0.42 శాతం పెరిగితే ప్రైవేటు పాఠశాలల సంఖ్య 12.75 శాతం పెరిగిందని పేర్కొంది. ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలల్లో బడుల సంఖ్య 2.89 శాతం పెరగ్గా ప్రైవేటు ప్రాథమికోన్నత పాఠశాలల్లో 10.09 శాతం పాఠశాలలు పెరిగినట్లు లెక్కించింది.
ఎలిమెంటరీలో డ్రాపవుట్స్ ఎక్కువే...
ఒకటో తరగతి నుంచి 8వ తరగతి వరకు విద్యార్థుల్లో డ్రాపవుట్స్ ఎక్కువగా ఉన్నట్లు కాగ్ పేర్కొంది. వివిధ కారణాల వల్ల చాలా మంది విద్యార్థులు మధ్యలోనే బడి మానేస్తున్నట్లు తెలిపింది. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ బాలబాలికల్లో డ్రాపవుట్స్ ఎక్కువగా ఉన్నట్లు పేర్కొంది. రాష్ట్రంలో చైల్డ్ ట్రాకింగ్ వ్యవస్థ అమలు చేయకపోవడం వల్ల పిల్లలు ఎక్కడ చదువుతున్నారన్న అంశం రూఢీకాని పరిస్థితి నెలకొందని, ఫలితంగా 47 వేల మంది పిల్లలు విద్యావకాశాలకు దూరమయ్యారని పేర్కొంది.
ఆర్‌టీఈ అమలుపై సమీక్షేదీ?
రాష్ట్రంలో విద్యా హక్కు చట్టం (ఆర్‌టీఈ) అమలుపై సమీక్షే జరగడం లేదని కాగ్ విమర్శించింది. విద్యాశాఖ మంత్రి అధ్యక్షతన పని చేయాల్సిన రాష్ట్ర సలహా సంఘాన్ని (ఎస్‌ఏసీ) ఇంతవరకు ప్రభుత్వం ఏర్పాటు చేయలేదని పేర్కొంది. ప్రైవేటు పాఠశాలల్లో బలహీనవర్గాల పిల్లలకు 25 శాతం రిజర్వేషన్లను కల్పించాలన్న నిబంధనను అమలు చేయడం లేదని, 2014–15, 2015–16 విద్యా సంవత్సరాల్లో 44,412 మంది విద్యార్థులకు రవాణ భత్యాన్ని కూడా ఇవ్వలేదని వెల్లడించింది. ప్రత్యేక అవసరాలుగల పిల్లల కోసం మూడేళ్లలో రూ. 15.42 కోట్లు కేటాయించగా అందులో 35 శాతం నిధులనే ఖర్చు చేసినట్లు పేర్కొంది.
91% కంటే ఎక్కువ మార్కులు వచ్చిన వారు 10 శాతం లోపే..
చదవడం, రాయడం లెక్కలు చేయడం కోసం ‘త్రీ ఆర్స్’కార్యక్రమం నిర్వహించినా ఆశించిన ఫలితాలు రాలేదని కాగ్ పేర్కొంది. రెండో తరగతిలో 38 శాతం మందికి, మూడో తరగతిలో 39 శాతం మందికి అవి రావడం లేదని తెలిపింది. 2016–17లో 2వ తరగతి నుంచి 8వ తరగతి వరకు చదవడం, రాయడం, సాధారణ లెక్కలు చేయడం రాని వారు 31 శాతం ఉన్నట్లు వెల్లడించింది. మరోవైపు ప్రాథమిక పాఠశాలల్లో ఈ మూడేళ్లలో 40 శాతం మార్కులు రాని వారు 14 శాతం నుంచి 26 శాతం మంది ఉంటే ప్రాథమికోన్నత పాఠశాలల్లో 21 శాతం నుంచి 47 శాతం మంది విద్యార్థులు ఉన్నట్లు తెలిపింది. 91 శాతం నుంచి 100 శాతం మార్కులు వచ్చిన వారు ప్రాథమిక స్థాయిలో 5 నుంచి 10 శాతమే ఉండగా ప్రాథమికోన్నత స్థాయిలో 2 నుంచి 6 శాతమే ఉన్నట్లు పేర్కొంది.
రెండేళ్లయితే 40 శాతం నిధులే దిక్కు
రాష్ట్రంలో ఎస్‌ఎస్‌ఏకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 40% నిధులనే విడుదల చేశాయి. 2014–15, 2015–16 విద్యా సంవత్సరాల్లో కేటాయించిన వాటిల్లో సగం నిధులనూ ఇవ్వకుండా 40 శాతం నిధుల విడుదలతోనే సరిపుచ్చాయి. కేంద్ర ప్రభుత్వం మూడేళ్లలో రూ. 3344.43 కోట్లు విడుదల చేయాల్సి ఉండగా కేవలం రూ. 1,353 కోట్లే ఇచ్చింది. రాష్ట్రం రూ. 2015.98 కోట్లు ఇవ్వాల్సి ఉండగా, రూ. 1340.55 కోట్లు ఇచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment