సాక్షి, వత్సవాయి : విద్యార్థులకు కార్పొరేట్ విద్యనందిస్తామని ప్రకటనలు గుప్పించి విద్యార్థులకు వల వేస్తున్న ప్రైవేటు పాఠశాలల్లో అంతా వ్యాపారమే సాగుతుంది. పుస్తకాల దగ్గర నుంచి విద్యార్థులకు కావాల్సిన అన్ని వస్తువులను పాఠశాలల్లోనే ఉంచి అమ్మకాలు సాగిస్తున్నారు. టెస్టు, నోట్ పుస్తకాల ధరలతో విద్యార్థుల తల్లిదండ్రులు బెంబేతెత్తుతున్నారు. ప్రైవేటు పాఠశాలల్లో చదివే విద్యార్థులందరూ సంబంధిత పాఠశాలల్లోనే పుస్తకాలు కొనాలని షరతులు పెట్టడంతో ప్రైవేటు పాఠశాలల్లో పుస్తకాల వ్యాపారం జోరుగా సాగుతుంది. పాఠశాలల్లో చదివే విద్యార్థులు బహిరంగ మార్కెట్లో పుస్తకాలు కొనుగోలు చేయరాదని పాఠశాల యాజమాన్యం ఆదేశాలు జారీచేస్తున్నారని తల్లితండ్రులు చెబుతున్నారు. చేసిదిలేక రెట్టింపు రేట్లకే పాఠశాలల్లో పుస్తకాలు కొనుగోలు చేయవల్సివస్తుంది.
పాఠ్య పుస్తకాల విక్రయాలకు పాఠశాలలు అడ్డాగా మారాయి. బహిరంగ మార్కెట్లో విక్రయిస్తున్న టెస్టు, నోట్ పుస్తకాలకు పాఠశాలల్లో విక్రయిస్తున్న వాటికి పొంతన ఉండడం లేదు. ఎంఆర్‌పీ ధరల కంటే ఎక్కువ శాతానికి పాఠశాలల్లో విక్రయిస్తున్నట్లు చెబుతున్నారు. నోట్ పుస్తకాలపై సంబంధిత పాఠశాల పేరు ఉంటుందని బహిరంగ మార్కెట్లో లభించే నోట్ పుస్తకాలను వినియోగించరాదని ఆంక్షలు విధిస్తున్నారు.
అన్ని పాఠశాలల్లోనే..
విద్యార్థులు వేసుకునే యూనిఫాం నుంచి టైలు, బెల్టులు, ఐడెండిటీ కార్డులు, టెస్టు, నోట్ పుస్తకాలు అన్ని పాఠశాలలోనే కొనాలని షరతులు పెడుతున్నారు. బహిరంగ మార్కెట్లో కొన్న యూనిఫాంను, పుస్తకాలను అనుమతించేదిలేదని పాఠశాల యాజమాన్యం తల్లితండ్రులకు చెబుతున్నారు. మరికొన్ని పాఠశాలల నిర్వాహకులు మార్కెట్లో తమకు అనుకూలంగా ఉన్న షాపులను సిఫారసు చేస్తున్నారు. ఒకటో తరగతి నుంచి ఐదవ తరగతి వరకు నోట్, టెస్టు పుస్తకాలు 2 వేల నుంచి 5 వేల వరకు ఖర్చువుతున్నాయి. ఇక ఫీజులు, యూనిఫాం, తదితరలు ఖర్చులు కళ్లు బైర్లు కమ్మేటట్లు ఉన్నాయి.
పట్టించుకోని అధికారులు
ప్రైవేటు పాఠశాలల్లో వసతులు లేకపోయినా విద్యాశాఖాధికారులు పట్టించుకోవడంలేదు. పాఠశాలల్లో విశాలమైన తరగతి గదులతోపాటు గాలి వెలుతురు సక్రమంగా వచ్చేటట్లు ఉండాలి. ప్యాన్లు, లైట్లు, పరిశుభ్రమైన మరుగుదొడ్లు, ఆహాద్లకరమైన క్రీడాప్రాంగణం వంటి వసతులు ఉండాలి. కానీ ఇటువంటి వసతులు ఎక్కడా కనపడడంలేదు. ఇరుకుగదులు, రేకులషెడ్లు, చిన్నపాటి భవనాల్లో నడుస్తున్నాయి. ఇక క్రీడాప్రాంగణం ఎక్కడ ఉంటుందో కూడా విద్యార్థులకు తెలియదు.
ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇరుకుగదుల్లోనే ఉంటున్నారు. కానీ ఫీజులు విషయంలో మాత్రం ఎక్కడా రాజీపడరు. నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ విద్యార్థులకే సంవత్సరానికి రూ. 15 వేల వరకు ఖర్చు చేయవల్సివస్తుంది. విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రతి ప్రైవేటు పాఠశాలలోను పేద విద్యార్థులకు 25 శాతం మేర సీట్లు కేటాయించాల్సి ఉండగా అది ఏ పాఠశాలలలోను కనపడడంలేదు. విద్యాశాఖాధికారులు సమగ్రం గా తనిఖీలు నిర్వహిస్తే చాలా పాఠశాలలలు మూ సివేయాల్సి వస్తుందనడంలో సందేహం లేదు.
Comments
Please login to add a commentAdd a comment