ప్రైవేట్ పాఠశాలల్లో ఆర్థిక, విద్యా సంబంధ విషయాల్లో యాజమాన్యాలను నియంత్రించేందుకు ఏర్పాటు చేసే బడి కమిటీలు ప్రస్తుతం ఎక్కడా కానరావడం లేదు. జిల్లాలో దాదాపు 1,200 ప్రైవేట్ పాఠశాలలు ఉన్నప్పటికి పట్టుపని పది స్కూళ్లలో కూడా కమిటీలు లేవు.
సాక్షి, అమరావతి బ్యూరో: ప్రైవేట్ స్కూళ్లలో అసలు ఫీజులు ఎవరు నిర్ణయించాలి అనే అంశం పై ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలను ఇచ్చిం ది. దీని ప్రకారం ప్రతి పాఠశాలకు కచ్చితంగా గవర్నింగ్ బాడీ ఏర్పాటు చేయాలి. వారే ఏ తరగతికి ఎంత ఫీజులు తీసుకోవాలో నిర్ణయిస్తారు. దాంతో పాటు అక్కడ పనిచేసే టీచర్లకు, సిబ్బందికి ఎంత మేరకు జీతాలు ఇవ్వాలో కూడా స్పష్టం చేస్తుంది. కానీ ఈ కమిటీ ఏర్పాటును ఏ పాఠశాల కూడా పట్టించుకునే దాఖలాలు లేవు. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా ఏ ఒక్క పాఠశాలలోనూ అమలైన ఆనవాళ్లు లేవు. జిల్లా విద్యాశాఖ దగ్గర కూడా ఎటువంటి సమాచారం లేదు. జిల్లాలో దాదాపు 1,200 ప్రైవేట్ పాఠశాలలు ఉన్నప్పటికి పట్టుపని పది స్కూళ్లలో కూడా కమిటీ ఏర్పడలేదు. ఉన్న వాటిలో కూడా సొంత వాళ్లనే నియమించుకొని నిర్ణయాలను ప్రభావితం చేస్తున్నారు.
కమిటీ స్వరూపం ఇది..
పాఠశాల కమిటీకి ఒక అధ్యక్షుడు, కార్యదర్శి, నలుగురైదుగురు సభ్యులుంటారు. అధ్యక్షుడిగా సంబంధిత విద్యాసంస్థ చైర్మన్ వ్యవహరిస్తారు. కార్యదర్శిగా ఆ పాఠశాల కరస్పాండెంట్ లేదా మేనేజర్ ఉంటారు. మిగిలిన సభ్యులుగా పాఠశాల ప్రిన్సిపల్ లేదా హెడ్‌మాస్టర్, పాఠశాల బోధనా సిబ్బంది నుంచి ఒకరు, పేరెంట్–టీచర్స్ అసోసియేషన్ నుంచి ఒకరు, డీఈవో ఎంపిక చేసిన ఒక విద్యార్థి తల్లి(ఉన్నత విద్యావంతురాలు) ఉంటారు. ఈ పాలకమండలి జిల్లా విద్యాశాఖాధికారి ఆమోదం పొందాల్సి ఉంటుంది. అయితే ఇలా ఆమోదం పొందిన ప్రైవేట్ పాఠశాలలు ఎక్కడా లేవు. ఎందుకు ఏర్పడలేదని అడిగే నాథుడూ లేడు.
కమిటీ నిర్ణయాలే ఫైనల్..
పాఠశాలలో విధానపరమైన నిర్ణయాలు ఏవి తీసుకోవవాలన్నా ఈ కమిటీ నిర్ణయం తీసుకోవవాల్సిందే. పాఠశాలలో ఎంతమంది విద్యార్థులకు అడ్మిషన్‌లు ఇవ్వాలి, టీచర్ల నియామకం, సిబ్బంది ఎంతమంది ఉండాలి వంటి వాటిని కమిటీ పరిశీలిస్తుంది. ముఖ్యంగా టీచర్ల నియామకంలో నాణ్యమైన వారిని ఎంపిక చేసే అధికారం ఉండటం వల్ల పిల్లలకు మంచి విద్యను అందించగలుగుతాం. కానీ వీటి నియామకం జరగకపోవడంతో యాజమాన్యాలు ఇష్టానుసారంగా అర్హత లేని వారిని ఎంపిక చేసి పిల్లల భవిష్యత్తుతో ఆడుకుంటున్నారు. కమిటీ చేసే మరో పని పాఠశాల నిర్వహణకయ్యే ఖర్చులను లెక్కించడం, జీతాలు ఎంతివ్వాలో నిర్ణయించడం. నిబంధనల ప్రకారం పాఠశాలలకు వచ్చే మొత్తం ఆదాయంలో 50 శాతం టీచర్లకు, ఇతర సిబ్బందికి జీతాల రూపంలో ఇచ్చేలా చూడాలి. 15 శాతం తగ్గకుండా నిర్వహణ ఖర్చులకు వెచ్చించాలి. కమిటీ లేకపోవడంతో యాజమాన్యాలు సిబ్బందికి కనీస వేతనాలు ఇవ్వకుండా వారి శ్రమను దోచుకుంటున్నాయి.
ఫీ‘జులుం’
ప్రతి విద్యా సంవత్సరం ప్రారంభంలో ఈ కమిటీ సమావేశమై ఫీజుల్లో మార్పులపై చర్చించాలి. ఫీజుల పెంపు తప్పనిసరిగా కమిటీ ఆమోదం పొందాలి. కానీ ఇవేమి లేకుండానే యాజమాన్యాలు ఇష్టానుసారంగా పెంచేస్తున్నాయి. ఏటా 30 నుంచి 50 శాతం దాకా పెంచేస్తూ దోచుకుంటున్నాయి. పట్టించుకోవాల్సిన విద్యాశాఖ అధికారులు చోద్యం చూస్తున్నారు.
విద్యార్థి సంఘాలకు చోటివ్వాలి
దాదాపు జిల్లాలోని ఏ పాఠశాలలోను కమిటీలను ఏర్పాటు చేయలేదు. ఉన్నవాటిలో సొంత వారిని నియమించి పబ్బం గడుపుతున్నారు. ఏటా 50 శాతం దాకా ఫీజులు పెంచుతున్నారు. ఈ కమిటీల్లో విద్యార్థి సంఘాలకు ప్రాతినిధ్యం ఇవ్వడం వల్ల వారి దోపిడిని అడ్డుకోగలగుతాం. కలెక్టర్ ఆదేశించినప్పటికి అధికారులు వాటిని పాటించడం లేదు. – కోటిబాబు, కృష్ణా జిల్లా ఎస్‌ఎఫ్‌ఐ అధ్యక్షుడు
Comments
Please login to add a commentAdd a comment