‘బుక్’ అయినట్టే!
► ప్రైవేటు స్కూళ్లలో భారీగా పెరగనున్న పాఠ్యపుస్తకాల ధరలు
► వచ్చే విద్యా సంవత్సరం 13 శాతం మేర పెరగనున్న రేట్లు
► పబ్లిషర్లకు పచ్చజెండా ఊపిన సర్కారు
► ప్రభుత్వ సిలబస్ పుస్తకాలకు రూ.500 లోపే..
► అదే ప్రైవేటు సిలబస్ పుస్తకాలకు రూ.3 వేల పైనే..
► 30 లక్షల కుటుంబాలపై పడనున్న భారం
► ప్రైవేటు స్కూళ్లలో ఇక యాజమాన్యాలు చెప్పిందే సిలబస్
సాక్షి, హైదరాబాద్
ప్రైవేటు స్కూళ్లలో ఫీజులే కాదు.. పుస్తకాలూ మోతెక్కిపోతున్నాయి! రాష్ట్రంలో ప్రైవేటు పాఠశాలల్లో పిల్లల్ని చదివిస్తున్న దాదాపు 30 లక్షల కుటుంబాలపై పాఠ్యపుస్తకాల భారం పడబోతోంది. వచ్చే విద్యా సంవత్సరం (2017–18)లో 6వ తరగతి నుంచి పదో తరగతి వరకు చదివే 15 లక్షల మంది విద్యార్థుల పుస్తకాల ధరలు ప్రస్తుత విద్యా సంవత్సరం (2016–17) ధరల కంటే 13 శాతం పెరగనున్నాయి. ఈ మేరకు పుస్తకాల ధరలు పెంచుకునేందుకు పబ్లిషర్లకు విద్యాశాఖ ఓకే చెప్పింది. పేపరు ధరలు పెరిగినందున బుక్కుల రేట్లు పెంచేందుకు అంగీకరించినట్లు విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. ప్రైవేటులో ఒకటో తరగతి నుంచి 5వ తరగతి వరకు చదివే మరో 15 లక్షల మంది విద్యార్థులపై మరింత భారం పడబోతోంది. ఈ 13 శాతం భారంతోపాటు ప్రైవేటు పబ్లిషర్లు అదనంగా నిర్ణయించే ధరలను కూడా మోయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ప్రైవేటు పాఠశాలల్లో ప్రభుత్వ నిర్దేశిత సిలబస్ కాకుండా.. ప్రైవేటు పబ్లిషర్లు ముద్రించి పంపిణీ చేసే పుస్తకాలను అమలు చేయడం వల్ల వాటికి తల్లిదండ్రులు వేల రూపాయలు చెల్లించాల్సి వస్తోంది. అలాకాకుండా ప్రైవేటు స్కూళ్లలో ఒకటి నుంచి ఐదో తరగతి వరకు ప్రభుత్వ నిర్దేశిత సిలబస్‌తో కూడిన పాఠ్య పుస్తకాలను అమలు చేస్తే ఒక్కో పుస్తకాల సెట్‌కు సగటున రూ.220లోపు ఖర్చు కానుంది. నోట్‌బుక్‌లతో కలుపుకొని రూ.500 వరకు అవుతోంది. ప్రైవేటు పబ్లిషర్ల పుస్తకాలను అమలు చేస్తే ఒక్కో విద్యార్థి పుస్తకాలు, నోట్‌బుక్‌లకు రూ.3 వేల నుంచి రూ.5 వేల వరకు వెచ్చించాల్సి వస్తోంది. సాధారణ ప్రైవేటు పాఠశాలల్లోనూ ప్రాథమిక తరగతుల పుస్తకాలు, నోట్‌బుక్‌లకు రూ.3 వేలపైనే వెచ్చించాల్సి పరిస్థితి నెలకొంది. ప్రైవేటు పాఠశాలల్లో ప్రభుత్వ నిర్దేశిత సిలబస్‌ను తప్పకుండా అమలు చేయాలన్న నిబంధన విషయంలో మౌనంగా వ్యవహరించాలన్న నిర్ణయానికి సర్కారు వచ్చినట్లు తెలిసింది. ప్రైవేటు పబ్లిషర్లు, పాఠశాలల యాజమాన్యాలు కలిసి ప్రభుత్వ పెద్దలపై ఒత్తిడి తేవడం వల్లే ఈ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.
ఆ పట్టుదల ఏమైంది?
2016–17 విద్యా సంవత్సరం ప్రారంభంలో ప్రైవేటు పాఠశాలలు కచ్చితంగా ప్రభుత్వ నిర్దేశిత పుస్తకాలను వినియోగించాలని విద్యాశాఖ జూన్‌లో ఆదేశాలు జారీ చేసింది. అయితే విద్యా సంవత్సరం మొదలయ్యాక ఎలా ఈ ఆదేశాలను అమలు చేస్తామని యాజమాన్యాలు ప్రశ్నించాయి. తాము బోధిస్తున్న çప్రైవేటు పుస్తకాల స్థాయిలో ప్రభుత్వ పుస్తకాలు లేవని, విద్యార్థులు అప్పటికే పుస్తకాలను కొనుగోలు చేశారంటూ కోర్టును ఆశ్రయించాయి. న్యాయస్థానం ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు ఇచ్చినా.. తీర్పు నవంబర్‌లో రావడంతో విద్యాశాఖ మిన్నకుండి పోయింది. 2016లో చూపిన పట్టుదలను విద్యాశాఖ ఇప్పుడు చూపడం లేదు.
పైగా ఈసారి ముందస్తుగానే పుస్తకాలను ముద్రించేందుకు చర్యలు చేపట్టింది. ఇప్పటికే పాఠ్య పుస్తకాల ముద్రణ ప్రారంభమైంది. అయినా ప్రభుత్వ పాఠ్య పుస్తకాలను తప్పకుండా వినియోగించాలన్న ఉత్తర్వులను జారీ చేయలేదు. పైగా ప్రైవేటు యాజమాన్యాలు అడిగితేనే వారికి తమ పుస్తకాలను ఇస్తామని విద్యాశాఖ చెబుతోంది. ఈ విషయంలో ప్రభుత్వ పెద్దల నుంచి వచ్చిన ఒత్తిడి కారణంగానే విద్యాశాఖ మిన్నకుండిపోయినట్లు కొంతమంది అధికారులు పేర్కొంటున్నారు.
నిజంగా అంత స్థాయి లేదా?
నిబంధనల ప్రకారం ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లు ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు విద్యాశాఖ నిర్దేశిత సిలబస్ పుస్తకాలనే వినియోగించాలి. కానీ ప్రైవేటు యాజమాన్యాలు అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నాయి. పబ్లిషర్లు ఇచ్చే కమీషన్ల కోసం 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు ప్రైవేటు పుస్తకాలను వినియోగిస్తున్నాయి. మరింత లాభం కోసం తమ పాఠశాలల్లోనే విక్రయిస్తున్నాయి. పైగా ప్రభుత్వ సిలబస్ కంటే ప్రైవేటు పబ్లిషర్ల పుస్తకాల స్థాయి మెరుగ్గా ఉందని చెబుతున్నాయి. గతేడాది ఇదే వాదనను తెరపైకి తెచ్చాయి.
ప్రైవేటు పబ్లిషర్ల పుస్తకాల స్థాయికి అనుగుణంగా ప్రభుత్వ నిర్దేశిత పుస్తకాలను మెరుగుపరిస్తే అమలు చేసేందుకు తమకు అభ్యంతరం లేదని పేర్కొన్నాయి. మరి నిజంగానే ౖప్రైవేటు పబ్లిషర్ల పుస్తకాలు మెరుగ్గా ఉన్నాయా? ఉంటే వాటి స్థాయికి ప్రభుత్వ పుస్తకాలను ఎందుకు డెవలప్ చేయడం లేదనన్నది ప్రధాన ప్రశ్న. ప్రభుత్వ పాఠశాలల్లోనూ ఆ స్థాయి విద్యను అందించేందుకు ఎందుకు చర్యలు చేపట్టడం లేదన్న వాదన ఉంది. అయితే ఇందులో మెరుగైన బోధన, పుస్తకాల స్థాయి కంటే వ్యాపార ప్రయోజనాల కోసమే ప్రైవేటు పబ్లిషర్ల పుస్తకాలను వినియోగిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇదంతా విద్యాశాఖకు, ప్రభుత్వానికి తెలిసినా పట్టించుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.