‘ఇంగ్లిష్‌’తో బాలలకు బంగారు భవిత  | Government is leading the way towards social and economic development with English Medium | Sakshi
Sakshi News home page

‘ఇంగ్లిష్‌’తో బాలలకు బంగారు భవిత 

Published Mon, Nov 18 2019 3:12 AM | Last Updated on Mon, Nov 18 2019 3:12 AM

Government is leading the way towards social and economic development with English Medium - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియం ప్రవేశపెట్టాలన్న నిర్ణయంతో సామాజిక, ఆర్థికాభివృద్ధి సాధన దిశగా ప్రభుత్వం పెద్ద ముందడుగు వేసిందని పాఠశాల విద్యా నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌ చైర్మన్‌ జస్టిస్‌ రెడ్డి కాంతారావు పేర్కొన్నారు. పేద, మధ్యతరగతి వర్గాల బాలల బంగారు భవితకు ప్రభుత్వం బాటలు వేసిందన్నారు. ‘సాక్షి’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ప్రైవేటు విద్యా సంస్థలు విద్యా వ్యవస్థను హైజాక్‌ చేశాయని కుండబద్దలు కొట్టారు. ఈ పరిస్థితిని మార్చి విద్యా వ్యవస్థను పరిరక్షించడానికి ప్రభుత్వ చర్య దోహదపడుతుందన్నారు. ఇంగ్లిష్‌ మీడియంతో తెలుగు భాష ఉనికికి, ప్రాభవానికి ఎలాంటి ముప్పూ లేదని తేల్చిచెప్పారు. తెలుగు ఒక తప్పనిసరి సబ్జెక్టుగా ఉంటుందన్నారు. విద్యార్థులు ఇతర సబ్జెక్టులను మాత్రమే ఇంగ్లిష్‌లో నేర్చుకుంటారన్నారు. వివిధ అంశాల గురించి ఇంకా ఆయన ఏమన్నారంటే.. 

పోటీ ప్రపంచంలో మెరుగైన అవకాశాలు.. 
ఇంగ్లిష్‌ మీడియం కోసమే మధ్యతరగతి వర్గాలు తమ పిల్లలను ప్రైవేటు పాఠశాల్లో చేరుస్తూ తలకు మించిన ఆర్థికభారాన్ని భరిస్తున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పేద విద్యార్థులు నైపుణ్యాల సాధనలో వెనుకంజలో ఉంటున్నారు. ఇంగ్లిష్‌ మీడియం వల్ల ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలు చేరితే వారి తల్లిదండ్రులపై ఆర్థిక భారం తగ్గిపోతుంది. అంతేకాకుండా పోటీ ప్రపంచంలో పేద, మధ్యతరగతి విద్యార్థులు కూడా బాగా> రాణించి మెరుగైన అవకాశాలను అందిపుచ్చుకుంటారు. దాంతో రాష్ట్రంలో సామాజిక, ఆర్థికాభివృద్ధి సాధ్యపడుతుంది.  

విద్యావేత్తలు, నిపుణులతో చర్చించే నిర్ణయం  
ప్రభుత్వం ఇంగ్లిష్‌ మీడియం ప్రవేశపెట్టాలన్న నిర్ణయాన్ని విద్యావేత్తలు, నిపుణులు, సామాజికవేత్తలతో చర్చించాకే తీసుకుంది. వాస్తవానికి.. ఇంజనీరింగ్, మెడికల్, ఇతర ప్రొఫెషనల్‌ కోర్సుల విద్యాభ్యాసం అంతా ఇంగ్లిష్‌లోనే ఉంటోంది. పాఠశాల విద్యాభ్యాసం తెలుగులో చేసినా ఉన్నత విద్య ఇంగ్లిష్‌లో చదవాల్సి రావడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అదే పాఠశాల విద్య నుంచే ఇంగ్లిష్‌ మీడియంలో చదివితే సమస్యలు ఉండవు.  

ప్రభుత్వ విద్యా వ్యవస్థ బలోపేతం  
విద్యార్థుల తల్లిదండ్రులు ప్రభుత్వ నిర్ణయాన్ని సంపూర్ణంగా సమర్థిస్తున్నారు. అంతిమంగా తల్లిదండ్రుల అభిప్రాయాన్నే ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాలి. ప్రభుత్వ పాఠశాలల్లో పూర్తిగా ఇంగ్లిష్‌ మీడియం ప్రవేశపెట్టడం సాధ్యమా అని సందేహించాల్సిన అవసరం లేదు. ప్రభుత్వ ఉపాధ్యాయులకు పూర్తి అర్హత, తగిన శిక్షణ ఉంది. ఇంగ్లిష్‌ మీడియంలో బోధన కోసం అదనపు శిక్షణ ఇచ్చేందుకు ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. ప్రైవేటు పాఠశాలల్లో నైపుణ్యం ఉన్న అధ్యాపకులు ఎక్కడున్నారు? ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేరికలు తగ్గిపోతుండటంతో పాఠశాలలు మూసేయాల్సి వస్తోంది. ఇంగ్లిష్‌ మీడియం విద్యాబోధనతో ప్రభుత్వ పాఠశాలల్లో చేరికలు పెరుగుతాయి. తద్వారా ప్రభుత్వ విద్యా వ్యవస్థ బలోపేతమవుతుంది.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement