ఇతర రాష్ట్రాలకు నమూనాగా ఏపీ విద్య AP education as a model for other states | Sakshi
Sakshi News home page

ఇతర రాష్ట్రాలకు నమూనాగా ఏపీ విద్య

Published Sat, Feb 3 2024 3:42 AM | Last Updated on Sat, Feb 3 2024 3:42 AM

AP education as a model for other states - Sakshi

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మొన్న జనవరి 30న ఒకటవ తరగతి నుంచే ఐబీ సిలబస్‌తో పాఠశాల విద్యను ప్రారంభించడానికి ఒక అంతర్జాతీయ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. ఇంగ్లిష్‌ మీడియంలో ప్రభుత్వ పాఠశాల విద్యను ప్రపంచ ప్రమాణాలకు అనుసంధానం చేయడంలో ఇది మరో ప్రధాన అడుగు. విద్యార్థులు దీంతో ఉమ్మడి సర్టిఫికెట్‌ పొందుతారు.

విజ్ఞాన భారత్‌ను నిర్మించడంలో భాగంగా, ఏపీ ప్రభుత్వం అసాధారణ రీతిలో పాఠశాల విద్యపై దృష్టి సారించిందన్న విషయం, గణతంత్ర దినోత్సవం నాడు ప్రదర్శించిన రాష్ట్ర శకటంలో ప్రతిఫలించింది. గ్రామీణ పాఠశాల విద్య నుండి ప్రపంచ స్థాయి తత్వవేత్తలు, శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు, వైద్యులను సృష్టిస్తుందని ప్రపంచానికి చాటడానికి ప్రదర్శించిన అత్యంత గొప్ప భవిష్యత్‌ శకటం ఇది.

న్యూఢిల్లీలోని కర్తవ్య పథ్‌లో జరిగిన 2024 గణతంత్ర దినోత్సవ పరేడ్‌లో, ‘పాఠశాల విద్య పరివర్తన’ థీమ్‌తో ఒక శకటాన్ని ప్రపంచ, జాతీయ నాయకత్వం ముందు ప్రదర్శించడం ద్వారా భవిష్యత్తుకు సంబంధించి ఆంధ్ర ప్రదేశ్‌ ప్రభుత్వం ఓ కొత్త దృక్పథాన్ని చూపించింది. విద్యార్థులు, ఉపాధ్యాయులు పాడుతూ, నృత్యాలు చేస్తూ శకటం వెంట కదిలారు. అధికారులు సృజనాత్మకంగా నిర్మించిన ఆ శకటాన్ని పరేడ్‌లో ఉంచడానికి ఏపీ ముఖ్యమంత్రికి ధైర్యం, విశ్వాసం అవసరం. దాన్ని వీక్షించిన అంతర్జాతీయ, జాతీయ వీక్షకులు చాలా ఉత్సా హంగా చప్పట్లు కొట్టారు. ఎందుకంటే ఇది ఇతర రాష్ట్ర శకటాల కంటే ఒక ప్రధాన వ్యత్యాసాన్ని కనబర్చింది.

‘సకల విద్యలకు మేమే సాటి / విశ్వ విద్యకు మేమే పోటీ’ అంటూ పిల్లలు పాడారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో పేద పిల్లల కోసం అందిస్తున్న ఇంగ్లిష్‌ మీడియం విద్యా నాణ్యత గురించి ఈ పాట చెబుతుంది. తమ పాఠశాల యూనిఫారంలో నిల బడి ఉన్న విద్యార్థులు వారి టాబ్లెట్‌లు, ద్విభాషా పుస్తకాలను చూపు తున్నారు. ఉపాధ్యాయులు నైపుణ్యాలను, జ్ఞానాన్ని నేర్చుకోవడంలో వారికి సహాయం చేస్తున్నారు. భారతదేశం తన గ్రామీణ పాఠశాల విద్య నుండి ప్రపంచ స్థాయి తత్వవేత్తలు, శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు, వైద్యులను సృష్టిస్తుందని ప్రపంచానికి చాటడానికి ప్రదర్శించిన అత్యంత గొప్ప భవిష్యత్‌ శకటం ఇది. గణతంత్ర దినోత్సవ అతిథిగా వచ్చిన ఫ్రా¯Œ ్స అధ్యక్షుడు మెక్రాన్  దానిని ఆసక్తితో చూశారు. పాఠశాల విద్యకు సంబంధించిన పరివర్తన సందేశం గురించి ఒక అనువాద కుడు ఆయనకు వివరించడం కనిపించింది.

గత 74 సంవత్సరాల్లో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా రిపబ్లిక్‌ డే పరేడ్‌లలో ఇలాంటి వినూత్న పాఠశాల విద్యా నమూనాను ప్రదర్శించలేదు. నాణ్యమైన విద్య కాకపోయినా, అక్షరాస్యత రేటును చూపించడానికి ధైర్యం చేయగల ఏకైక రాష్ట్రం కేరళ కూడా ఇన్నేళ్లుగా తమ పాఠశాల విద్యా విజయాన్ని ఏపీ ప్రభుత్వం రీతిలో జరుపుకోవాలని అనుకోలేదు. వాస్తవానికి, ప్రతి అధికార రాజకీయ పార్టీ తన పనితీరు, విధాన కార్యక్రమం ఆధారంగా ఎన్నికల్లో గెలవాలని ప్రయత్నిస్తుంది. కానీ పాఠశాల మౌలిక సదుపాయాల మెరుగుదలతో పాటు వైఎస్‌ జగన్‌ ప్రవేశపెట్టిన కొత్త ఇంగ్లిష్‌ మీడియం పాఠశాల విద్య, గ్లోబల్‌ పవర్‌ హౌజ్‌గా మారాలని భావిస్తున్న ప్రజాస్వామ్యంలో హృదయాన్ని కదిలించే విషయం. నాణ్యమైన పాఠశాల విద్య అనే ఆలోచనను జగన్‌ ప్రైవేట్‌ నుంచి పబ్లిక్‌గా మార్చారు.

మారుమూల గ్రామాల్లోని పేద  పిల్లలు తమ సొంత గ్రామంలోని పాఠశాలల్లో ఆధునిక ప్రపంచ నైపుణ్యాలను నేర్చుకుంటూ ఆత్మవిశ్వాసంతో, గౌరవంగా జాతీయ, ప్రపంచ మార్కెట్లలోకి రావాలని ఆశపడుతున్నారు. జగన్‌ తన ముందున్న అభివృద్ధి నమూనాకు విరుద్ధంగా ఈ అభివృద్ధి నమూనాను ఎంచుకున్నట్లు కనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు సింగపూర్‌ వంటి రాజధాని నగరం నిర్మించడానికి 30,000 ఎకరాల భూమిని సమీకరించడంలో రాష్ట్ర వనరులను పెట్టుబడిగా పెట్టారు. ప్రభుత్వ రంగాన్ని ఏమాత్రం పట్టించుకోని ప్రైవేట్‌ రంగ పెట్టుబడి నమూనాయే ఆయన నమూనా. విద్యా రంగంలో కూడా ప్రైవేట్‌ పెట్టుబడిదారులను ఆయన ప్రోత్సహించారు.

ఏపీ శకటం ఇతర రాష్ట్ర శకటాలతో పోలిస్తే భిన్నంగా ఉంది. గత వైభవం, స్వాతంత్య్ర పోరాట చిహ్నాలు, మతపరమైన చిహ్నాలు లేదా వారి గిరిజన, సాదాసీదా జీవన స్త్రీలను మిగతా రాష్ట్రాలు ప్రదర్శించాయి. ఈ ఏడాది రిపబ్లిక్‌ పరేడ్‌ కవాతును దేశంలో మహిళా సాధి కారతను ప్రత్యేకంగా ప్రదర్శించడానికి ఉద్దేశించారు. సైన్యంలోని అన్ని విభాగాల్లో, ఇస్రో వంటి వైజ్ఞానిక కార్యకలాపాలలో, ప్రతి రంగంలో దేశం మహిళలను ఎలా ప్రోత్సహిస్తోందో ప్రపంచానికి చూపించడానికి దీన్ని రూపొందించారు.

అంతరిక్ష శాస్త్రంలో తన సొంత మహిళా శక్తిని ‘ఇస్రో’ తన శకటంలో ఉంచింది. ఆ రకంగా అది దాని సొంత భవిష్యత్తు యోగ్యతను కలిగి ఉంది. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్‌ (రామ్‌ లల్లాపై తన శకటాన్ని రూపొందించింది) వంటివి తమ సాంప్రదాయ నృత్యం చేసే మహిళలతో తమ శకటాలను రూపొందించాయి. కానీ ప్రపంచీకరణ యుగంలో ఆధునికమైన, చక్కగా అమర్చిన ఇంగ్లిష్‌ మీడియం విద్యతో, పాఠశాల విద్యను ఈ దేశ భవిష్యత్తుగా చూపిన ఏకైక రాష్ట్రం ఏపీయే.

ఇప్పటికీ అర్ధ–మధ్యయుగ జీవన వ్యవస్థలతో వేలాడుతున్న గిరిజన (ఈశాన్య రాష్ట్రాలు, ఛత్తీస్‌ గఢ్, జార్ఖండ్‌ మొదలైనవి) లేదా గిరిజనేతర మహి ళల భవిష్యత్తు సవాళ్లు ఏమిటో ఆ యా రాష్ట్రాలు చూపలేదు. ముస్లిం మహిళల స్థితిగతులు ఏమిటో ఏ శకటమూ చెప్పలేదు. కశ్మీర్‌ నుంచి కనీసం అలాంటి ఒక్క శకటాన్నయినా తేవాల్సింది.రాష్ట్ర చరిత్రను చూపించడం ఒక విషయం; పిల్లలకు చక్కగా, ప్రణాళికాబద్ధమైన విద్యనుఅందించడం ద్వారా దేశ భవిష్యత్తును చూపించడం మరొక విషయం.

ఆంధ్రప్రదేశ్‌ దీనిని స్పష్టమైన విజన్ తో చేసింది. ఏపీ శకటం కదులుతుండగా ప్రధాని నరేంద్ర మోదీ దాన్ని జాగ్రత్తగా గమనించారు. ఆయన సొంత గుజరాత్‌ మోడల్‌ కూడా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఇంగ్లిష్‌ మీడియం విద్యను అంత బాగా అందించలేకపోయింది. గుజరాత్‌ కూడా ఇప్పుడు నాణ్యమైన ఇంగ్లిష్‌ మీడియం విద్య కోసం ప్రైవేట్‌ పాఠ శాలలపై ఆధారపడుతోంది. అది కూడా ధనవంతులకు మాత్రమే అందుబాటులో ఉంది.

భారతదేశం పాశ్చాత్య దేశాలతో, చైనాతో పోటీ పడాలని ఆకాంక్షిస్తున్నప్పుడు, తమ సొంత ప్రాంతీయ భాషలో చక్కటి పునాది కలిగివుండి, ఆంగ్ల మాధ్యమంలో నాణ్యమైన విద్యను అందించడమే ఏకైక మార్గం. జగన్‌ మోహన్‌ రెడ్డి చైతన్యపూర్వకమైన ప్రయత్నంతో నాణ్యమైన ఇంగ్లిష్‌ మీడియం విద్యపై ఆంధ్రా విద్యార్థులకు విశ్వాసం ఏర్పడింది. ఇప్పుడు దాన్నే వైఎస్‌ జగన్‌ తన ఎన్నికల ఆయుధంగా మలుచుకున్నారు. ఆ ఆలోచనతోనే ఢిల్లీలో రిపబ్లిక్‌ డే పరేడ్‌లో పాఠ శాల విద్యా శకటాన్ని ప్రదర్శింపజేశారు.

పాఠశాల విద్యలో కేంద్రం లేదా రాష్ట్రం ఏదైనా పెద్ద సానుకూల అడుగు వేసిందంటే తప్పనిసరిగా అభినందించాలి. దేశ భవిష్యత్తు అక్కడే ఉంది. సైద్ధాంతిక విభేదాలు ఏ విషయంలోనైనా ఉండవచ్చు, కానీ ప్రైవేట్‌ పాఠశాలలతో సమానంగా నాణ్యమైన పాఠశాల విద్యను ప్రభుత్వ పాఠశాలల్లో అందించడంలో కచ్చితంగా విభేదాలు ఉండ కూడదు. అప్పుడు మాత్రమే పిల్లల భవిష్యత్తుకు ఎదురుదెబ్బ తగ లదు.

ఏ పిల్లవాడు అయినా రెండు భాషలను చాలా సులభంగా నేర్చు కోగలడు. మన విషయంలో అది ఇంగ్లిష్, పిల్లల ప్రాంతీయ భాష అయి ఉండాలి. కేంద్ర ప్రభుత్వం కూడా ఆంధ్రా విద్యా నమూనాను అర్థం చేసుకుంటుందని, అభినందిస్తుందని ఎవరైనా ఆశిస్తారు. 

- వ్యాసకర్త ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త
- ప్రొ‘‘ కంచ ఐలయ్య షెపర్డ్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement