ఇంటింటా ఇంగ్లిష్‌ వసంతం | Sakshi Guest Column On English Medium Education In Andhra Pradesh | Sakshi
Sakshi News home page

ఇంటింటా ఇంగ్లిష్‌ వసంతం

Published Wed, Oct 4 2023 3:59 AM | Last Updated on Wed, Oct 4 2023 3:59 AM

Sakshi Guest Column On English Medium Education In Andhra Pradesh

ఈ 2023 అక్టోబర్‌ 5... 206వ భారతీయ ఇంగ్లిష్‌ దినోత్సవం. భారతదేశంలో పరిపాలనా భాషగా మనుగడ సాగించిన ఈ 206 సంవత్సరాల్లో ఇంగ్లిష్‌ అతి సంపన్నుల ఆస్తిగా మిగిలిపోయింది. దేశంలో అతి ధనవంతులు లేక స్థిరమైన వేతనం పొందేవారు మాత్రమే తమ పిల్లలకు ఇంగ్లిష్‌ మీడియం విద్యను చెప్పించగలిగారు. కానీ ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ మోహన్ రెడ్డి గత నాలుగేళ్ల కాలంలో భారతదేశంలోని విద్యా నమూనానే మార్చివేశారు. ఈ నమూనాలో వ్యవసాయ కార్మికుల పిల్లలు, ఆదివాసీలు, చేతివృత్తుల వారితోపాటు, పేదల్లోకెల్లా నిరుపేదలు కూడా కేవలం ఇంగ్లిష్‌ మాధ్యమం విద్యనే కాదు, పూర్తిగా భిన్నమైన విద్యను పొందుతున్నారు.

మన దేశంలో అతి ధనవంతులు లేక సక్రమంగా ఉద్యోగం చేస్తూ స్థిరమైన వేతనం పొందేవారు మాత్రమే తమ పిల్లలకు పరిమితమైన స్థాయి నుండి ఉన్నత తరగతి ఇంగ్లిష్‌ మీడియం విద్యను చెప్పించగలిగారు. దేశంలోని అన్ని పార్టీలకు చెందిన రాజకీయ నాయకులందరూ తమ పిల్ల లను ఇంగ్లిషు మీడియంలో చదివించేవారు. నాగాలాండ్‌ వంటి చిన్న ఈశాన్య రాష్ట్రాలు మాత్రమే ప్రభుత్వ పాఠశాలల్లోని పిల్లలందరికీ ఏదో ఒక రకమైన ఇంగ్లిష్‌ మాధ్యమ విద్యను అందిస్తున్నాయి.

రాజధాని ఢిల్లీ నుంచి దేశాన్ని అత్యధిక కాలం పాలించిన భారత జాతీయ కాంగ్రెస్, 15 ఏళ్లకు పైగా దేశాన్ని పాలించిన బీజేపీ వంటి జాతీయ పార్టీలు ఇప్పుడు ఇంగ్లిష్‌ భాషా విద్యను ధనవంతులకు సొంతం చేశాయి. ఈ పార్టీల అభివృద్ధి నమూనాలో పాఠశాల విద్యకు అతితక్కువ ప్రాధాన్యత మాత్రమే లభించింది.

వెనుకబడిన నైజాం రాష్ట్రంలో సరైన తెలుగు మీడియం పాఠశాల కూడా లేని ఒక కుగ్రామంలో పుట్టి, ఇంగ్లిష్‌ నేర్చుకోవడంలో దుర్భ రమైన కష్టాన్ని అనుభవించిన వ్యక్తిగా బతికిన నేను, జగన్ మోహన్‌ రెడ్డి చేస్తున్నట్టుగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి పాఠశాల విద్యపై ఇంత శ్రద్ధ చూపుతారని ఎన్నడూ ఊహించలేదు.

నా 71 ఏళ్ల సుదీర్ఘ జీవితంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనూ, విడిపోయిన ఏపీ, తెలంగాణలలో అనేక మంది ముఖ్యమంత్రులను చూశాను. నేను అనేక రాష్ట్రాల్లో పర్యటించాను. ముఖ్యమంత్రుల, ప్రధాన మంత్రుల పరిపాలనా పద్ధ తుల గురించి చదివాను. అయితే పాఠశాల విద్యా కార్యక్రమాలకు ఏపీ ముఖ్యమంత్రి వెచ్చిస్తున్నంత సమయాన్ని ఏ ముఖ్యమంత్రి కానీ, ప్రధాన మంత్రి కానీ వెచ్చించలేదు.

గతంలో సిద్ధరామయ్య కర్ణాటకకు మొదటి దఫా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, పినరయి విజయన్‌ రెండు పర్యాయాలు కేరళ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను వారితో మాట్లాడి ఆ రాష్ట్రాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మాధ్యమాన్ని ప్రవేశపెట్టాలని అభ్యర్థించాను. అయితే అగ్రవర్ణ మేధాజీవులకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకోవడానికి ఆ ఇద్దరూ భయపడ్డారు. కర్ణాటక, కేరళ, తమిళనాడు ప్రభుత్వ పాఠశాలల్లో పేదల్లోకెల్లా నిరుపేదలకు ఈ రోజువరకూ ఇంగ్లిష్‌ మీడియం విద్యను అందించడం లేదు.

దీన్ని అలా పక్కన బెడితే రాష్ట్ర విద్యావ్యవస్థ పనితీరును సమీక్షించడానికి ఏ ముఖ్య మంత్రీ జగన్‌లా పాఠశాల విద్యపై ఇంత డబ్బు, సమయం, శక్తి వెచ్చించలేదు. ‘నా రాష్ట్ర పిల్లలకు ఉత్తమమైన విద్యను అందించాలని కోరుకుంటున్నాను, అదే వారి భవిష్యత్‌ ఆస్తి’ అని జగన్ మోహన్‌ రెడ్డి పదేపదే చెప్పారు. పాఠశాల, కళాశాల పిల్లల తల్లుల ఖాతాల్లో ఏడాదికి సుమారు 35 వేల రూపాయలు జమ అవుతున్నాయి. ఆ డబ్బును వారు తమ విద్యా అవసరాలకు ఖర్చు చేస్తారు. పిల్లల బూట్లు, బ్యాగుల నాణ్యత, మధ్యాహ్న భోజనం, మరుగుదొడ్ల సౌకర్యాలు వంటివాటిపై ఏపీ ముఖ్యమంత్రి నిత్యం సమీక్షిస్తున్నారు.

దేశంలోని ఏ భాగానికి చెందిన పాఠశాల మౌలిక సదుపాయాలు కూడా భారతదేశ చరిత్రలో ఏపీలోని పిల్లలకు ఉన్న నాణ్యతతో ఎన్నడూ లేవు. ప్రభుత్వ పాఠశాల భవనాల నిర్మాణాన్ని రాష్ట్ర మౌలిక సదుపాయాల అభివృద్ధి అని ఎప్పుడూ నిర్వచించలేదు. బడా కాంట్రాక్టర్లకు పనులు అప్పగించి వారిని బలిపించడం నుంచి చిన్న కాంట్రాక్టర్ల దిశగా అభివృద్ధి ఆలోచనలను జగన్ మోహన్‌ రెడ్డి మార్చి వేశారు. ఇలాంటి చిన్న కాంట్రాక్టర్లు ఇప్పుడు గ్రామ, పట్టణ మార్కెట్లలో డబ్బు ఖర్చు చేస్తున్నారు. నిర్మాణ పనుల్లో వేతనాలు పొందే కార్మికులు గ్రామాలు, పట్టణాలలో విస్తరించారు. ఈ నమూ నాలో అభివృద్ధి పెద్ద నగరాల్లో మాత్రమే కేంద్రీకృతం కాదు. గ్రామ మార్కెట్లు ఎంతగానో పుంజుకుంటాయి.

అదే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో మొదటి ఐదేళ్ల చంద్రబాబు పాలనను, తెలంగాణలో చంద్రశేఖర్‌ రావు పదేళ్ల పాలనను చూశాను. వారు తమ తమ రాష్ట్రాల్లోని పాఠశాల విద్యా నిర్మాణాలను ఎప్పుడూ సమీక్షించలేదు. ముఖ్యమంత్రి కార్యాలయం ఎప్పుడూ రాష్ట్ర పేద పిల్లల జీవితం, అభివృద్ధి గురించి చర్చించే స్థలంగా ఉండలేదు. పాఠ శాల, కళాశాల విద్యను కార్పొరేట్‌ వ్యాపార సంస్థలకు అప్ప జెప్పడంలో వీరు పేరొందారు.

కానీ జగన్ మోహన్‌ రెడ్డి గ్రామీణ పాఠశాలలకు వైఫై, స్మార్ట్‌ టీవీలు ఇవ్వడమే కాకుండా జాతీయ, అంతర్జాతీయ వినూత్న విద్యా పద్ధతులను సమీక్షిస్తూ, గ్రామీణ పాఠశాలలకు వాటిని జోడిస్తూనే ఉన్నారు. జాతీయ, ప్రాంతీయ పార్టీల ఆధ్వర్యంలో నడిచే దేశం, రాష్ట్రాలు ఈ ఏడాది భారతీయ ఇంగ్లిష్‌ దినోత్స వాన్ని జరుపుకోవాల్సిన నేపథ్యం ఇది. 

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును అరెస్ట్‌ చేసిన తర్వాత ఆయన కుమారుడు లోకేష్, కోడలు బ్రాహ్మణి మాట్లాడటం నేను టీవీ ఛానళ్లలో చూశాను. తెలుగు కంటే వారి ఇంగ్లిష్‌ చాలా బాగుంది. ఎందుకు? వారు అగ్రశ్రేణి ఇంగ్లిష్‌ మాధ్యమ పాఠశాలల్లోనూ, అమెరికాలో కూడా చదువుకున్నారు. కానీ ఆ కుటుంబం, ఆయన పార్టీ 2019లో ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మాధ్యమాన్ని ప్రవేశపెట్టడాన్ని వ్యతిరేకించాయి. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మాధ్యమాన్ని ప్రవేశ పెట్టడానికి జగన్‌ కోర్టు పోరాటాలు, మీడియా పోరాటాలు చేయాల్సి వచ్చింది.

ఏపీకి చెందిన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు,  భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎం.వి.రమణ ఆ విధానాన్ని వ్యతిరేకించారు. అయినా ప్రభుత్వ బడుల్లో ఇంగ్లిష్‌ మీడియం చదువు తున్న నిరుపేదలకు, తల్లులకు ఆర్థిక సాయంతో జగన్ మోహన్‌ రెడ్డి అండగా నిలిచారు. అలాంటి కార్మిక పిల్లలు ఇంగ్లిష్‌ మాట్లాడే సుసంపన్న దేశమైన అమెరికాకు వెళ్లి ఐక్యరాజ్యసమితి విద్యా సమావే శాలలో, వైట్‌ హౌస్‌లో ధైర్యంగానూ, విశ్వాసంతోనూ మాట్లాడారు. ఎక్కడికి వెళ్లినా ప్రేక్షకుల నుంచి చప్పట్లు స్వీకరించారు. ఇది కచ్చితంగా భారతదేశ భవిష్యత్‌ పాఠశాల విద్యా వ్యవస్థకు ప్రేరణాత్మక ఉదాహరణ.

ఈ రోజు పేదలు, గ్రామ పిల్లలు ఇంగ్లిష్‌ నేర్చుకోవడంపై సంబ రాలు జరుపుకోవాల్సిన అవసరం ఉంది. 1817లో మన జాతీయ జీవనంలోకి వచ్చిన ఇంగ్లిష్‌ విద్య కొత్త మార్గాన్ని సుగమం చేసింది. కొత్త ఆశను సృష్టించింది. మన విద్యావ్యవస్థలో ఇద్దరు సంస్కర్తలు విలియం కేరీ, రాజా రామ్మోహన్‌ రాయ్‌ 206 సంవత్సరాల క్రితం అక్టోబర్‌ 5న మొదటి పాఠశాలను ప్రారంభించారు. అయితే ఆ భాషా ఫలాలు వ్యవసాయాధారిత ప్రజానీకానికి, పట్టణ పేదల పిల్లలకు ఇప్పటికీ చేరలేదు. ఉన్నత స్థాయి ఇంగ్లిష్‌ మీడియం పాఠశాల విద్య నుండి వచ్చిన ఏ విద్యావేత్త కూడా సమాన విద్యా మాధ్యమం కోసం పోరాడలేదు.

మన దేశంలో ప్రాంతీయ భాషల వేడుకలను ఎవరూ వ్యతిరేకించరు. కానీ అదే సమయంలో భారతీయ ఇంగ్లిష్‌ను సెలబ్రేట్‌ చేసుకోవడం, ఆ ప్రపంచ భాషని మన గ్రామాల్లోకి విస్తరించడం అనేది మన సొంత రూపాంతరంలో ఇంగ్లిష్‌ని తీర్చిదిద్దుతుంది. 206 సంవత్సరాల పాటు ఇంగ్లిష్‌ అగ్రవర్ణ ధనవంతులు భద్రపరుచు కున్నదిగా ఉండిపోయింది.

ఇంగ్లిష్‌ భాషను ధనవంతుల ఇళ్లకు, ఉన్నత కార్యాలయాలకు, మాల్‌ మార్కెట్‌లకు, విమానాశ్రయాలకు పరిమితం చేయడం నేరం. ఇది గ్రామ మార్కెట్లు, గ్రామ బస్టాప్‌ లతోపాటు వ్యవసాయ క్షేత్రాలకు చేరుకోవాలి. అక్కడే అది మరింతగా భారతీయతను సంతరించుకుంటుంది. ఏ భాషనూ ఒక వర్గ ప్రజల ఆస్తిగా పరిగణించకూడదు.

జగన్‌ ప్రభుత్వం ఆ తొలి అడుగు వేసింది. ఇక నుంచి ప్రతి సంవత్సరం ఇండియన్‌ ఇంగ్లిష్‌ను వేడుకగా జరుపుకొని, ఆ రోజున మన పిల్లలను, యువతను ఒక పుస్తకాన్ని చదివేలా చేద్దాం.

కంచ ఐలయ్య షెపర్డ్‌ 
వ్యాసకర్త ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement