
సాక్షి, అమరావతి: ప్రైవేట్ పాఠశాలలు, కాలేజీలు అధిక ఫీజులు వసూలు చేయకుండా నియంత్రణ చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. నిబంధనలు పాటించని ప్రైవేట్ విద్యా సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. వీటిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. విద్యాశాఖ కార్యక్రమాలపై ముఖ్యమంత్రి జగన్ శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీల్లో పరిస్థితులపై చర్చ జరిగింది. ప్రైవేట్ విద్యాసంస్థలు చాలా చోట్ల నిబంధనలను ఉల్లంఘిస్తున్నాయని అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు. కనీస ప్రమాణాలు కూడా పాటించడం లేదన్నారు. బహుళ అంతస్థుల భవనాల్లో గాలి వెలుతురు కూడా లేని గదుల్లో తరగతులు నిర్వహిస్తున్నాయని, అవాంఛనీయ పరిస్థితులు తలెత్తితే రక్షించేందుకు కనీస జాగ్రత్తలు కూడా తీసుకోవడం లేదని పేర్కొన్నారు. ఇలాంటి విద్యా సంస్థలపై ఉపేక్షించకుండా కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు.
ప్రభుత్వ పాఠశాలల్లోకి వలసలు మొదలు..
తల్లిదండ్రుల భాగస్వామ్యం ద్వారానే ప్రభుత్వ పాఠశాలల్లో పెనుమార్పులు సాధ్యమని, ఆ దిశగా ఇటీవల పలు నిర్ణయాలు తీసుకున్నామని సీఎం జగన్ చెప్పారు. మరుగుదొడ్ల నిర్వహణ, ఇతర కార్యక్రమాలకు విరాళాలు ఇవ్వడం ద్వారా స్కూళ్ల అభివృద్ధిలో పాలు పంచుకుంటున్న తల్లిదండ్రుల పేర్లను స్కూళ్లలో నోటీసు బోర్డులపై ప్రదర్శించాలని సూచించారు. విరాళాలు అందించేందుకు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారని, ప్రభుత్వం పిలుపునిచ్చిన రూ.1,000 కంటే ఎక్కువగా ఇస్తున్నారని అధికారులు తెలిపారు. ప్రైవేట్ నుంచి ప్రభుత్వ పాఠశాలల్లోకి విద్యార్థుల వలస ప్రారంభమైందన్నారు. స్కూళ్లలో మధ్యాహ్న భోజనంలో కొత్త మెనూ అమల్లోకి తెచ్చాక విద్యార్థులు ఆహార పదార్ధాలను చాలా ఇష్టంగా తింటున్నారని చెప్పారు. ఏప్రిల్ నుంచి నాణ్యమైన బియ్యాన్ని దశలవారీగా అందుబాటులోకి తెస్తున్నందున మధ్యాహ్న భోజనం మరింత నాణ్యంగా ఉంటుందని సీఎం అభిప్రాయపడ్డారు.
తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో విద్యాశాఖ కార్యక్రమాలపై సమీక్ష నిర్వహిస్తున్న సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
నాణ్యతగా నాడు–నేడు
ప్రభుత్వ స్కూళ్ల రూపురేఖలను సమూలంగా మార్చే ‘మనబడి నాడు–నేడు’ అమలుపై ముఖ్యమంత్రి సమీక్ష చేశారు. నాడు–నేడు పనుల్లో ఎక్కడా నాణ్యత తగ్గరాదని స్పష్టం చేశారు. తొలి విడత నాడు–నేడు కార్యక్రమాలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. రెండు, మూడు విడతల్లో చేపట్టాల్సిన కార్యక్రమాలకు మే నెల మధ్యలో టెండర్ల ప్రక్రియ ప్రారంభమవుతుందని, అనంతరం పనులు ప్రారంభిస్తామని అధికారులు వివరించారు. సీఎం సమీక్షలో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, ఉన్నత, పాఠశాల విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ల చైర్మన్లు జస్టిస్ ఈశ్వరయ్య, జస్టిస్ కాంతారావు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
నాడు–నేడు తొలివిడత పనులు ఇలా...
పాఠశాలల సంఖ్య 15,715
- (8,853 ప్రైమరీ స్కూళ్లు, 3,068 అప్పర్ ప్రైమరీ స్కూళ్లు, 2,457 హైస్కూళ్లు, 1,337 రెసిడెన్షియల్ స్కూళ్లలో తొలివిడత పనులు ఆరంభం)
- రూ. 3,373 కోట్లతో ప్రతిపాదనలు పూర్తి
- 14,843 స్కూళ్లకు పరిపాలనా అనుమతులు
- 14,591 స్కూళ్లలో తల్లిదండ్రుల కమిటీలతో అవగాహనా ఒప్పందం
- 12,647 స్కూళ్లలో పనులకు భూమి పూజ
- బ్యాంకు ఖాతాలు తెరిచిన విద్యా కమిటీలు 14,851
రెండో విడత నాడు–నేడు
9,476 ప్రాథమిక పాఠశాలలు
- అప్పర్ ప్రైమరీ స్కూళ్లు 822
- హైస్కూల్స్ 2,771 స్కూళ్లు
- ప్రభుత్వ హాస్టళ్లు 1,407
- సంక్షేమ శాఖల జూనియర్ కళాశాలలు 458
మూడో విడత నాడు–నేడు
15,405 ప్రైమరీ స్కూళ్లు
- అప్పర్ ప్రైమరీ స్కూళ్లు 216
- హైస్కూళ్లు 41
- రెసిడెన్షియల్ స్కూళ్లు 63
- గవర్నమెంటు హాస్టళ్లు 248
- జూనియర్ కళాశాలలు 18