న్యూఢిల్లీ: కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కానున్నవేళ ప్రైవేటు స్కూళ్లు పెద్ద ఎత్తున ఫీజుల్ని పెంచినట్లు తేలింది. ‘లోకల్ సర్కిల్స్’ సంస్థ దేశవ్యాప్తంగా 9,000 మంది తల్లిదండ్రులు, పలు పాఠశాలలపై సర్వే నిర్వహించింది. 54 శాతం తల్లిదండ్రులు స్కూలు ఫీజులు 11–20 శాతం పెరిగాయని తెలపగా,15 శాతం తల్లిదండ్రులు ఫీజులు 20 శాతం పెరిగినట్లు వెల్లడించారు.
హరియాణా, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, గోవాల్లో 75 శాతం కంటే ఎక్కువ మంది తల్లిదండ్రులు ఫీజులు 10 శాతం కంటే ఎక్కువ పెరిగాయన్నారు. తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఢిల్లీలో 50–75 శాతం తల్లిదండ్రులు ఫీజులు 10 శాతం కంటే ఎక్కువ పెరిగాయన్నారు. గుజరాత్, బిహార్‌లలో ఫీజుల పెంపు 10 శాతం కంటే తక్కువగా ఉన్నాయి. ఫీజు వివరాలను పాఠశాలలు తమ తమ అధికారిక వెబ్‌సైట్లలో ఉంచాలని సీబీఎస్‌ఈ ఆదేశించింది.