నాణ్యమైన విద్యనందించాలి
నాణ్యమైన విద్యనందించాలి
Published Sat, Feb 11 2017 11:11 PM | Last Updated on Thu, Mar 21 2019 8:35 PM
వ్యాపార దృక్పధం విడనాడాలి
ప్రైవేట్ విద్యా సంస్థలకు కలెక్టర్ సూచన
ఘనంగా గ్రీన్ ఫీల్డ్ స్కూల్ వార్షికోత్సవం
వాకాడ(కరప) : ప్రైవేటు విద్యాసంస్థలు వ్యాపార దృక్పధంతో కాకుండా నాణ్యతమైన విద్యనందించాలని కలెక్టర్ అరుణ్‌కుమార్ సూచించారు. వాకాడలో శనివారం రాత్రి జరిగిన గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్కూల్ మూడో వార్షికోత్సవంలో ఆయన మాట్లాడారు. ఇప్పటివరకూ ఎందరో ఉన్నత చదువుల కోసం, ఉపాధి కోసం అమెరికా వెళ్లేవారని, కొత్త అధ్యక్షుడు ట్రంప్ అధికారంలోకి వచ్చాక ఉన్నత చదువుల కోసం అక్కడకు వెళ్లే అవకాలు తగ్గిపోయాయన్నారు. నైపుణ్యం, ఉన్నత ప్రమాణాలు గలవారికే అవకాశాలు ఉంటాయని, దాన్ని దృష్టిలో పెట్టుకుని విద్యతో పాటు అన్నింటిలోనూ ముందుండాలన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లల ఇష్టాలను గుర్తించి చదువుతో పాటు, వారు మక్కువ చూపే రంగాలల్లో కూడా నైపుణ్యవంతులుగా తీర్చిదిద్దాలని సూచించారు.
చిన్న వయస్సులోనే ఉన్నత చదువులు చదువుతూ టేబుల్ టెన్నిస్‌లో ప్రపంచ క్రీడాకారిణిగా గుర్తింపు పొందిన నైనా జైస్వాల్‌ను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ప్రపంచంలో చోటుచేసుకుంటున్న మార్పులకనుగుణంగా మహిళలకు విద్యనందించి, వారి బంగారు భవిష్యత్‌కు బాటలువేయాలని తల్లిదండ్రులకు కలెక్టర్ సూచించారు. ఎంతో ఖర్చుపెట్టి ఉత్తమ విద్యా సంస్థగా గ్రీన్ ఫీల్డు స్కూలును తీర్చిదిద్దిన యాజమాన్యాన్ని అభినందించారు.
అంతర్జాతీయ టీటీ క్రీడాకారిణి, ఇండియా యంగస్ట్ జర్నలిజమ్ గ్రాడ్యుయేట్ నైనా జైస్వాల్ మాట్లాడుతూ తల్లిదండ్రులు, గురువులు ఇచ్చిన ప్రోత్సాహంతో ఎనిమిదేళ్ల వయస్సులోనే 10వ తరగతి, 10 ఏళ్లకు ఇంటర్మీడియట్, 13 ఏళ్లకు జర్నలిజమ్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ప్రస్తుతం (16 ఏళ్లు) పాలిటిక్స్‌లో పీహెచ్‌డీ చేస్తున్నట్టు తెలిపారు. అంతర్జాతీయ స్థాయి టేబుల్ టెన్నిస్‌లో 6వ ర్యాంకులో ఉన్నానన్నారు. కష్టపడి కాకుండా ఇష్టపడి చదివితే ఉన్నత శిఖరాలు సాధించవచ్చని చెప్పారు. నిర్ధిష్టమై లక్ష్యం ఏర్పరచుకుని దాన్ని సాధించేందుకు కషిచేయాలన్నారు. గ్రీన్ ఫీల్డు విద్యా సంస్థ వ్యవస్థాపకులు గ్రంధి నారాయణరావు (బాబ్జీ) మాట్లాడుతూ చదువును పుస్తకాలకే పరిమితం చేయకుండా చదువుతో పాటు అన్నిరంగాల్లో విద్యార్థులను తీర్చిదిద్దేందుకు తమ సంస్థ కృషి చేస్తోందన్నారు. స్కూలు విద్యార్థులు సేకరించిన విరాళాలతో కొనుగోలుచేసిన ట్రై సైకిల్, కృత్రిమ అవయవాలను దివ్యాంగులకు కలెక్టర్ అరుణ్‌కుమార్, నైనా జైస్వాల్ అందజేశారు. కాకినాడ ఐడియల్ కళాశాలల కరస్పాండెంట్ డాక్టర్ పి.చిరంజీవిని కుమారి, గ్రీన్‌ఫీల్డు స్కూలు కార్యదర్శి జి.సుబ్బారావు, ప్రిన్సిపాల్ శిరీష్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement