
సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు స్కూళ్లలో ఫీజుల పెంపునకు ప్రాతిపదిక ఏంటో చెప్పాలని ప్రొఫెసర్ తిరుపతి రావు కమిటీని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఏటా 10 శాతం ఫీజులు పెంచుకోవచ్చని కమిటీ ఇచ్చిన నివేదికపై వివరణ కోరింది. ఓవైపు ప్రైవేటు స్కూళ్లలోని అడ్డగోలు ఫీజులు తగ్గించాలంటూ తల్లిదండ్రులు డిమాండ్ చేస్తుంటే.. మరోవైపు ఏటా మరో 10 శాతం ఫీజులు పెంచుకునేందుకు కమిటీ సిఫారసు చేయడంపై విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం కూడా ఇదే అంశంపై వివరణ ఇవ్వాలంటూ తిరుపతిరావు కమిటీని అడిగింది. ఈ మేరకు విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య పలు అంశాలపై కమిటీని వివరణ అడిగారు. వాటిపై స్పష్టత కోరుతూ కమిటీ కాల పరిమితిని మరో మూడు నెలలు పొడిగించారు.
ప్రభుత్వం ఏయే అంశాలపై వివరణ కోరిందంటే..
- ఏటా 10 శాతం ఫీజులు పెంచుకోవాలంటే ప్రస్తుతం ప్రైవేటు స్కూళ్లు వసూలు చేస్తున్న ఫీజులను అంగీకరించినట్టే కదా? ఇది ఏ మేరకు సమంజసం?
- ఫీజు పెంపును ఓవరాల్‌గా చూస్తే 10 శాతం కన్నా ఎక్కువగా ఉంటుందని తల్లిదండ్రులు అంటున్నారు. దీనిపై మీ సమాధానం ఏంటి?
- ఏ ప్రాతిపదికన ఫీజులు పెంచుకోవడానికి సిఫారసు చేశారు?
- జీవో నంబర్–1 అమలుకు చేపట్టాల్సిన చర్యలు, న్యాయ పరంగా ఉన్న అడ్డంకులను ఎందుకు సూచించలేదు?