శ్రీ చైతన్య.. కాదది.. తేజ | Duplicate School Established With Name Of Sri Chaitanya School | Sakshi
Sakshi News home page

శ్రీ చైతన్య.. కాదది.. తేజ

Published Thu, Aug 1 2019 12:20 PM | Last Updated on Thu, Aug 1 2019 12:20 PM

Duplicate School Established With Name Of Sri Chaitanya School - Sakshi

విద్యార్థి సంఘాల ఆందోళనలతో స్కూల్‌ బోర్డు మార్చిన యజమాన్యం

‘‘ఇక్కడ కనిపిస్తున్న రెండు ఫొటోల్లో ఉన్నది ఓ స్కూల్‌ బిల్డింగ్‌. ఈ ఫొటోల్లో ఒకటి ఉదయం తీసినదయితే... రెండోది మధ్యాహ్నం తీసిన ఫొటో. జాగ్రత్తగా గమనిస్తే ఆ భవనానికి తగిలించిన బోర్డులు మారినట్లు తెలుస్తోంది. ఉదయం తీసిన ఫొటోలో ‘శ్రీ చైతన్య స్కూల్‌ ’ అనే బోర్డు ఉండగా... రెండో ఫొటోలో ఆ బోర్డు మాయమై... స్కూల్‌ గేటుకు ‘తేజ ఇంగ్లిష్‌ మీడియం స్కూల్‌’ అనే బ్యానర్‌ కట్టారు. అనుమతి లేకపోయినా శ్రీచైతన్య స్కూల్‌ పేరుతో పాఠశాలలను నడుపుతున్నారని విద్యార్థి సంఘాలు చేసిన ఆందోళనతో కార్పొరేట్‌ బోర్డులను తొలగించి పాత స్కూల్‌ పేరుతో గల బ్యానర్‌ను తాత్కాలికంగా ఏర్పాటు చేశారు. అదీ ఈ ఫొటోల వెనుకున్న కథ...

సాక్షి, కరీంనగర్‌ : మామూళ్ల మత్తులో విద్యాశాఖ అధికారులు కళ్లు మూసుకోగా... పక్క రాష్ట్రపు కార్పొరేట్‌ విద్యాసంస్థలు ఎలాంటి అనుమతులు రాకపోయినా... యథేచ్ఛగా కరీంనగర్‌లోకి చొచ్చుకు వస్తున్నాయనడానికి ఇదో నిదర్శ నం. తీగలగుట్టపల్లి అపోలో హాస్పిటల్‌ ఎదురుగా ఉన్న తేజ ఇంగ్లిష్‌ మీడియం స్కూల్‌ను కొనుగోలు చేసిన శ్రీ చైతన్య గ్రూప్‌ ‘శ్రీ చైతన్య స్కూల్‌ టెక్నో కరిక్యులం’ పేరుతో బోర్డు ఏర్పాటు చేసి ఈ విద్యాసంవత్సరంలో అడ్మిషన్లు తీసుకొంది. ఖమ్మం జిల్లాకు చెందిన ఓ వ్యక్తిని బినామీగా చూపుతూ కార్పొరేట్‌ విద్యాసంస్థ ఈ పాఠశాలను ఏర్పాటు చేసింది. ఇదొక్కటే కాకుండా కరీంనగర్‌ సిటీలోనే వావిలాలపల్లిలో, అల్గునూరు, కమాన్‌ ప్రాంతాల్లో కూడా ఈ పాఠశాలలు ఏర్పాటై అడ్మిషన్లు కూడా ముగించారు. అయితే వీటికి దేనికీ విద్యాశాఖ నుంచి అనుమతులు లేకపోవడం గమనార్హం. వావిలాలపల్లిలో గతంలో అనుమతి లేకుండా శ్రీ చైతన్య పేరుతో నడుపుతున్నారని సీజ్‌ చేసిన పాఠశాల తిరిగి యధాతథంగా నడవడమే గాక, కొత్త విద్యాసంవత్సరం అడ్మిషన్లు కూడా పూర్తి చేసుకొంది. బుధవారం ఏఐఎస్‌ఎఫ్‌ విద్యార్థి సంఘం ఆందోళనల నేపథ్యంలో మరోసారి సీజ్‌ చేసేందుకు ప్రయత్నించగా, పాఠశాల యాజమాన్యం పాత స్కూల్‌ పేరుతో బ్యానర్లు కట్టింది. 

కళ్లు మూసుకున్న విద్యాశాఖ
గత ఫిబ్రవరి నెలలో అనుమతి లేకుండా శ్రీ చైతన్య పాఠశాల పేరుతో నాలుగు బ్రాంచీలు నడుపుతుండడంపై ఏబీవీపీ విద్యార్థి సంఘం ఆందోళన చేసింది. దాంతో ఆ స్కూల్‌ను సీజ్‌ చేసినట్టు జిల్లా విద్యాశాఖ మీడియాకు తెలిపింది. మళ్లీ ఏం అనుమతులు వచ్చాయని స్కూల్‌ యధాతథంగా నడిచిందో జిల్లా విద్యాశాఖాధికారికే తెలియాలి. సిక్‌ అయిన స్కూళ్లను కొనుగోలు చేసిన సదరు కార్పొరేట్‌  సంస్థ వరంగల్‌లోని విద్యాశాఖ రీజినల్‌ జాయింట్‌ డైరెక్టర్‌ ఎలాంటి అనుమతి రాకపోయినా, దర్జాగా బోర్డులు ఏర్పాటు చేసి పాఠశాలల పేరుతో ‘దుకాణాలు’ తెరిచి 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ‘వ్యాపారం’ సాగిస్తోంది. స్కూళ్లలోనే నోట్‌బుక్స్, టెక్టŠస్‌ బుక్స్, స్టడీ మెటీరియల్, యూనిఫారాలు, పెన్నులు, పెన్సిళ్లు కూడా విక్రయిస్తున్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే నాలుగు చోట్ల వందలాది మంది విద్యార్థులతో పాఠశాలల వ్యాపారం నడుస్తుంటే విద్యాశాఖ డీఈవోకు గానీ, మండలాల్లో ఉండే ఎంఈవోలకు గానీ తెలియకపోవడం.

ఈ విషయంలో అధికారుల నటనా కౌశల్యానికి పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించిన తల్లిదండ్రులు కూడా ముక్కున వేలేసుకునే పరిస్థితి. దీనిపై డీఈవో వెంకటేశ్వర్లును సంప్రదించగా... ‘ఒకే బోర్డుతో నాలుగు పాఠశాలలు నడపడం నిబంధనలకు విరుద్ధం. వెంటనే ఎంఈవోను పంపించి సీజ్‌ చేయిస్తాం. వరంగల్‌ ఆర్జేడీ వద్ద ఆయా స్కూళ్ల అనుమతులు పెండింగ్‌లో ఉన్నాయి. అయినా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే ఎవరినీ ఉపేక్షించం’ అనే అరిగిపోయిన రికార్డునే తిరిగి వినిపించడం జరుగుతోంది. విద్యాశాఖ, కార్పొరేట్‌ విద్యాసంస్థలు కుమ్మక్కై కరీంనగర్‌లో విద్యావ్యాపారం సాగిస్తున్న విషయం ఉన్నతాధికారులకు తెలిసినా, పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి. ప్రభుత్వంలోని కొన్ని పెద్ద తలకాయల అండతో కార్పొరేట్‌ విద్యాసంస్థ కరీంనగర్‌తో పాటు తెలంగాణ జిల్లాలో వేళ్లూనుకొంటోంది. 

ఉమ్మడి జిల్లానే టార్గెట్‌గా...
ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో శ్రీ చైతన్య విద్యాసంస్థ పలు చోట్ల బ్రాంచీలు తెరిచింది. ఖమ్మంకు చెందిన ఓ వ్యక్తి పేరిట ఈ స్కూళ్లన్నింటికీ అనుమతులు పొందే ప్రయత్నాల్లో ఉన్నారు. ఇప్పటికే గోదావరిఖని, జగిత్యాల, కోరుట్లలో ఈ విద్యాసంస్థ బ్రాంచీలు తెరిచింది. విద్యార్థుల తల్లిదండ్రుల బలహీనతలను సొమ్ము చేసుకొని టెక్నో, ఐఐటీ, ఫౌండేషన్‌ తదితర తోక పేర్లతో పాఠశాలలను ఏర్పాటు చేస్తున్నారు. 

త్వరలో నారాయణ.
శ్రీ చైతన్యతోపాటు నారాయణ విద్యాసంస్థ కూడా పాఠశాలల గేట్లు తెరిచేందుకు కరీంనగర్‌ను ఎంచుకొన్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇప్పటికే ఫైళ్లు సచివాలయం స్థాయిలో కదులుతుండగా, కరీంనగర్, పెద్దపల్లి, గోదావరిఖని, జగిత్యాల, సిరిసిల్ల, కోరుట్ల తదితర ప్రాంతాల్లో సిక్‌ స్కూళ్ల అన్వేషణలో ఏజెంట్లు బిజీగా ఉన్నారు. భాష్యం కార్పొరేట్‌ సంస్థ కూడా కరీంనగర్‌లో బ్రాంచీలు తెరిచే ఆలోచనలో ఉంది.

తెలంగాణ వచ్చాక ఎక్కువైంది..
తెలంగాణ రాష్ట్రంలో పరాయి పెత్తనం పెరిగింది. కరీంనగర్‌తోపాటు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో 60 పాఠశాలలు తెరిచేందుకు శ్రీచైతన్య ఏర్పాట్లు చేసుకొంది. త్వరలో నారాయణ కూడా రాబోతుంది. తెలంగాణ వచ్చాక అందరికీ తక్కువ ఖర్చుతో నాణ్యమైన విద్య దక్కుతుందని భావించిన జనానికి ఇది ఆశనిపాతం. విద్యతోపాటు సంస్కారాన్ని బోధించే స్థానిక ప్రైవేటు పాఠశాలలపై ఉక్కుపాదం మోపే కుట్ర జరుగుతోంది. ఒక వ్యక్తి పేరిట వందలాది పాఠశాలలకు అనుమతి ఎలా ఇస్తారు? ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈ విషయాన్ని ఆలోచించి తగిన చర్యలు తీసుకోవాలి. కరీంనగర్‌లో అనుమతి లేని శ్రీ చైతన్య పాఠశాలలను ఏ పేరుతో కూడా నడవకుండా సీజ్‌ చేయాలి.
– ట్రెస్మా ప్రధాన కార్యదర్శి యాదగిరి శేఖర్‌రావు 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement