సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు, టీచర్ల సంఖ్య క్రమంగా తగ్గిపోతోంది. ప్రైవేటు పాఠశాలల్లో టీచర్ల సంఖ్య పెద్దగా తగ్గకపోయినా విద్యార్థుల సంఖ్య భారీగా పెరిగింది. పాఠశాల విద్యాశాఖ తేల్చిన లెక్కల ప్రకారం విద్యా వాలంటీర్లు కలుపుకొని 2017–18 విద్యా సంవత్సరంతో పోల్చితే 2018–19లో 3,834 మంది టీచర్లు తగ్గిపోయారు. అదే ప్రైవేటు స్కూళ్లలో 280 మందే తగ్గారు. విద్యార్థుల విషయానికొస్తే ప్రభుత్వ పాఠశాలల్లో 39,107 మంది తగ్గగా, ప్రైవేటు పాఠశాలల్లో 77,447 మంది పెరిగారు.
స్కూళ్ల పరంగా చూస్తే ప్రైవేటు స్కూళ్లే అత్యధికంగా మూత పడ్డాయి. అయినా వాటిల్లో విద్యా ర్థుల సంఖ్య పెరగటం గమనార్హం. 2017–18 విద్యా సంవత్సరంతో పోల్చితే 2018–19 విద్యా సంవత్సరంలో ప్రైవేటులో 410 స్కూళ్లు మూత పడినా ఆ ప్రభావం విద్యార్థుల సంఖ్యపైనా పడలేదు. ప్రభుత్వ పాఠశాలల్లో పరిస్థితి ఇందుకు విరుద్ధంగా ఉంది. ఇక 2019–20 విద్యా సంవత్సరం లెక్కల్లో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు, టీచర్ల సంఖ్య మరింతగా తగ్గుతుందని విద్యాశాఖ వర్గాలే పేర్కొంటున్నాయి.
రూ.వేలకోట్లు వెచ్చిస్తున్నా..
రాష్ట్రంలో సమగ్ర శిక్షా అభియాన్ (ఎస్‌ఎస్‌ఏ) కింద వివిధ విద్యా పథకాలకు ఆమో దం తెలిపేందుకు రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ ఇటీవల కేంద్రానికి ఈ లెక్కలను అందజేసింది.అత్యధికంగా పట్టణ ప్రాంతాల్లోని స్కూళ్లే మూత పడినట్లు పేర్కొంది. పట్ట ణాల్లో 453 పాఠశాలలు మూత పడగా, గ్రామీణ ప్రాంతాల్లో 26 మూతపడ్డాయి. విద్యా పథకాల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏటా రూ.వేల కోట్లను వెచ్చిస్తున్నా ఫలితాలు ఆశించిన మేర రావడం లేదు.
సమగ్ర శిక్షా అభియాన్ కిందే ఏటా వెచ్చిస్తున్న రూ. 2 వేల కోట్లు కలుపుకొని ఏటా పాఠశాల విద్యకు రూ. 11 వేల కోట్లు కేటా యించినా ప్రభుత్వ బడులు విద్యార్థులను ఆకట్టులేకపోతున్నాయి. ప్రభుత్వ టీచర్లు సరిగ్గా చెప్ప రన్న అపవాదు, ప్రైవేటు పాఠశాలల ఆకర్షణీయ విధానాలతో తల్లిదండ్రులు తమ పిల్ల లను ప్రైవేటు స్కూళ్లలో చేర్పించేందుకే మొగ్గు చూపుతున్నారు. ఇటీవలి కాలంలో ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్లమాధ్యమం ప్రారంభించేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఆ ప్రభావం ఏ మేరకు ఉంటుందో వేచి చూడాల్సిందే.
కేంద్రానికి ఇచ్చిన లెక్కల్లో మరికొన్ని అంశాలు..
►రాష్ట్రంలో 2017–18 విద్యా సంవత్సరంలో మొత్తం స్కూళ్లు 42,834 ఉండగా, 2018–19లో వాటి సంఖ్య 42,355కు తగ్గిపోయింది. రాష్ట్ర వ్యాప్తంగా 479 స్కూళ్లు మూత పడ్డాయి. పట్టణ ప్రాంతాల్లో 453, గ్రామీణ ప్రాంతాల్లో 26 మూత పడ్డాయి.
►మూత పడిన వాటిలో ప్రైవేటువే అత్యధికంగా ఉన్నాయి. ప్రైవేటు స్కూళ్లు 410 మూత పడగా, మిగతావి ఎయిడెడ్, ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి.
►రాష్ట్రంలోని విద్యా సంస్థల్లో (ఇంటర్మీడియట్ కలుపుకొని) 2017–18 విద్యా సంవత్సరంలో 65,29,072 మంది విద్యార్థులు ఉండగా 2018–19 విద్యా సంవత్సరం వచ్చే సరికి వారి సంఖ్య 65,56,701 మందికి చేరుకుంది. అంటే పాఠశాలల్లో 27,629 మంది విద్యార్థులు పెరిగారు.
►2017–18 విద్యా సంవత్సరంలో రాష్ట్రంలోని పాఠశాలల్లో విద్యా వలంటీర్లు కలుపుకొని 2,61,904 మంది టీచర్లు ఉండగా, వారి సంఖ్య 2018–19 విద్యా సంవత్సరంలో 2,57,367 మందికి తగ్గిపోయింది. అంటే పాఠశాలల్లోనే 4,537 మంది టీచర్లు తగ్గిపోయారు. అందులో ప్రభుత్వ పాఠశాలల్లోనే అత్య«ధికంగా 3,834 మంది టీచర్లు తగ్గిపోవడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment