
గుంటూరు నగరంలోని కొరిటెపాడుకు చెందిన నరేష్ పదవ తరగతి చదువుతున్నాడు. చదువులో ముందుండే నరేష్‌కి బయట జరిగే విషయాలపై అవగాహన శూన్యం. తనకు ఎదురయ్యే చిన్న చిన్న సమస్యలను కూడా ఎదుర్కోలేక బేలగా తయారవుతాడు.. విషయం గ్రహించిన తల్లిదండ్రులు ఇటీవల మానసిక నిపుణుల వద్దకు తీసుకు వచ్చారు. అతనికి కౌన్సెలింగ్ చేయగా, తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నట్లు నిర్ధారించారు.
లబ్బీపేట(విజయవాడ తూర్పు): నేటి విద్యా విధానం కేవలం మార్కులు, ర్యాంకులు సాధించడమే లక్ష్యంగా కొనసాగుతోంది. విద్యార్థుల్లో నైతిక విలువలు, సమస్య సాధన, ఇంటెలిజెన్స్ వృద్ధి చెందకపోవడంతో జీవితంలో సక్సెస్‌కాలేక చతికిల పడుతున్నారు. నేటి కాలంలో సక్సెస్ సాధించాలంటే సిలబస్‌తో పాటు, నైపుణ్యం ఎంతో అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. ఇటీవలి కాలంలో వర్క్‌షాపులు, సదస్సులు నిర్వహిస్తూ వివరిస్తున్నారు.
విలువలతో కూడిన బోధన అవసరం
గురువు బోధన చేస్తే సోధించి సాధించే మనస్తత్వాన్ని అలవర్చుకున్నప్పుడే విద్యార్థి పరిపూర్ణవంతుడుగా ఎదుగుతాడు. పరిశోధనాత్మకంగా ఆలోచిస్తూ దేనినైనా సాధించాలనే గుణాలను కలిగి వుంటారు. కానీ నేడు విద్యార్థులతో సిలబస్‌నే బట్టీ పట్టిస్తూ ర్యాంకులు.. మార్కులు సాధించేలా తయారు చేస్తున్నారు. వారిలో ఎలాంటి స్కిల్స్ పెంపొందించకపోవడంతో కేవలం జిరాక్స్ మిషన్‌లు వలే మారుతున్నారనేది విద్యావేత్తలు, నిపుణులు ఆవేదన. విలువలతో కూడిన విద్యాబోధన ద్వారానే సంపూర్ణమైన వ్యక్తిత్వం కలిగిన వ్యక్తిగా ఎదుగుతాడని, సృజనాత్మకతను పెంపొందించుకుంటారని నిపుణులు చెపుతున్నారు.
జీవితంలో విజయం సాధించలేక..
నేటి విద్యార్థుల్లో కమ్యునికేషన్ స్కిల్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్‌స్కిల్స్, మోరల్ వాల్యూస్ పెంపొందడం లేదని చెబుతున్నారు. దీంతో సిలబస్‌ను బట్టీపట్టి ఐఐటీలో ర్యాంకు సాధించిన విద్యార్థి సైతం, అక్కడ రాణించలేక విఫలం అవుతున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు.
అందుకు అవసరమైన స్కిల్స్ స్కూల్స్ స్థాయినుంచి పెంపొందించాల్సిన అవసరం ఉంది. పాఠశాలలో విద్యార్థి పరిపూర్ణ వ్యక్తిత్వ వికాసం పెంపొందించేలా కృషి చేయాల్సిన అవసరం ఉందని నిపుణులు చెపుతున్నారు. ఇంజినీరింగు పూర్తి చేసిన విద్యార్థులు పరిశ్రమలకు అవసరమైన స్కిల్స్ లేక ఉద్యోగావకాశాలు పొందలేక పోతున్నట్లు పారిశ్రామిక వర్గాలు చెపుతున్నాయి.
మానవ సంబంధాలు కోల్పోతున్న వైనం..
విలువలనేవి నేర్చుకుంటే వచ్చేవి కావు. గురువులు, తల్లిదండ్రుల ద్వారా సమాజ స్థితిగతులను తెలుసుకుని విలువలను పెంపొందించుకోవాలి. ప్రస్తుతం తల్లిదండ్రులు బిజీ లైఫ్‌తో పిల్లలతో గడిపే సమయం లేక పోవడం, స్కూల్స్ సిలబస్‌కే పరిమితం కావడంతో నైతిక విలువలు దెబ్బతింటున్నాయి. జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోవడంలో మోరల్ వాల్యూస్, సోషల్ రిలేషన్స్ ఎంతో కీలకమని నిపుణులు చెపుతున్నారు. ఇదే విషయమై ఇటీవల కాలంలో పలు వర్క్‌షాపులు నిర్వహిస్తున్నారు.
సమస్యలను పరిష్కరించుకోలేక..
నిత్యం పర్యవేక్షణతో కూడిన చదువులతో తీవ్ర ఒత్తిడికి గురవుతున్న చిన్నారులు చిన్న సమస్య ఎదురైన పరిష్కరించుకోలేక పోతున్నారు. దీంతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. వారిలో ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ పెంపొందిస్తే, ఒత్తిడిని అధిగమిస్తారనేది నిపుణుల వాదన.. జీవితంలో ఎదురయ్యే సమస్యలను సాధించడానికి కావాల్సిన మానసిక శక్తిని విద్యార్థుల్లో వృద్ధి చేయాల్సిన బాధ్యత స్కూల్స్‌పై ఉంది.
విజయవాడ నగరంలోని గవర్నర్‌పేటకు చెందిన రమేష్ చదువులో చురుగ్గా ఉంటాడు. ఎప్పుడూ ఫస్ట్ ర్యాంకులే వస్తాయి. కానీ నలుగురితో కలిసి మాట్లాడలేక పోవడం, మానవ సంబంధాలపై అంతగా ఆసక్తి చూపకపోవడం.. ఒంటరితనంలో ఆనందం వెదుక్కోవడం అతనిలో కనిపిస్తున్న లక్షణాలు.. ఆఖరికి బంధువులను ఏమని పిలవాలో కూడా తెలియని పరిస్థితికి దిగజారిపోయాడు.. దీంతో తల్లిదండ్రులు మానసిక వైద్యులను ఆశ్రయించారు. ఇలాంటి చిన్నారులను ఇటీవల కాలంలో మానసిక వైద్యుల వద్దకు తీసుకొస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది.
స్కిల్స్ పెంపొందించాలి
నేటి విద్యార్థులు ర్యాంకులు, మార్కులు సాధిస్తున్నారే కానీ, జీవితంలో సక్సెస్ కాలేక పోతున్నారు. అందుకు వారికి అవసరమైన స్కిల్స్ పెంపొందించక పోవడమే కారణం. ప్రతి విద్యార్థిలో నైతిక విలువలు, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, సోషల్ రిలేషన్స్ పెరిగేలా చూడాల్సిన బాధ్యత స్కూల్స్‌పై వుంది. ఒక విద్యార్థిలో వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించి పరిపూర్ణ వంతుగా తీర్చిదిద్దినప్పుడే జీవితంలో సక్సెస్‌గా రాణించగలుగుతాడు. – డాక్టర్ గర్రే శంకర్రావు,మానసిక విశ్లేషకులు
Comments
Please login to add a commentAdd a comment