సాక్షి, అమరావతి: ఆర్థికంగా వెనుకబడిన వర్గాల పిల్లలకు ప్రైవేట్ స్కూళ్లలో 25 శాతం సీట్లను ఉచితంగా కేటాయించాలన్న తమ ఆదేశాల అమలు విషయంలో ప్రభుత్వం తీసుకున్న చర్యలపై హైకోర్టు సంతృప్తి వ్యక్తంచేసింది. ప్రభుత్వ చర్యల్లో చిత్తశుద్ధి కనిపిస్తోందని, అధికారులపై కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకోలేమని తేల్చిచెప్పింది. పాఠశాల విద్యా శాఖ కమిషనర్ ఎస్.సురేశ్‌కుమార్ దాఖలు చేసిన కోర్టు ఆదేశాల అమలు నివేదికపై అభ్యంతరాలుంటే తెలియజేయాలని పిటిషనర్‌కు సూచిస్తూ రెండు వారాల గడువు ఇచ్చింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ డీవీఎస్‌ఎస్ సోమయాజుల ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు ఇచ్చింది.
2,603 మంది విద్యార్థులకు ప్రవేశాలు..
విద్యా హక్కు చట్ట నిబంధనల ప్రకారం ఆర్థికంగా వెనుకబడిన వర్గాల పిల్లలకు అన్ని ప్రైవేటు స్కూళ్లలో 25 శాతం సీట్లను ఉచితంగా కేటాయించాలని జనవరిలో హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ ఆదేశాలను అమలు చేయలేదంటూ పిటిషనర్ టి.యోగేష్ కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యం బుధవారం విచారణకు రాగా.. ప్రభుత్వ న్యాయవాది ఎల్వీఎస్ నాగరాజు స్పందిస్తూ.. ధర్మాసనం ఆదేశాల అమలుకు సంబంధించిన నివేదికను కోర్టు ముందుంచారు.
కేటాయించిన సీట్ల వివరాలను కూడా తెలియజేశారు. 25 శాతం సీట్ల గురించి మీడియాలో విస్తృత ప్రచారం చేశామని ఆయన తెలిపారు. రాష్ట్రంలోని 9,514 ప్రైవేట్ స్కూళ్లలో ఒకటో తరగతి ప్రవేశాల నిమిత్తం 5,195 దరఖాస్తులు వచ్చాయన్నారు. ఇందులో 3,515 మంది ఆన్‌లైన్ వెబ్ ఆప్షన్లు ఎంపిక చేసుకున్నారని తెలిపారు. ఆరు దశల్లో దరఖాస్తులను పరిశీలించగా.. 3,288 మంది లాటరీకి ఎంపికయ్యారని చెప్పారు.
ఇందులో 2,603 మంది 1వ తరగతి ప్రవేశాలు పొందారని వివరించారు. ఎంపికైన విద్యార్థుల జాబితాను ఆయా స్కూళ్లకు పంపించామన్నారు. మిగిలిన సీట్లకు రెండో జాబితా విడుదల చేస్తామని నాగరాజు చెప్పారు. ఈ వివరాలపై ధర్మాసనం సంతృప్తి వ్యక్తం చేసింది. పిటిషనర్ టి.యోగేష్ స్పందిస్తూ కేవలం 2,603 సీట్లే భర్తీ చేశారని, మీడియాలో విస్తృత ప్రచారం చేయలేదన్నారు. ధర్మాసనం స్పందిస్తూ ప్రభుత్వ చర్యల్లో చిత్తశుద్ధి కనిపిస్తోందని పేర్కొంది.
ప్రభుత్వ చర్యలు సంతృప్తికరం
Published Thu, Sep 8 2022 4:23 AM | Last Updated on Thu, Sep 8 2022 3:12 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment