సమావేశంలో జస్టిస్ కాంతారావు, విజయశారదారెడ్డి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఫీజులను నిర్ణయించేందుకు ప్రైవేట్ స్కూళ్లు, జూనియర్ కాలేజీలను కేటగిరీల వారీగా విభజిస్తామని పాఠశాల విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ చైర్మన్ జస్టిస్ ఆర్.కాంతారావు తెలిపారు. సిటీ, టౌన్, మున్సిపాలిటీ, పంచాయతీ, అర్బన్, రూరల్ ఇలా పలు విభాగాలుగా విభజించి ఆయా సంస్థల్లోని టీచర్లు, సదుపాయాల ప్రమాణాలు అన్నింటినీ బేరీజు వేసుకుని ఫీజులను ఖరారు చేస్తామన్నారు. కృష్ణాజిల్లా ఇబ్రహీంపట్నంలోని కమిషన్ కార్యాలయంలో వైస్ చైర్మన్ డాక్టర్ అరిమంద విజయశారదారెడ్డితో కలిసి గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. చైర్మన్ పేర్కొన్న అంశాలు ఆయన మాటల్లోనే..
ఈనెల 28న జరిగిన సర్వసభ్య సమావేశంలో కమిషన్ పలు అంశాలపై చర్చించింది. ప్రస్తుతం కమిషన్ సభ్యులు మాత్రమే ఆయా స్కూళ్లను తనిఖీలు చేస్తున్నారు. ఇకపై జిల్లాకు 20 మంది సిబ్బందితో తనిఖీలు చేపడతాం. అన్ని స్కూళ్లను ఒకేసారి తనిఖీలు చేయడం సాధ్యం కానందున ఒక పోర్టల్‌ను ఏర్పాటుచేసి ఆయా స్కూళ్లు తమ సమాచారాన్ని అప్‌లోడ్ చేయాలని సూచించనున్నాం. వాటిని పరిశీలించి ఆ ప్రకారం ఏర్పాట్లు ఉన్నాయో లేదో చూసి ఫీజులు నిర్ణయిస్తాం.
పాఠ్యాంశాల్లో నైతికత, లైంగిక విద్య
ఇటీవలి కాలంలో మహిళలు, బాలికలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్న తరుణంలో విద్యార్థి దశ నుంచే పిల్లల్లో మహిళలపట్ల గౌరవం పెరిగేలా సంబంధిత పాఠ్యాంశాలను ప్రవేశపెట్టించనున్నాం. నైతికత, లైంగిక విద్య వంటి అంశాలను కరికులమ్‌లో జతచేయాలని సూచిస్తున్నాం. అలాగే, జూనియర్ కాలేజీల్లోనూ త్వరలో తనఖీలు చేపడతాం. ఈ కాలేజీల్లో ఫీజులు, బోధనా సిబ్బంది నియామకం, ఇతర ఏర్పాట్లను క్షుణ్ణంగా పరిశీలిస్తాం. ప్రస్తుతం ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జరగనున్నాయి. ఇవి ఎలా జరుగుతున్నాయో కొన్ని కేంద్రాలకు వెళ్లి పరిశీలిస్తాం.
మూడు దశల్లో అనుమతుల ప్రక్రియ : వైస్ చైర్మన్ విజయశారదారెడ్డి
పాఠశాలలకు అనుమతుల మంజూరు విషయంలో ప్రస్తుతం ఒక గడువంటూ లేదు. ఈసారి ఓ నిర్దిష్ట విధానాన్ని ప్రవేశపెడుతున్నాం. మూడు దశల్లో ఇది ఉంటుంది. ముందు దరఖాస్తు, తదుపరి లెటర్ ఆఫ్ ఇంటెంట్, ఆపై అనుమతులుగా ఇది ఉంటుంది. పాఠశాలలు, కాలేజీలకు అనుమతులు, అడ్మిషన్లు, ఫీజుల చెల్లింపును కూడా ఆన్‌లైన్‌లోనే నిర్వహించేలా ప్రణాళిక రూపొందిస్తాం. అలాగే, ఇటీవల కొన్ని స్కూళ్లలో తరగతి గదులు ఇరుకుగా ఉండడంతో పాటు ఆట స్థలాలు ఎక్కడో దూరంగా ఉన్నట్లు చూపించారు. చిన్న పిల్లలకు అయిదో అంతస్తులో తరగతులు నిర్వహిస్తున్నారు. టెర్రస్‌పై ఆటలాడిస్తున్నారు. ఇది చాలా ప్రమాదకరం. ఈ విషయంలో ప్రతినెలా డీఈఓ 4 హైస్కూళ్లు, డిప్యూటీ డీఈఓ 8 హైస్కూళ్లు, ఎంఈఓ 12 ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలు, ఆర్‌ఐఓలు 4 జూనియర్ కాలేజీలు, డీఐఓలు 10 జూనియర్ కాలేజీలు తనిఖీ చేసేలా షెడ్యూల్ పెడుతున్నాం. ఈ విద్యా సంస్థలు ఎలాంటి అక్రమాలకు పాల్పడినా ప్రజలు ఫిర్యాదు చేయడానికి కమిషన్ టోల్‌ఫ్రీ నెంబర్‌ను, గ్రీవెన్సు సెల్‌ను ఏర్పాటుచేస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment