మాకూ కావాలి ఓ ఏఎఫ్‌ఆర్‌సీ | Parents' associations about school fees regulation | Sakshi
Sakshi News home page

మాకూ కావాలి ఓ ఏఎఫ్‌ఆర్‌సీ

Published Tue, Apr 18 2017 3:13 AM | Last Updated on Tue, Sep 5 2017 9:00 AM

మాకూ కావాలి ఓ ఏఎఫ్‌ఆర్‌సీ

మాకూ కావాలి ఓ ఏఎఫ్‌ఆర్‌సీ

- స్కూల్‌ ఫీజులకు నియంత్రణ ఉండాలన్న తల్లిదండ్రుల సంఘాలు
- అభిప్రాయాలు ఇచ్చేందుకు గడువు ఇవ్వాలన్న యాజమాన్యాలు
- ప్రొ.తిరుపతిరావు కమిటీకి సంఘాల రాతపూర్వక అభిప్రాయాలు  


సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల నియంత్రణకు ఏఎఫ్‌ఆర్‌సీ తరహాలోనే స్కూల్‌ ఫీజుల నియంత్రణకు రాష్ట్ర ఫీ రెగ్యులేషన్‌ కమిషన్‌ ఏర్పాటు దిశగా ఆలోచనలు మొదలయ్యాయి. ఈ మేరకు ప్రొఫెసర్‌ తిరుపతిరావు కమిటీ కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది. రాష్ట్ర స్థాయిలో వృత్తి విద్యా కాలేజీల్లో ఫీజులను నిర్ణయిస్తున్న రాష్ట్ర ప్రవేశాలు, ఫీజుల నియంత్రణ కమిటీ తరహాలో పాఠశాలల ఆదాయ వ్యయాలను బట్టి ఫీజులను నిర్ణయించేలా ఆలోచనలు చేస్తున్నట్లు తెలిసింది. మరోవైపు తల్లిదండ్రుల సంఘాలు కూడా అదే డిమాండ్‌ను కమిటీ ముందుంచాయి. తల్లిదండ్రుల సంఘాలు, కొన్ని ప్రైవేటు పాఠశాలల యాజమాన్య సంఘాలు తమ ప్రతిపాదనలు, అభిప్రాయాలను సోమవారం కమిటీకి రాత పూర్వకంగా అందజేశాయి.

కొన్ని ప్రైవేటు పాఠశాలల యాజమాన్య సంఘాలు తమ ప్రతిపాదనలు అందించేందుకు కొంత గడువు ఇవ్వాలని కోరాయి. మరోవైపు ఫీజుల నియంత్రణకు రాష్ట్ర స్థాయిలో కమిషన్‌తోపాటు జిల్లాల్లోనూ జిల్లా ఫీ రెగ్యులేషన్‌ కమిషన్‌ ఏర్పాటు చేయాలని తల్లిదండ్రుల సంఘాలు కోరాయి. వాటికి చట్టబద్ధత కల్పించడంతోపాటు జిల్లా జడ్జి చైర్మన్‌గా ఉండేలా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశాయి. జిల్లా స్థాయిలో నిర్ణయించిన ఫీజుల విషయంలో అభ్యంతరాలు ఉంటే రాష్ట్ర కమిషన్‌కు వచ్చేలా చర్యలు చేపట్టాలని పేర్కొన్నాయి. జీవో నంబరు 1ను కచ్చితంగా అమలు చేయాలని కోరాయి.

జూన్‌ 12 నుంచి ప్రారంభించండి..
విద్యా సంవత్సరాన్ని మార్చి 21 నుంచి కాకుండా జూన్‌ 12న ప్రారంభించి, ఆ తర్వాతి ఏడాదిలో ఏప్రిల్‌ 23 వరకు కొనసాగించాలని తల్లిదండ్రుల సంఘాలు కోరాయి. ఐఐటీ కోచింగ్‌ ల పేరుతో తరగతులు ఏర్పాటు చేసిన పాఠశాల లపై కఠిన చర్యలుండాలని తెలిపాయి. ప్రైవేటు స్కూళ్లలో సమస్యల ఫిర్యాదుకు టోల్‌ఫ్రీ నంబరు ఏర్పాటు, పాఠశాలల్లో సోషల్‌ ఆడిట్‌ విధానం ప్రవేశపెట్టాలని కోరాయి. సంఘాల అభిప్రాయా లను క్రోడీకరించి ఈ నెల 20న కమిటీ తమ పూర్తి స్థాయి నివేదికను ప్రభుత్వానికి అందించనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement