School fees regulation
-
లక్షల్లో నర్సరీ ఫీజు.. పేరెంట్ ఓరియెంటేషన్ చార్జీలు అదనం..!
కోకాపేటలోని ఓ అంతర్జాతీయ పాఠశాలలో ఈ సంవత్సరం 4వ తరగతికి రూ.1.23 లక్షల ఫీజు ఉంది. వచ్చే ఏడాది అయిదో తరగతిలో చేరాలంటే రూ.1.58 లక్షలు చెల్లించాలని తల్లిదండ్రులకు మెసెజ్ వెళ్లింది. అంటే పైతరగతికి అదనంగా రూ.35 వేలు (28 శాతం) పెరిగింది. ఉప్పల్ చౌరస్తా సమీపంలోని ఓ ప్రముఖ పాఠశాలలో చాలా వాటితో పోలిస్తే అక్కడ కొంత రుసుములు తక్కువనే పేరుంది. అయినా ఈసారి ఒకటో తరగతిలో ప్రవేశానికి 14 శాతం పెంచడం గమనార్హం. అక్కడ ప్రస్తుత విద్యాసంవత్సరంలో ఒకటో తరగతిలో చేరేందుకు రూ.50 వేలు ఫీజు నిర్ణయించగా.. వచ్చే ఏడాదికి దాన్ని రూ.57 వేలకు పెంచారు. పాఠశాల ఫీజులు లక్షల్లో ఉంటున్నాయి. డిజీ తరగతులు, ఏసీ క్లాస్‌రూం, టెక్నాలజీ నేర్పుతున్నామని చెబుతూ యాజమాన్యాలు లక్షల్లో బాదుతున్నారు. అవి ఎందుకు కడుతున్నారో తల్లిదండ్రులకు సరైన వివరాలు అందుబాటులో ఉండవు. పాఠశాల యాజమాన్యం ఫలానా మొత్తం చెల్లించాలని చెప్పగానే.. వీలైతే కొంత బేరమాడి, లేదంటే వారు చెప్పినంత ముట్టజెప్పడం అలవాటైంది. కానీ పాఠశాలకు చెల్లిస్తున్న ఫీజులో అడ్మిషన్ ఫీజు, డెవలప్మెంట్ ఫీజు, ట్రావెల్ చార్జీలు, కాషన్ మనీ, వార్షిక చార్జీలు.. ఇలా రకరకాలుగా విభజించి తల్లిదండ్రులపై భారం మోపుతున్నారు. తాజాగా ఓ స్కూల్ యాజమాన్యం 2024-25 విద్యాసంవత్సరానికిగాను నర్సరీ, జూనియర్ కేజీకి ఏకంగా రూ.1,51,656 వసూలు చేస్తుంది. అందుకు అదనంగా ‘పేరెంట్ ఓరియంటేషన్’ పేరుతో రూ.8,400 చెల్లించాలని కోరింది. అయితే అందుకు సంబంధించిన ఫీజు వివరాలతో ఉన్న కాపీ ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. अब समझ आ रहा है, पिता जी ने मुझे सरकारी स्कूल में क्यों पढ़ाया था 😭 pic.twitter.com/fkyPlDT6WP — Raja Babu (@GaurangBhardwa1) December 7, 2023 ఫీజుల వినియోగం ఇలా... విద్యాసంస్థల్లో గరిష్ఠంగా ఎంత ఫీజు వసూలు చేయాలనే నిర్ణయంతో పాటు... వసూలు చేసిన ఫీజులను ఎలా వినియోగించాలో ప్రభుత్వం తెలిపింది. ఇదీ చదవండి: ఆ సిటీలో 8,500 ఎకరాల్లో సోలార్‌ప్లేట్లతో పార్కింగ్ స్థలం నిబంధనల ప్రకారం స్కూళ్లు, కాలేజీ యాజమాన్యాలు వసూలు చేసిన ఫీజుల్లో 50 శాతాన్ని టీచర్లు, నాన్ టీచింగ్ స్టాప్ వేతనాలకు, మరో 15 శాతాన్ని గ్రాట్యుటీ, పీఎఫ్, గ్రూప్ ఇన్సూరెన్స్‌కు ఖర్చు చేయాలి. అలాగే మరో 20 శాతం ఫీజును పాఠశాల లేదా కళాశాల అభివృద్ధికి వినియోగించాలి. అలాగే ఆయా విద్యాసంస్థల్లో పని చేస్తున్న టీచర్లు, లెక్చరర్లు వివరాలతో పాటు వారి విద్యార్హతలు, వారికి ఇస్తున్న జీతాల సమాచారాన్ని విద్యాశాఖకు తెలియజేయాలి. దానికి సంబంధించిన పూర్తి వివరాలను విద్యాసంస్థల వెబ్ సైట్లలో అందుబాటులో ఉంచాలి. -
ప్రాణాలు తీస్తున్న ఫీజులు
సాక్షి, హైదరాబాద్/సాక్షి, రంగారెడ్డి జిల్లా: అడ్డూ అదుపూ లేని కార్పొరేట్ కాలేజీల దోపిడీ, ధనదాహం విద్యార్థుల ప్రాణాల మీదకు తెస్తోంది. ఫీజులు చెల్లించలేని నిస్సహాయ పరిస్థితుల్లో, ప్రైవేటు కాలేజీల వేధింపులు భరించలేక, తల్లిదండ్రుల ఆవేదన చూడలేక బలవన్మరణాలకు, ఆత్మహత్యాయత్నాలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో కొందరు ప్రాణాలు కోల్పోతున్నారు. ఫీజు చెల్లించలేదని ఇంటర్ సర్టిఫికెట్లు ఇవ్వకపోవడంతో శుక్రవారం హైదరాబాద్ రామాంతపూర్ నారాయణ కాలేజీలో ఓ విద్యార్థి నేత ఆత్మహత్యాయత్నం చేయడం కలకలం సృష్టించింది. మాదాపూర్‌లోని మరో కాలేజీలో కొన్ని నెలల క్రితం విద్యార్థి ఆందోళనకు దిగే వరకు సర్టిఫికెట్లు ఇవ్వకపోవడం గమనార్హం. రంగారెడ్డి జిల్లాలో ఫీజు చెల్లించే వరకు క్లాసులకు రావొద్దంటూ ఓ విద్యార్థిని వేధించడంతో, విద్యార్థి తీవ్ర మానసిక వేదనకు గురై మీడియాను ఆశ్రయించాడు. ఇలాంటి సంఘటనలెన్నో జరుగుతున్నా ఇంటర్ బోర్డు కానీ, విద్యామంత్రిత్వ శాఖ కానీ స్పందించిన దాఖలాల్లేవని, కిందిస్థాయి సిబ్బంది మొదలు ఉన్నతాధికారుల వరకు ముడుపులు అందడం వల్లే కార్పొరేట్ కాలేజీల ఆగడాలకు అడ్డుకట్ట పడటం లేదని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. నిబంధనలు ఉల్లంఘించి నిర్వహణ రాష్ట్రంలో 1,606 ప్రైవేటు కాలేజీలున్నాయి. వీటన్నింటికీ ఇంటర్ బోర్డు అనుబంధ గుర్తింపు (అఫ్లియేషన్) ఇస్తుంది. ఇప్పటివరకు 1480 కాలేజీలు అఫ్లియేషన్ కోసం దరఖాస్తు చేసుకున్నాయి. వీటిల్లో 643 కాలేజీలకు అనుమతులిచ్చారు. వీటిల్లో సింహభాగం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనే ఉన్న కార్పొరేట్ కాలేజీలే కావడం విశేషం. అఫ్లియేషన్ ఇచ్చేటప్పుడు అనేక అంశాలను ఇంటర్ బోర్డు పరిశీలించాల్సి ఉంటుంది. కాలేజీకి 8 వేల చదరపు అడుగుల స్థలం ఉండాలి. ఆటస్థలం తప్పనిసరి. లేబొరేటరీతో పాటు సెక్షన్‌కు ఇద్దరు అధ్యాపకులుండాలి. 9 సెక్షన్లకు మించి ఉండకూడదు. ప్రతి సెక్షన్లో 88 సీట్లు అనుమతిస్తారు. భవనానికి ఫైర్ సేఫ్టీ సర్టిఫికెట్ ఉండాలి. కానీ చాలా కాలేజీలు ఈ నిబంధనలేవీ పట్టించుకోవడం లేదు. ఇష్టారాజ్యంగా అదనపు సెక్షన్లు నడుపుతున్నారు. ప్రాక్టికల్స్ చేయించిన పాపాన పోవడం లేదు. సైన్స్ గ్రూపులతో పాటు, ఆర్ట్స్, కామర్స్ గ్రూపులూ ఉండాలి. కానీ కార్పొరేట్ కాలేజీల్లో అసలీ గ్రూపులే ఉండటం లేదు. ఇక ఒకటీ అరా కాలేజీల్లో మినహా ఆటస్థలం అనేదే ఉండటం లేదు. కొన్ని కాలేజీలకు ఒకచోట పర్మిషన్ ఉంటే మరోచోట నిర్వహిస్తున్నారు. అరకొరగా ఉండే అధ్యాపక సిబ్బందికి అతి తక్కువ వేతనాలిస్తూ, ఫీజుల విషయంలో విద్యార్థుల్ని మానసిక ఒత్తిడికి గురిచేస్తూ అమానవీయంగా వ్యవహరిస్తున్నారు. ఆలస్యమైతే అంతే.. ప్రైవేటు జూనియర్ కాలేజీల ఫీజులపై కచ్చితమైన చట్టం లేకపోవడం కార్పొరేట్ కాలేజీల పాలిట వరంగా మారింది. ఐఐటీ, నీట్ ఫౌండేషన్ అంటూ భారీయెత్తున ప్రచారంతో కాలేజీలు విద్యార్థులను ఆకర్షిస్తున్నాయి. పేద, మధ్యతరగతి తల్లిదండ్రులు కూడా తమ పిల్లల భవిష్యత్తుపై ఆశతో అనేక కష్టాలు పడుతూ ఆయా కాలేజీల్లో చేర్పిస్తున్నారు. దీన్ని అవకాశంగా తీసుకుని కాలేజీలు ఫీజులు పిండేస్తున్నాయి. కాలేజీని బట్టి కనీస వార్షిక ఫీజు రూ.60 వేలుంటే, గరిష్టంగా రూ.3 లక్షల వరకు వసూలు చేస్తున్నారు. చేరిన వెంటనే ఫీజులో సగం కట్టాలంటూ ఒత్తిడి తెస్తున్నారు. మిగతా మొత్తం రెండు నెలల్లో చెల్లించాలంటున్నారు. వారం రోజులు ఆలస్యమైనా విద్యార్థులకు నరకం చూపిస్తున్నారు. ఫీజు చెల్లించకపోతే క్లాసులో నిలబెడుతున్నారని, క్లాసు నుంచి బయటకు వెళ్లిపొమ్మంటూ అందరిలో అవమానిస్తున్నారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తల్లిదండ్రులకు పదేపదే మెసేజ్‌లు పెడుతూ వేధిస్తున్నారు. క్లాసులకు హాజరుకానివ్వడం లేదు. చివరి అస్త్రంగా కోర్సు పూర్తి చేసుకున్న విద్యార్థులకు.. ఉన్నత తరగతుల్లో చేరేందుకు అవసరమైన సర్టిఫికెట్లు ఇవ్వకుండా వేధింపులకు పాల్పడుతూ బలవంతపు వసూళ్లకు దిగుతున్నారు. ఆ సంస్థ గుర్తింపు రద్దు చేయాలి కార్పొరేట్ కాలేజీల ధన దాహం పేద విద్యార్థులకు శాపంగా మారింది. రామంతాపూర్ నారాయణ కాలేజీ ఉదంతమే దీనికి నిదర్శనం. చాలా కాలేజీలు విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వకుండా వేధిస్తున్నాయి. ఇంటర్ బోర్డు తక్షణమే స్పందించాలి. ఈ తరహా దుర్మార్గాలకు అడ్డుకట్ట వేయాలి. నారాయణ కాలేజీలో ఆత్మహత్య ప్రయత్నంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలి. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలి. నారాయణ సంస్థ గుర్తింపు రద్దు చేయాలి. – ప్రవీణ్‌రెడ్డి (ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి) రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన నారాయణ సంస్థలతో పాటు ఇతర కార్పొరేట్ విద్యా సంస్థలు ఫీజుల కోసం విద్యార్థులను వేధించడం దారుణం. రామంతాపూర్ నారాయణ కళాశాల వేధింపులు విద్యార్థుల ప్రాణాల మీదకు తెచ్చాయి. వేధింపులకు పాల్పడుతున్న విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేపడతాం. ఇప్పటికైనా ప్రభుత్వం, ఇంటర్ బోర్డు అధికారులు.. కార్పొరేట్ కాలేజీల దోపిడీని అడ్డుకోవాలి. – టి. నాగరాజు (ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి) ముడుపుల ఆరోపణలపై విచారణ జరపాలి నారాయణ, చైతన్య కాలేజీలు నడిపే హాస్టళ్ళకు అనుమతుల్లేవని ఇంటర్ బోర్డే తేల్చి చెప్పింది. అయినా ఆ కాలేజీలు య«థేచ్ఛగా హాస్టళ్లు నడుపుతుంటే ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు. బోర్డు అధికారులకు వారినుంచి ముడుపులు అందుతున్నాయనే ఆరోపణలున్నాయి. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరపాలి. – మాచర్ల రామకృష్ణ గౌడ్ (తెలంగాణ ఇంటర్ విద్య పరిరక్షణ కమిటీ కన్వీనర్) చదవండి: అగ్గి రాజేసిన ఫీజు -
కార్పొరేట్ స్కూల్స్‌లా వ్యవహరిస్తారా?
సాక్షి, హైదరాబాద్: ఫీజులు చెల్లిస్తే తప్ప ఆన్లైన్ క్లాసులకు అనుమతించబోమంటూ విద్యార్థుల తల్లిదండ్రుల తలలకు గన్ను పెట్టి ఫీజులు వసూలు చేయాలనుకుంటే ఎలా అని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ (హెచ్‌పీఎస్) యాజమాన్యాన్ని హైకోర్టు ప్రశ్నించింది. లాభాపేక్ష లేకుండా సొసైటీ ఆధ్వర్యంలో పాఠశాల నిర్వహిస్తున్నామని చెబుతూ.. కార్పొరేట్ పాఠశాలల తరహాలో ఫీజుల కోసం వేధింపులకు గురిచేస్తున్నారని మండిపడింది. విద్యార్థుల చదువుకునే హక్కును హరిస్తారా అంటూ నిలదీసింది. కరోనా నేపథ్యంలో ప్రజలందరూ తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారని, విద్యార్థుల తల్లిదండ్రుల పరిస్థితిని మానవత్వంతో అర్థం చేసుకోవాలని సూచించింది. ఫీజులు కట్టలేదన్న కారణంగా 219 మంది విద్యార్థులను గత 70 రోజులుగా ఆన్లైన్ క్లాసులకు అనుమతించకపోవడాన్ని తప్పుపట్టింది. ఫీజుల కోసం విద్యార్థులు విద్యా సంవత్సరం కోల్పోయేలా చేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. వారిని ఆన్లైన్ తరగతులకు అనుమతించాలని ఆదేశించింది. ఈ అంశంపై పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమాకోహ్లీ, జస్టిస్ బి.విజయసేన్‌రెడ్డితో కూడిన ధర్మాసనం మంగళవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. హెచ్‌పీఎస్ యాజమాన్యం ఫీజులు తగ్గించకపోవడాన్ని సవాల్ చేస్తూ హెచ్‌పీఎస్ యాక్టివ్ పేరెంట్స్ అసోసియేషన్ తరఫున ఎం.ఆనంద్‌రెడ్డి దాఖలు చేసిన అప్పీల్‌ను ధర్మాసనం విచారించింది. కరోనా నేపథ్యంలో ఫీజులు తగ్గించాలని కోరినా హెచ్‌పీఎస్ యాజమాన్యం స్పందించట్లేదని పిటిషనర్ తరఫున న్యాయవాది ఈవీ వేణుగోపాల్ వాదనలు వినిపించారు. స్కూల్ నిర్వహించాలంటే ఫీజులు తప్పనిసరి అని, ఎప్పటిలోగా ఫీజులు చెల్లిస్తారో చెప్పాలని హెచ్‌పీఎస్ తరఫున సీనియర్ న్యాయవాది ఎస్.రవి వాదనలు వినిపించారు. విద్యార్థులందరికీ రూ.10 వేల చొప్పున ఫీజు తగ్గించామని, అయినా బకాయి ఫీజులు చెల్లించడం లేదని తెలిపారు. ఈ మేరకు స్పందించిన ధర్మాసనం.. ఫీజులు వసూలు చేసుకోవచ్చని, అయితే ఫీజులు చెల్లించలేదన్న కారణంగా విద్యార్థులను తరగతులకు అనుమతించకపోవడం సరికాదని స్పష్టం చేసింది. విచారణను ఈనెల 13కు వాయిదా వేసింది. -
స్కూల్ ఫీజులూ.. సులభ వాయిదాల్లో...
న్యూఢిల్లీ: భారీ విలువ చేసే లావాదేవీలకు చెల్లించే మొత్తాన్ని నేరుగా కస్టమర్లే ఆన్లైన్లో ఈఎంఐల (నెలవారీ వాయిదాలు) కింద మార్చుకునే సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చినట్లు ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్ వెల్లడించింది. ఎంపిక చేసిన సేవింగ్స్ అకౌంట్స్ ఖాతాదారులు .. తమ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ప్లాట్‌ఫాం ద్వారా బీమా ప్రీమియంలు మొదలుకుని స్కూలు ఫీజుల దాకా వివిధ రకాల చెల్లింపులను ఈఎంఐల కింద చెల్లించవచ్చని తెలిపింది. దీనితో భారీ మొత్తాన్ని సులభ వాయి దాల్లో చెల్లించుకునేందుకు వీలవు తుందని పేర్కొంది. రూ. 50,000కు పైబడి రూ. 5 లక్షల దాకా విలువ చేసే లావాదేవీలకు ఇది వర్తిస్తుందని తెలిపింది. వీటిని 3,6,9,12 నెలల కాల వ్యవధికి ఈఎంఐల కింద మార్చుకోవచ్చని, ఇందుకోసం అదనపు చార్జీలేమీ ఉండవని బ్యాంకు తెలిపింది. ’ఈఎంఐ @ ఇంటర్నెట్ బ్యాంకింగ్’ పేరిట ఈ సదుపాయం అందు బాటులో ఉంటుందని వివరించింది. ఇందు కోసం బిల్‌డెస్క్, రేజర్‌పే అనే ఆన్లైన్ పేమెంట్ గేట్వేలతో పాటు 1,000కి పైగా వ్యాపార సంస్థలతో జట్టు కట్టినట్లు బ్యాంక్ వివరించింది. -
మాకూ కావాలి ఓ ఏఎఫ్ఆర్సీ
- స్కూల్ ఫీజులకు నియంత్రణ ఉండాలన్న తల్లిదండ్రుల సంఘాలు - అభిప్రాయాలు ఇచ్చేందుకు గడువు ఇవ్వాలన్న యాజమాన్యాలు - ప్రొ.తిరుపతిరావు కమిటీకి సంఘాల రాతపూర్వక అభిప్రాయాలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల నియంత్రణకు ఏఎఫ్ఆర్సీ తరహాలోనే స్కూల్ ఫీజుల నియంత్రణకు రాష్ట్ర ఫీ రెగ్యులేషన్ కమిషన్ ఏర్పాటు దిశగా ఆలోచనలు మొదలయ్యాయి. ఈ మేరకు ప్రొఫెసర్ తిరుపతిరావు కమిటీ కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది. రాష్ట్ర స్థాయిలో వృత్తి విద్యా కాలేజీల్లో ఫీజులను నిర్ణయిస్తున్న రాష్ట్ర ప్రవేశాలు, ఫీజుల నియంత్రణ కమిటీ తరహాలో పాఠశాలల ఆదాయ వ్యయాలను బట్టి ఫీజులను నిర్ణయించేలా ఆలోచనలు చేస్తున్నట్లు తెలిసింది. మరోవైపు తల్లిదండ్రుల సంఘాలు కూడా అదే డిమాండ్‌ను కమిటీ ముందుంచాయి. తల్లిదండ్రుల సంఘాలు, కొన్ని ప్రైవేటు పాఠశాలల యాజమాన్య సంఘాలు తమ ప్రతిపాదనలు, అభిప్రాయాలను సోమవారం కమిటీకి రాత పూర్వకంగా అందజేశాయి. కొన్ని ప్రైవేటు పాఠశాలల యాజమాన్య సంఘాలు తమ ప్రతిపాదనలు అందించేందుకు కొంత గడువు ఇవ్వాలని కోరాయి. మరోవైపు ఫీజుల నియంత్రణకు రాష్ట్ర స్థాయిలో కమిషన్‌తోపాటు జిల్లాల్లోనూ జిల్లా ఫీ రెగ్యులేషన్ కమిషన్ ఏర్పాటు చేయాలని తల్లిదండ్రుల సంఘాలు కోరాయి. వాటికి చట్టబద్ధత కల్పించడంతోపాటు జిల్లా జడ్జి చైర్మన్‌గా ఉండేలా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశాయి. జిల్లా స్థాయిలో నిర్ణయించిన ఫీజుల విషయంలో అభ్యంతరాలు ఉంటే రాష్ట్ర కమిషన్‌కు వచ్చేలా చర్యలు చేపట్టాలని పేర్కొన్నాయి. జీవో నంబరు 1ను కచ్చితంగా అమలు చేయాలని కోరాయి. జూన్ 12 నుంచి ప్రారంభించండి.. విద్యా సంవత్సరాన్ని మార్చి 21 నుంచి కాకుండా జూన్ 12న ప్రారంభించి, ఆ తర్వాతి ఏడాదిలో ఏప్రిల్ 23 వరకు కొనసాగించాలని తల్లిదండ్రుల సంఘాలు కోరాయి. ఐఐటీ కోచింగ్ ల పేరుతో తరగతులు ఏర్పాటు చేసిన పాఠశాల లపై కఠిన చర్యలుండాలని తెలిపాయి. ప్రైవేటు స్కూళ్లలో సమస్యల ఫిర్యాదుకు టోల్‌ఫ్రీ నంబరు ఏర్పాటు, పాఠశాలల్లో సోషల్ ఆడిట్ విధానం ప్రవేశపెట్టాలని కోరాయి. సంఘాల అభిప్రాయా లను క్రోడీకరించి ఈ నెల 20న కమిటీ తమ పూర్తి స్థాయి నివేదికను ప్రభుత్వానికి అందించనుంది. -
స్కూళ్ల వారీగానే ఫీజులు!
- ఆదాయ వ్యయాలను బట్టే నిర్ధారించాలని ప్రాథమిక నిర్ణయం - జీవో 1 నిబంధనల్లో మార్పులు చేయండి - నియంత్రణ కమిటీకి విజ్ఞప్తి చేసిన ప్రైవేటు యాజమాన్యాలు - నిబంధనలు కఠినంగా ఉండాలన్న తల్లిదండ్రుల సంఘాలు - రేపు మరోసారి భేటీ.. 20న ప్రభుత్వానికి నివేదిక సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రైవేటు పాఠశాలల ఫీజులను ఆయా పాఠశాలల ఆదాయ వ్యయాలను బట్టే నిర్ధారించాలని ఫీజుల నియంత్రణ కమిటీ భావి స్తోంది. వృత్తి విద్యా కాలేజీల తరహాలోనే పాఠశాలల ఆదాయ, వ్యయాలపై కిందటి సంవత్సరపు ఆడిట్ నివేదికల ఆధారంగా ఫీజులను నిర్ణయిస్తేనే శాస్త్రీ యంగా ఉంటుందన్న యోచనకు వచ్చింది. దీనిపై ఈ నెల 6న ఒకసారి, తరువాత మరోసారి సమా వేశమై చర్చించాలన్న నిర్ణయానికి వచ్చింది. మొత్తం గా ఫీజుల నియంత్రణకు చేపట్టాల్సిన చర్యలపై తుది నివేదికను సిద్ధం చేసి.. ఈ నెల 20 లోగా ప్రభుత్వ ఆమోదానికి పంపించనుంది. నిబంధనలు మార్చండి.. స్కూలు ఫీజుల నియంత్రణ కోసం ఇటీవల ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రొఫెసర్ తిరుపతిరావు కమిటీ మంగళవారం పాఠశాల విద్య కమిషనర్ కార్యాలయంలో భేటీ అయింది. తల్లిదండ్రుల సంఘాలు, ప్రైవేటు పాఠశాలల యాజమాన్య ప్రతినిధులతో చర్చలు జరిపింది. స్కూలు ఫీజుల నియంత్రణకు జీవో నంబర్ 1లోని నిబంధనలను యథాతథంగా అమలు చేయవద్దని, వాటిలో మార్పులు చేయాలని ప్రైవేటు యాజమాన్యాలు ఫీజుల నియంత్రణ కమిటీకి విజ్ఞప్తి చేశాయి. ఆ జీవో ప్రకారం పాఠశాలలకు ఫీజుల రూపంలో వచ్చే మొత్తంలో 50 శాతాన్ని టీచర్ల వేతనాలకు, 15 శాతం పాఠశాల అభివృద్ధి, వసతుల కల్పనకు, మరో 15 శాతం పాఠశాల నిర్వహణకు, ఇంకో 15 శాతం నిధు లను టీచర్లు, సిబ్బంది సంక్షేమం కోసం వెచ్చిం చాలని... యాజమాన్యాలు కేవలం 5 శాతం సొమ్ము నే లాభంగా తీసుకోవాలన్న నిబంధనను మార్చాలని కోరాయి. యాజమాన్యాల లాభం మొత్తాన్ని 5 శాతం నుంచి పెంచాలని, సంక్షేమానికి వెచ్చించాల్సిన 15 శాతంలో మార్పులు చేయాలన్నాయి. రూ.40 వేల గరిష్ట ఫీజుల విధానం ఉండాలని, ప్రాంతాలను బట్టి 5 కేటగిరీలుగా నిర్ణయించాలని కోరాయి. ఆదాయాన్ని బట్టే ఫీజులుండాలి.. ఆదాయ వ్యయాలను బట్టే స్కూల్ ఫీజులను నిర్ణ యించాలని తల్లిదండ్రుల సంఘాలు కమిటీని కోరా యి. వాటిని పరిశీలించి నిర్ణయించే జిల్లా ఫీజుల నియంత్రణ కమిటీలకు (డీఎఫ్‌ఆర్‌సీలకు) చట్టబద్ధత కల్పించాలని సూచించాయి. ఈ అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళతామని కమిటీ చైర్మన్ తిరుపతిరావు ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రైవేటు స్కూళ్ల ప్రకటనలు నిషేధించా లని.. కరపత్రాలు పంచుకోవచ్చని, యూజర్ చార్జీలు ఆప్షన్స్గానే ఉండాలని, రూ.500 మించిన ఫీజుల చెల్లింపును ఆన్లైన్లో లేదా బ్యాంకు చెక్కు ద్వారానే చేయాలని, ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించే స్కూళ్ల గుర్తింపు రద్దు చేసి.. వాటిలోని విద్యార్థులను దగ్గరలోని స్కూళ్లలో చేర్పించాలని, గతంలో మాదిరిగా విద్యా సంవత్సరాన్ని జూన్ 12 నుంచే ప్రారం భించాలని.. ఇలా పలు అంశాలపై ఈ సమావేశంలో చర్చ జరిగింది. ఈ అంశాలకు తల్లిదండ్రుల సంఘా లు అంగీకరించగా, ప్రైవేటు యాజమాన్యాల ప్రతిని ధులు వ్యతిరేకించారు. సమావేశంలో పాఠశాల విద్య కమిషనర్ కిషన్, అదనపు డైరెక్టర్ సత్యనారాయణ రెడ్డి, ప్రైవేటు యాజమాన్య ప్రతినిధులు శ్రీనివాస రెడ్డి, ఎస్‌ఎన్‌రెడ్డి, తల్లిదండ్రుల సంఘాల ప్రతిని ధులు నాగటి నారాయణ పాల్గొన్నారు. -
జీవో ప్రతుల నిమజ్జనం
అధిక ఫీజులను అరికట్టాలని హెచ్ఎస్పీఏ నిరసన సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు స్కూళ్ల అధిక ఫీజుల దోపిడీపై ైెహ దరాబాద్ స్కూల్స్ పేరెంట్ అసోసియేషన్ (హెచ్ఎస్పీఏ) ఆధ్వర్యంలో వినూత్న రీతిలో నిరసన తెలిపారు. స్కూల్ ఫీజుల నియంత్రణ కోసం తెచ్చిన జీవోలను ఉత్సవ విగ్రహాలుగా మార్చారని మండిపడుతూ వాటి ని వినాయకుడి ప్రతిమతోపాటు నిమజ్జనం చేశారు. హెచ్ఎస్పీఏ ఆధ్వర్యంలో చందానగర్ నుంచి నెక్లెస్ రోడ్ వరకు గణనాథునితో ర్యాలీగా వెళ్లారు. ఈ ర్యాలీలో పెద్దఎత్తున తల్లిదండ్రులు, పిల్లలు పాల్గొన్నారు. ‘ఓ బొజ్జ గణపయ్య.. స్కూల్ ఫీజు జులుం అరికట్టవయ్యా’, ‘తెలంగాణలో తల్లిదండ్రుల గణపతి.. పనికిరాని ప్రభుత్వ జీవోల తిరస్కృతి’ అంటూ ప్లకార్డులను ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. చివరకు హుస్సేన్‌సాగర్‌లో గణనాథునితోపాటు.. జీవో ప్రతులను నిమజ్జనం చేశారు. ఫీజు దోపిడీని నియంత్రించాలని సీఎం, డిప్యూటీ సీఎంని కలిసినా ఫలితం లేదని హెచ్ఎస్పీఏ అధికార ప్రతినిధి శివ మకుటం మండిపడ్డారు. జీహెచ్ఎంసీ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న ప్రకారం ఫీజులను నియంత్రించాలని పట్టుబట్టారు.