సాక్షి, హైదరాబాద్: ఫీజులు చెల్లిస్తే తప్ప ఆన్‌లైన్ క్లాసులకు అనుమతించబోమంటూ విద్యార్థుల తల్లిదండ్రుల తలలకు గన్ను పెట్టి ఫీజులు వసూలు చేయాలనుకుంటే ఎలా అని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ (హెచ్‌పీఎస్) యాజమాన్యాన్ని హైకోర్టు ప్రశ్నించింది. లాభాపేక్ష లేకుండా సొసైటీ ఆధ్వర్యంలో పాఠశాల నిర్వహిస్తున్నామని చెబుతూ.. కార్పొరేట్ పాఠశాలల తరహాలో ఫీజుల కోసం వేధింపులకు గురిచేస్తున్నారని మండిపడింది. విద్యార్థుల చదువుకునే హక్కును హరిస్తారా అంటూ నిలదీసింది. కరోనా నేపథ్యంలో ప్రజలందరూ తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారని, విద్యార్థుల తల్లిదండ్రుల పరిస్థితిని మానవత్వంతో అర్థం చేసుకోవాలని సూచించింది. ఫీజులు కట్టలేదన్న కారణంగా 219 మంది విద్యార్థులను గత 70 రోజులుగా ఆన్‌లైన్ క్లాసులకు అనుమతించకపోవడాన్ని తప్పుపట్టింది.
ఫీజుల కోసం విద్యార్థులు విద్యా సంవత్సరం కోల్పోయేలా చేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. వారిని ఆన్‌లైన్ తరగతులకు అనుమతించాలని ఆదేశించింది. ఈ అంశంపై పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమాకోహ్లీ, జస్టిస్ బి.విజయసేన్‌రెడ్డితో కూడిన ధర్మాసనం మంగళవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. హెచ్‌పీఎస్ యాజమాన్యం ఫీజులు తగ్గించకపోవడాన్ని సవాల్ చేస్తూ హెచ్‌పీఎస్ యాక్టివ్ పేరెంట్స్ అసోసియేషన్ తరఫున ఎం.ఆనంద్‌రెడ్డి దాఖలు చేసిన అప్పీల్‌ను ధర్మాసనం విచారించింది.
కరోనా నేపథ్యంలో ఫీజులు తగ్గించాలని కోరినా హెచ్‌పీఎస్ యాజమాన్యం స్పందించట్లేదని పిటిషనర్ తరఫున న్యాయవాది ఈవీ వేణుగోపాల్ వాదనలు వినిపించారు. స్కూల్ నిర్వహించాలంటే ఫీజులు తప్పనిసరి అని, ఎప్పటిలోగా ఫీజులు చెల్లిస్తారో చెప్పాలని హెచ్‌పీఎస్ తరఫున సీనియర్ న్యాయవాది ఎస్.రవి వాదనలు వినిపించారు. విద్యార్థులందరికీ రూ.10 వేల చొప్పున ఫీజు తగ్గించామని, అయినా బకాయి ఫీజులు చెల్లించడం లేదని తెలిపారు. ఈ మేరకు స్పందించిన ధర్మాసనం.. ఫీజులు వసూలు చేసుకోవచ్చని, అయితే ఫీజులు చెల్లించలేదన్న కారణంగా విద్యార్థులను తరగతులకు అనుమతించకపోవడం సరికాదని స్పష్టం చేసింది. విచారణను ఈనెల 13కు వాయిదా వేసింది.
కార్పొరేట్ స్కూల్స్‌లా వ్యవహరిస్తారా?
Published Wed, Jul 7 2021 2:34 AM | Last Updated on Wed, Jul 7 2021 8:32 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment