అధిక ఫీజులను అరికట్టాలని హెచ్‌ఎస్‌పీఏ నిరసన
సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు స్కూళ్ల అధిక ఫీజుల దోపిడీపై ైెహ దరాబాద్ స్కూల్స్ పేరెంట్ అసోసియేషన్ (హెచ్‌ఎస్‌పీఏ) ఆధ్వర్యంలో వినూత్న రీతిలో నిరసన తెలిపారు. స్కూల్ ఫీజుల నియంత్రణ కోసం తెచ్చిన జీవోలను ఉత్సవ విగ్రహాలుగా మార్చారని మండిపడుతూ వాటి ని వినాయకుడి ప్రతిమతోపాటు నిమజ్జనం చేశారు. హెచ్‌ఎస్‌పీఏ ఆధ్వర్యంలో చందానగర్ నుంచి నెక్లెస్ రోడ్ వరకు గణనాథునితో ర్యాలీగా వెళ్లారు. ఈ ర్యాలీలో పెద్దఎత్తున తల్లిదండ్రులు, పిల్లలు పాల్గొన్నారు.
‘ఓ బొజ్జ గణపయ్య.. స్కూల్ ఫీజు జులుం అరికట్టవయ్యా’, ‘తెలంగాణలో తల్లిదండ్రుల గణపతి.. పనికిరాని ప్రభుత్వ జీవోల తిరస్కృతి’ అంటూ ప్లకార్డులను ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. చివరకు హుస్సేన్‌సాగర్‌లో గణనాథునితోపాటు.. జీవో ప్రతులను నిమజ్జనం చేశారు. ఫీజు దోపిడీని నియంత్రించాలని సీఎం, డిప్యూటీ సీఎంని కలిసినా ఫలితం లేదని హెచ్‌ఎస్‌పీఏ అధికార ప్రతినిధి శివ మకుటం మండిపడ్డారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న ప్రకారం ఫీజులను నియంత్రించాలని పట్టుబట్టారు.