ఫీజు వసూలుపై ప్రైవేటు, కార్పొరేట్‌ విద్యా సంస్థల ఇష్టారాజ్యం | Private Corporate Schools Giving Targets To The Teachers To Collect The Fee | Sakshi
Sakshi News home page

టీచర్లకు టార్గెట్‌!

Published Tue, Jul 28 2020 3:38 AM | Last Updated on Tue, Jul 28 2020 8:08 AM

Private Corporate Schools Giving Targets To The Teachers To Collect The Fee - Sakshi

దిల్‌సుఖ్‌నగర్‌కు చెందిన మాలతి సమీపంలోని ఓ కార్పొరేట్‌ స్కూల్‌లో తెలుగు టీచర్‌గా పనిచేస్తోంది. ప్రస్తుతం ఆన్‌లైన్‌ క్లాసులు నిర్వహిస్తుండటంతో ఇంటి వద్ద నుంచే బోధన సాగిస్తోంది. కానీ జూలై 27వ తేదీ వచ్చినా ఈనెల వేతనం తన ఖాతాలో జమ కాలేదు. అంతేకాదు, జూన్‌ నెలలో ఇవ్వా ల్సిన వేతనం కూడా ఇప్పటికీ అందలేదు. కారణం స్కూల్‌ యాజమాన్యం తనకు నిర్దేశించిన ఫీజు వసూలు లక్ష్యాన్ని సాధించకపోవడమే. దీంతో రెండు నెలలుగా జీతమే లేదు. 

 సాక్షి, హైదరాబాద్‌: సాధారణంగా టీచర్లకుండే లక్ష్యాలు అత్యుత్తమ బోధన, మెరుగైన ఫలితాలు. కానీ ప్రస్తుతం కార్పొరేట్‌ స్కూళ్లలో ఉపాధ్యాయుల లక్ష్యాలు మారిపోయాయి. ఆన్‌లైన్‌లో ఎలాగోలా బోధనా కార్యక్రమాలు నిర్వహిస్తున్న టీచర్లకు విద్యార్థుల నుంచి నెలవారీ ఫీజు డబ్బులను వసూలు చేయడాన్ని యాజమాన్యాలు లక్ష్యాలుగా నిర్దేశించాయి. దీంతో ఫీజులు వసూలు చేసిన టీచర్లకు సగం వేతనాలు ఇస్తుండగా... వసూలు చేయని వారికి మొండిచేతులు చూపిస్తున్నారు.

దాదాపు అన్ని కార్పొరేట్, ప్రైవేటు స్కూళ్లలో ఉద్యోగుల పరిస్థితి ఇదే విధంగా ఉంది. రాష్ట్రంలో 20 వేలకు పైగా ప్రైవేటు, కార్పొరేట్‌ విద్యా సంస్థలున్నాయి. ఇందులో 65 శాతంపైగా స్కూళ్లు ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహిస్తున్నాయి. రోజుకు రెండు లేదా మూడు సబ్జెక్టుల చొప్పున మాత్రమే తరగతులు నిర్వహిస్తున్నారు. దీంతో బోధనా సిబ్బందికి ప్రతిరోజూ తరగతులకు హాజరు కావాల్సిన అవసరం లేదు. వారంలో రెండు లేదా మూడు రోజులు మాత్రమే ఆన్‌లైన్‌ తరగతుల ద్వారా బోధనా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. వీరికి సగం వేతనం చొప్పున ఇవ్వనున్నట్లు యాజమాన్యాలు తొలుత ప్రకటించినప్పటికీ, ప్రస్తుతం ఆ మేరకు సైతం చెల్లింపులు చేయడం లేదు.

ప్రతి క్లాస్‌ టీచర్‌కు ఆ తరగతిలోని విద్యార్థుల నుంచి ట్యూషన్‌ ఫీజును వసూలు చేయాలని నిబంధన పెట్టారు. దీంతో ఆన్‌లైన్‌ తరగతి పూర్తయిన తర్వాత ఆయా విద్యార్థుల తల్లిదండ్రులకు వ్యక్తిగతంగా ఫోన్లు చేసి ఫీజులు చెల్లించాలని ఒత్తిడి చేస్తున్నారు. లాక్‌డౌన్‌ అనంతర పరిణామాలతో చాలా మంది ఉపాధి కోల్పోయారు. వ్యాపార రంగం సైతం క్షీణించడంతో ఆదాయం పతనమైంది. ఈ క్రమంలో ఫీజులు చెల్లించలేమని తల్లిదండ్రులు చెబుతున్నప్పటికీ టీచర్లు వారికి ఫోన్లు చేసి కొంత మొత్తమైనా చెల్లించాలని ప్రాధేయపడుతున్నారు. ఈ క్రమంలో కొన్నిసార్లు గొడవలకు సైతం దారితీస్తుండడం గమనార్హం.

వేతన వెతలు... 
ప్రైవేటు విద్యా సంస్థల్లో పనిచేసే బోధన, బోధనేతర సిబ్బంది వేతనాల కోసం అల్లాడుతున్నారు. మార్చి నెల నుంచి లాక్‌డౌన్‌ మొదలైంది. దీంతో అప్పట్నుంచి వేతన చెల్లింపులు గందరగోళంగా మారిపోయాయి. ఫీజులు వసూలు కావడం లేదనే సాకుతో యాజమాన్యాలు చేతులెత్తేశాయి. కొన్ని సంస్థలు మాత్రం ఏప్రిల్‌ నెలలో సగం వేతనంతో సరిపెట్టగా మెజార్టీ విద్యా సంస్థలు బోధన, బోధనేతర సిబ్బందికి వేతనాలు ఇవ్వలేదు. మే నెలలో 90 శాతం సంస్థలు జీతాలకు మంగళం పాడేశాయి. జూన్, జూలై నుంచి ఆన్‌లైన్‌ తరగతులు బోధిస్తున్నప్పటికీ వేతనాలు ఇచ్చేందుకు సంస్థలు ఆసక్తి చూపడం లేదు. ఈ క్రమంలో ఫీజు వసూళ్ల బాధ్యతలు టీచర్లపైకి నెట్టేశాయి. నిర్దేశించిన లక్ష్యాలు సాధిస్తేనే వేతనాలిస్తామని చెప్పడంతో వేలాది మంది ఉద్యోగులు వేతనాలందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement