విద్య సేవేగానీ.. వ్యాపారం కాకూడదు | CM YS Jagan Comments in Education sector review | Sakshi
Sakshi News home page

విద్య సేవేగానీ.. వ్యాపారం కాకూడదు

Published Tue, Jun 25 2019 3:56 AM | Last Updated on Tue, Jun 25 2019 3:56 AM

CM YS Jagan Comments in Education sector review - Sakshi

ప్రజావేదికలో నిర్వహించిన కలెక్టర్ల సమావేశానికి హాజరైన మంత్రులు, ఐఏఎస్‌లు, ఉన్నతాధికారులు తదితరులు

సాక్షి, అమరావతి: విద్య అన్నది సేవే కానీ.. వ్యాపారం కాకూడదని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ప్రజావేదికలో నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో విద్యాశాఖపై సమీక్షిస్తూ.. తనకు అత్యంత ప్రాధాన్య రంగాల్లో విద్యాశాఖ కూడా ఒకటన్నారు. దేశంలోని చట్టాల ప్రకారం విద్య అనేది సేవాకార్యక్రమమేగానీ.. వ్యాపారాంశం కాదన్నారు. కొందరు విద్యను వ్యాపారంగా మార్చారని, ఇకపై ఈ విధానాలు చెల్లవని చెప్పారు. విద్యాహక్కు చట్టాన్ని రాష్ట్రంలో నూరు శాతం అమలు చేస్తామని స్పష్టం చేశారు. ఈ చట్టం ప్రకారం ప్రతి ప్రైవేట్‌ స్కూల్‌ మొత్తం సీట్లలో 25 శాతం సీట్లను పేదలకు ఉచితంగా కేటాయించాల్సి ఉందన్నారు. ఇక నుంచి అలా కేటాయించేలా చర్యలు తీసుకుంటామని సీఎం ప్రకటించారు. ప్రైవేట్‌ విద్యా సంస్థల్లో ఫీజుల నియంత్రణకు రెండు ప్రత్యేక చట్టాలు తీసుకు రానున్నట్టు ఆయన చెప్పారు.

ప్రైవేట్‌ పాఠశాలల్లో ఫీజుల నియంత్రణ ఒకటి, ప్రైవేట్‌ కాలేజీల్లో ఫీజుల నియంత్రణకు మరొక చట్టం తీసుకొస్తామని వెల్లడించారు. ప్రతి ప్రైవేట్‌ స్కూల్, ప్రైవేట్‌ కాలేజీలో ఎంతమంది విద్యార్థులకు ఎంత మంది టీచర్లు ఉండాలనే విషయాలను దృష్టిలో ఉంచుకుని వాటికి అనుమతి ఇవ్వాలని సూచించారు. అవసరమైతే అనుమతి ఇచ్చే అధికారాన్ని డీఈవోల నుంచి జిల్లా కలెక్టర్‌కు బదిలీ చేస్తామన్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలో 26 శాతం నిరక్ష్యరాస్యత ఉంటే.. మన రాష్ట్రంలో 33 శాతం ఉందని చెప్పారు. దీనిని దృష్టిలో పెట్టుకునే రాష్ట్రంలో ప్రతి చిన్నారికి చదువు అందించాలనే లక్ష్యంతో అమ్మ ఒడి పథకాన్ని ప్రవేశపెట్టామన్నారు. ప్రైవేట్, ప్రభుత్వ పాఠశాల అన్న తేడా లేకుండా పేదలు తమ పిల్లలను ఏ బడికి పంపినా జనవరి 26న వారి తల్లులకు రూ.15 వేల చొప్పున అందజేస్తామన్నారు. 

ప్రతి స్కూల్లోనూ ఇంగ్లిష్‌ మీడియం 
ప్రభుత్వ పరిధిలోని ప్రతి స్కూల్‌నూ ఇంగ్లిష్‌ మీడియం స్కూల్‌గా మారుస్తామని, తెలుగు సబ్జెక్ట్‌ను తప్పనిసరి చేస్తామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఇప్పుడున్న స్థితిలో స్కూళ్ల ఫొటో తీయాలని.. రెండేళ్లలో వాటికి మౌలిక వసతులన్నీ సమకూర్చి తర్వాత మరోసారి ఫొటోలు తీసి ప్రజల ముందు ఉంచుతామని చెప్పారు. వచ్చే ఏడాది నుంచి ప్రభుత్వ పాఠశాలలు తెరిచే నాటికే పిల్లలకు యూనిఫామ్, పాఠ్య పుస్తకాలు అందేలా చర్యలు చేపడతామని ప్రకటించారు. ఈ ఏడాది యూనిఫామ్‌ అందజేయడానికి ఆగస్టు వరకు సమయం పట్టవచ్చని అధికారులు సీఎంకు చెప్పగా..  వచ్చే ఏడాది నుంచి కచ్చితంగా పాఠశాలలు తెరిచే రోజుకే వాటిని సమకూర్చాలని ఆదేశించారు. ప్రభుత్వ బడుల్లో చదివే పిల్లలకు స్కూల్‌ యానిఫామ్‌తోపాటు కొత్తగా బూట్లను కూడా పంపిణీ చేయాలనే ఆలోచన ఉన్నట్టు చెప్పారు. గత ఐదేళ్లలో స్కూల్‌ యూనిఫామ్‌ పంపిణీలోనూ భారీ అవినీతి, అక్రమాలు జరిగాయని.. కనీసం పిల్లలకు సరైన సైజులో దుస్తుల్ని కూడా అందజేసే వారు కాదన్నారు. ఇకపై ఏ పిల్లవాడికీ ప్రైవేట్‌ స్కూల్‌కు పోవాలన్న ఆలోచన రాకూడదనేది లక్ష్యంగా పెట్టుకోవాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. యూనిఫామ్‌ పంపిణీలో అవినీతిపై తమ ప్రభుత్వం విచారణ జరిపిస్తుందని స్పష్టం చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement