పిల్లలందరికీ ఒకటే టూత్ బ్రష్!
అంగవైకల్యంతో అవస్థలు పడే పిల్లలకు ఆసరా అందించాల్సిన ప్రభుత్వ హాస్టళ్లు, జీవిత చరమాంకంలో పట్టించుకునేవారు లేక పడరాని పాట్లు పడే వృద్ధుల ఆశ్రమాల పరిస్థితి దయనీయంగా ఉందని జాతీయ మానవహక్కుల కమిషన్ (ఎన్‌హెచ్ఆర్‌సీ) ఛైర్మన్, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హెచ్ఎల్ దత్తు ఆందోళన వ్యక్తం చేశారు. ఎయిడెడ్ హోమ్స్‌లో సుమారు 50 మంది పిల్లలు ఒకే టూత్ బ్రష్ వాడుతున్నవైనం తనను ఎంతో బాధిస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వాధీనంలో కొనసాగుతున్న వికలాంగ బాలల హాస్టళ్ళు, వృద్ధాశ్రమాల్లో పరిస్థితిపై.. ఎన్‌హెచ్‌ఆర్సీ ఛైర్మన్ హెచ్ఎల్ దత్తు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. వృద్ధాశ్రమాలను, హాస్టళ్ళను ప్రతిరోజూ సందర్శిస్తున్న ఆయన... వారికి సరైన సహకారం అందించి వారిలో విశ్వాసాన్ని పెంచాల్సిన అవసరం ఉందన్నారు. గత డిసెంబర్ లో భారత ప్రధాన న్యాయమూర్తిగా ఉద్యోగ విరమణ చేసిన అనంతరం ఎన్ హెచ్ ఆర్సీ ఛైర్మన్ గా నియమితులైన తర్వాత.. ప్రతిరోజూ బెంగళూరు సమీపంలోని వృద్ధాశ్రమాలను సందర్శించి వారితో కొంత సమయం గడుపుతున్నారు. ఈ నేపథ్యంలో ఓ వృద్ధుడి కథ విన్నానని చెప్పారు. ఆయనకు ఇద్దరు బాగా సంపాదిస్తున్న, ఉన్నత స్థాయిలో ఉన్న కొడుకులు ఉన్నారని, అయితే వారితో కలసి తనకు ఉండే భాగ్యం మాత్రం కరువైందని ఆయన ఆవేదన వ్యక్తం చేయడం తనను ఎంతో బాధించిందని, అటువంటి వారికి రోజూ కౌన్సెలింగ్ ఇప్పించి, వారిలో విశ్వాసాన్ని నింపాల్సిన అవసరం ఉందని జస్టిస్ దత్తు అభిప్రాయపడ్డారు.
జస్టిస్ దత్తు ఛైర్మన్ గా పదవీ బాధ్యతలు తీసుకున్న తరువాత... ఇరత సభ్యులు జస్టిస్ సిరియాక్ జోసెఫ్, డి. మురుగేశన్, మాజీ ఐపీఎస్ ఆఫీసర్ ఎస్‌సి సిన్హాలతో అనేకసార్లు సమావేశాలు నిర్వహించి.. రాష్ట్రాల్లోని వికలాంగ పిల్లల హాస్టళ్లు, వృద్ధాశ్రమాలను సందర్శించి, ప్రాథమిక సదుపాయాలపై నివేదిక ఇవ్వాలని కోరారు. వాటి పరిస్థితులను మెరుగు పరిచేందుకు కావలసిన సలహాలు, సూచనలను ఇచ్చేందుకు ప్రత్యేక నిపుణుల బృందాన్ని ఏర్పాటుచేశారు. ప్రభుత్వ వృద్ధాశ్రమాల్లో, వికలాంగ హాస్టళ్ళలో ఉండేవారి జీవితాలు ఆనందమయంగా ఉండేట్టు మార్పులు జరిగితే తన జీవితంలో అదే అత్యంత సంతోషకర సన్నివేశం అవుతుందని జస్టిస్ దత్తు అభిప్రాయం వ్యక్తం చేశారు.