కొంతమందికి పరిస్థితులన్నీ చక్కగా అనుకూలంగా ఉంటే, మరికొందరికి కనీసం వయసుకు తగ్గినట్లుగా శరీరం ఎదగక నానా ఇబ్బందులు పడుతుంటారు. అబోలి జరీత్ జీవితం సరిగ్గా ఇలానే ఉంది. శరీరం ఎదగకపోడంతో తన పనులు తాను సరిగా చేసుకోలేని సమస్యతో బాధపడుతోంది. బతికినంత కాలం సమస్య తీరదని తెలిసినప్పటికీ తను ఒక స్టార్‌గా ఎదగాలనుకుంటుంది అబోలి. కేవలం మూడు అడుగుల ఎత్తున్న అబోలీ... స్టార్ అయ్యేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తూ నెటిజన్లతో అబ్బో..లీ అనిపిస్తుంది.
నాగ్‌పూర్‌కు చెందిన అబోలీ జరీత్ చిన్నారిగా ఉన్నప్పుడే ఆస్టియోమలాసియా (అస్థిమృదుత్వం) వచ్చింది. చిన్నపిల్లల్లో అసాధారణంగా వచ్చే ఈ వ్యాధి విటమిన్ లోపం కారణంగా వస్తుంది. అబోలికి ఈ సమస్య రావడంతో ఎముకలు సరిగా ఎదగలేదు. దీనికితోడు కిడ్నీలు కూడా సరిగా పనిచేయడం మానేశాయి. ఫలితంగా తన ఎత్తు కేవలం మూడు అడుగుల నాలుగు అంగుళాలు మాత్రమే పెరిగింది. ఈ అనారోగ్య సమస్య వల్ల ప్రస్తుతం 19 ఏళ్ల అబోలీ ఐదేళ్ల చిన్నారిలా కనిపిస్తుంది.
కిడ్నీ పనితీరు దెబ్బతినడంతో నిత్యం డయపర్లు వేసుకుని ఉండాల్సిందే. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లేదని డాక్టర్లు స్పష్టం చేయడంతో మరింత దిగులుపడింది అబోలి. ఒకపక్క మానసిక బాధ, మరోపక్క తన రోజువారి పనులు చేసుకోవడానికి కూడా కదలలేని పరిస్థితి. అయినా అబోలి ఆత్మస్థైర్యాన్ని కోల్పోలేదు. ఉపశమనం కలిగించే వైద్యచికిత్సలు తీసుకుని కాస్త అటూ ఇటూ కదలగలిగేలా శక్తిని పుంజుకుంది.
స్టార్‌గా ఎదగాలని..
ఆరోగ్యం బాగోకపోయినా అబోలికి చిన్నప్పటి నుంచి స్టార్‌గా ఎదగాలనే కల ఉంది. ఈ విషయం తెలిసిన వారు నిరుత్సాహపరిచేలా గేలిచేయడం, ఆమె దురదృష్టాన్ని అవహేళనచేస్తూ తనని మరింత కుంగదీసేవారు. అయినా అబోలి అధైర్యపడలేదు. తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో ఎలాగైనా స్టార్‌గా ఎదగాలనుకుంది. ఈ క్రమంలోనే.. ముందుగా డ్యాన్స్ నేర్చుకోవాలనుకుంది. కానీ శరీరం సహకరించకపోవడంతో..గాయనిగా మారాలనుకుంది.
సంగీతం నేర్చుకుంటూనే ‘మిస్ వీల్ చెయిర్ ఇండియా’ పోటీల్లో ఫైనల్స్ వరకు చేరింది. అంతేగాక ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో యాక్టింగ్ చేస్తోన్న ఫోటోలు, వీడియోలు, పాటలు పాడుతోన్న వీడియోలు పంపుతూ నెటిజన్‌లను అలరిస్తోంది. తన హావభావాలతో ఏడువేలమందికి పైగా ఫాలోవర్స్‌ను మెప్పిస్తూ డిజేబుల్డ్ సెలబ్రెటీగా దూసుకుపోతోంది.
నాకు నేనే ప్రేరణ..
సంగీతం నేర్చుకుంటూ, పాటలు పాడుతూ ఒక గుర్తింపు తెచ్చుకుంటున్నాను. నా గురించి ఎవరు ప్రతికూలంగా మాట్లాడినా నేనస్సలు పట్టించుకోను. చిన్నప్పటి నుంచి ఎదుర్కోన్న అనే అనుభవాలు నాకు నేనే ప్రేరణగా తీసుకునేలా చేశాయి. నాకున్న ఒకే ఒక కల పాపులర్ సింగర్‌ని కావడం. నా దృష్టి మొత్తం దానిమీదే ఉంటుంది.
– అబోలి
Comments
Please login to add a commentAdd a comment