రైతు బజార్లలో వికలాంగులకు 3 శాతం స్టాళ్లు | 3 per cent of a farmer bazaar stalls for the disabled | Sakshi

రైతు బజార్లలో వికలాంగులకు 3 శాతం స్టాళ్లు

Apr 30 2015 11:16 PM | Updated on Jun 4 2019 5:04 PM

రాష్ట్రంలోని రైతు బజార్లలో వికలాంగులకు స్టాళ్లు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

హైదరాబాద్: రాష్ట్రంలోని రైతు బజార్లలో వికలాంగులకు స్టాళ్లు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తం దుకాణాల్లో 3 శాతం స్టాళ్లను రైతు కుటుంబాలకు చెందిన వికలాంగులకు కేటాయిస్తారు. జాయింట్ కలెక్టర్ ఈమేరకు దరఖాస్తులను ఆహ్వానించి అర్హులను గుర్తిస్తారు. వికలాంగులు, స్థానిక ప్రజా ప్రతినిధుల నుంచి వచ్చిన విజ్ఞాపనల మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. గురువారం ఈమేరకు ఉత్తర్వులు జారీ చేసింది.


ఆ మూడు సొసైటీల ఆస్తులు అమ్ముకోవచ్చు
తూర్పు గోదావరి జిల్లాలోని మూడు సొసైటీల నిరుపయోగ ఆస్తులను అమ్ముకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. తుని, సామర్లకోట, గొల్లపాలెంలోని డీసీఎంఎస్ సొసైటీ భవనాలు చాలా కాలంగా నిరుపయోగంగా ఉన్నాయి. వాటిని అమ్మడం ద్వారా వచ్చిన డబ్బుతో ఎరువులు, విత్తనాల వ్యాపారాన్ని నిర్వహించేందుకు మూలధనంగా వినియోగిస్తారు. వీటిని ప్రభుత్వం సూచించిన మేరకు విక్రయించేందుకు కాకినాడలోని తూర్పు గోదావరి జిల్లా కోఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ అధ్యక్షునికి అనుమతి ఇస్తూ గురువారం ఉత్తర్వులు విడుదల అయ్యాయి.


ఆ సలహాదారుకు సెంట్రల్ ఫండ్ నుంచి జీతభత్యాలు
వ్యవసాయ మార్కెటింగ్, గిరిజన సంక్షేమ విభాగానికి ప్రభుత్వ సలహాదారుగా ఉన్న మాజీ ఐఎఎస్ అధికారి జీవీ కృష్ణారావు జీత భత్యాలను సెంట్రల్ మార్కెటింగ్ ఫండ్ నుంచి చెల్లించాల్సిందిగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. క్యాబినెట్ హోదా కలిగిన ఆయన్ను రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల సలహాదారుగా నియమించింది.

అల్లవరం సొసైటీ ఛైర్మన్ నియామకం
అల్లవరం మార్కెటింగ్ కమిటీ ఛైర్మన్‌గా గునిశెట్టి లక్ష్మీనారాయణ, ఉపాధ్యక్షులుగా మల్లాది వెంకట రమణ నియమితులయ్యారు. మరో 17 మంది సభ్యులుగా ఉంటారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement