
పేరుకు రాజు.. కష్టమే రోజూ
ఇతని పేరు అడ్డా బాలరాజు. వయసు 42 ఏళ్లు. పాలకోడేరు మండలం శృంగవృక్షం గ్రామానికి చెందిన ఈయన పుట్టుకతోనే వికలాంగుడు. గూని సమస్య ఉండటంతో ఏ పనీ చేయలేడు. గతంలో తండ్రి చనిపోయాడు. తల్లి వృద్ధురాలు. ఇతడి పెద్దక్క భర్త మరణించడంతో కుమారుడితో కలిసి పుట్టింటికి వచ్చేసింది. చిన్నక్క అడపాదడపా వీరి ఆలనాపాలనా పట్టించుకునేది. ఆగ్రహించిన ఆమె భర్త పుట్టింటికే పో.. అని ఆమెను తరిమేశాడు.
తల్లి, ఇద్దరు అక్కలు, వారి బిడ్డలకు ఒక్క మెతుకు కూడా పెట్టలేని దుస్థితికి చేరిన బాల రాజు తనలో తానే కుమిలిపోతున్నాడు. ఇతనికి రెండు నెలల క్రితం వరకూ వికలాంగుల కోటాలో నెలకు రూ.500 పింఛను వచ్చేది. ఆ మొత్తాన్ని రూ.1,500 పెంచుతున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించడంతో బాలరాజు సంబరపడ్డాడు. ఆ సంతోషం మూణ్ణాళ్ల ముచ్చటే అయ్యింది. రెండు నెలలుగా అతడికి పింఛను అందటం లేదు. ఇదేమని అడిగితే జాబితాలో పేరు లేదని ఒకరు, కంప్యూటర్‌లో పేరు రాలేదని ఇంకొకరు, వేలి ముద్రలు పడలేదని మరొకరు చెబుతున్నారు.
కాలకృత్యాలు తీర్చుకునేందుకు సైతం ఇతరులపై ఆధారపడాల్సిన దుస్థితి ఇతనిది. ‘అవిటితనంతో బాధపడుతున్నాను. ఎందుకీ బతుకు అనిపిస్తోంది. చంద్రబాబు పింఛను పెంచుతానంటే ఆనందపడ్డాను. ఆయన దయ కూడా నాపై లేదు’ అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. బాలరాజుకు పింఛను అందుతుందా.. కష్టాలు కొంచెమైనా తీరుతాయా.. ఏమో అధికారులే సమాధానం చెప్పాలి మరి.
- పాలకోడేరు