కాగజ్‌నగర్‌టౌన్: పుట్టుకతోనే చేతులు లేకపోయినా ఆత్మవిశ్వాసం చెక్కుచెదరలేదు. కాళ్ల వేళ్లే కుంచగా మారి అందమైన బొమ్మలెన్నో వేశాయి..కంప్యూటర్ కీ బోర్డుపై టక్‌టక్ శబ్దం వినిపిస్తూ ఎన్నో ఎంట్రీలు చేశాయి. ఆర్థిక ఇబ్బందులెన్ని ఎదురైనా నిరుత్సాహపడకుండా పీజీ వరకూ చదివి ఎందరికో ఆదర్శంగా నిలిచాడు జాకీర్‌పాషా. కుమురంభీం జిల్లా కాగజ్‌నగర్ పట్టణంలోని ఆటో డ్రైవర్ షేక్ బాబా–మెహరా దంపతుల మొదటి సంతానమైన జాకీర్ పాషా డిగ్రీ వరకు కాగజ్‌నగర్‌లోనే చదివాడు. ఆపై నాగార్జున యూనివర్సిటీ నుంచి పీజీ పట్టా అందుకున్నాడు. పీజీ చదువుతుండగానే కంప్యూటర్ కోర్సులు కూడా పూర్తి చేశాడు.
♦ జాకీర్‌పాషా కాళ్లతో పెయింటింగ్స్ వేయడమే కాకుండా.. ఆ వీడియోలను యూట్యూబ్, ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్ చేస్తున్నాడు.
♦ హరితహారం కార్యక్రమంలో వందలాది మొక్కలను కాళ్ల సాయంతో నాటి ఆదర్శంగా నిలిచాడు.
♦ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో స్వయంగా కేంద్రానికి వెళ్లి కాలి సాయంతో ఓటుహక్కు వినియోగించుకున్నాడు.
♦ తాజాగా కాగజ్‌నగర్ మున్సిపాలిటీలో అభయహస్తం దరఖాస్తుల డేటా ఎంట్రీకి పలువురు ఆపరేటర్లను ఎంపిక చేశారు. అందులో జాకీర్‌పాషాకు అవకాశం దక్కింది. కాళ్లతోనే వివరాలను అప్‌లోడ్ చేస్తున్నాడు.
రుణంరాలేదు.. కొలువూదొరకలేదు
గత నవంబర్‌లో తెలంగాణ స్టేట్ మైనార్టీ ఫైనాన్స్ కమిషన్ ద్వారా వెలువడిన రుణాల కోసం జాకీర్‌పాషా దరఖాస్తు చేసుకున్నా, ఇప్పటివరకు మంజూరు కాలేదు. ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు ప్రాతిపదికన కొలువు ఇప్పించాలని పలుమార్లు కలెక్టర్‌కు వినతిపత్రం అందించాడు. ఇటీవల హైదరాబాద్‌లో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో సైతం కొలువు ఇప్పించి ఆదుకోవాలని దరఖాస్తు సమరి్పంచాడు.
ప్రభుత్వ సాయంకోసం ఎదురుచూపు
మాది నిరుపేద కుటుంబం. నాతోపాటు ముగ్గురు చెల్లెళ్లు ఉన్నారు. నాన్న ఆటో నడిపితే వచ్చే డబ్బు ఇంటి ఖర్చులకే సరిపోతున్నాయి. ప్రభుత్వ సహాయం కోసం ఎదురుచూస్తున్నా. ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్టు ప్రాతిపదికన ఉద్యోగావకాశం కల్పిస్తే ఆర్థిక సమస్యలు దూరమవుతాయి. దాతలు ముందుకొచ్చి సాయం చేస్తే నా కుటుంబానికి మేలు జరుగుతుంది. – జాకీర్ పాషా, దివ్యాంగుడు
Comments
Please login to add a commentAdd a comment