సాక్షి, న్యూఢిల్లీ: దివ్యాంగ చిన్నారిని ఇండిగో ఎయిర్‌లైన్స్ విమానం ఎక్కనివ్వని ఘటనపై కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింథియా తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇలాంటి ప్రవర్తనను ఎన్నటికీ సహించేది లేదని స్పష్టంచేశారు. ఏ వ్యక్తీకి ఇలాంటి అనుభవం కాకూడదని.. ఘటనపై స్వయంగా తానే దర్యాప్తు చేపడతానని ట్విటర్ వేదికగా తెలిపారు. బాధ్యులపై తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈమేరకు ఇండిగోను హెచ్చరిస్తూ ఆయన ట్వీట్ చేశారు. ఈ వ్యవహారంపై ఇప్పటికే డీజీసీఏ దర్యాప్తు ప్రారంభించిందని, ఇండిగో సంస్థ నుంచి నివేదిక కోరిందని అధికార వర్గాలు వెల్లడించాయి.
చదవండి👉 చిరుతతో పోరాటం.. అధికారులపై దాడి.. వైరల్ వీడియో
There is zero tolerance towards such behaviour. No human being should have to go through this! Investigating the matter by myself, post which appropriate action will be taken. https://t.co/GJkeQcQ9iW
— Jyotiraditya M. Scindia (@JM_Scindia) May 9, 2022
ఏం జరిగింది?
హైదరాబాద్ వెళ్లేందుకు గత శనివారం దివ్యాంగ చిన్నారితో కలిసి ఓ కుటుంబం రాంచీ విమానాశ్రయానికి వచ్చింది. అయితే ఆ బాలుడు విమానం ఎక్కేందుకు ఇండిగో సిబ్బంది నిరాకరించారు. చిన్నారి భయాందోళనతో ఉన్నాడని.. దాని వల్ల ఇతర ప్రయాణికులకు ఇబ్బంది కలుగుతుందనే కారణంతో ఫ్లైట్ ఎక్కనివ్వలేదు. దీంతో ఆ బాలుడి తల్లిదండ్రులు కూడా ప్రయాణాన్ని విరమించుకున్నారు. ఈ ఘటన గురించి మనీషా గుప్తా అనే తోటి ప్రయాణికురాలు తన ఫేస్‌బుక్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు. చిన్నారిని అడ్డుకున్న ఇండిగో సిబ్బంది అతడి తల్లిదండ్రులతో వాగ్వాదానికి దిగారని పేర్కొన్నారు. ఇది సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.
ఇండిగో ఏమంటోంది?
రాంచి ఎయిర్‌పోర్ట్‌లో జరిగిన ఘటనపై ఇండిగో సంస్థ వివరణ ఇచ్చింది. భయంతో ఉన్న ఆ చిన్నారి స్థిమిమితపడితే విమానం ఎక్కించడానికి చివరి నిమిషం వరకూ గ్రౌండ్ సిబ్బంది వేచి చూశారని.. కానీ ఫలితం లేకపోయిందని తెలిపింది. ఆ కుటుంబానికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా.. ఓ హోటల్లో వసతి సౌకర్యం కల్పించామని.. ఆదివారం ఉదయం వారు మరో విమానంలో గమ్యస్థానానికి చేరుకున్నారని వివరించింది.
Comments
Please login to add a commentAdd a comment