పింఛన్.. టెన్షన్!
కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిన చందాన తయారైంది పింఛన్ల పరిస్థితి. బోగస్ పింఛన్లను ఏరివేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం పింఛన్‌ల కోసం కొత్తగా దరఖాస్తులను ఆహ్వానించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గతంలో ఉన్న పింఛన్లకు రెట్టింపు సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. ఏంచేయాలో తెలియక అధికారులు తలలు పట్టుకుంటూనే దరఖాస్తులను వడపోసే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. కొత్తగా రాబోయే పింఛన్లపై ‘సాక్షి’ దినపత్రిక ఆధ్వర్యంలో బంజారాహిల్స్‌లోని షేక్‌పేట మండల కార్యాలయ ఆవరణలో శనివారం ఏర్పాటు చేసిన చర్చావేదికలో మహిళలు తమ మనోగతాన్ని వెల్లడించారు.
బంజారాహిల్స్: వృద్ధాప్య, వితంతు, వికలాంగుల పింఛన్ల కోసం ప్రభుత్వం ఈ నెల 13 నుంచి 20 వరకు దరఖాస్తులను ఆహ్వానించింది. అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవచ్చంటూ ప్రకటించగానే పెద్ద సంఖ్యలో వృద్ధులు, వితంతువులు, వికలాంగులు తరలివచ్చి ధ్రువపత్రాలు జతపరిచి దరఖాస్తులను అందజేశారు. ఊహించినదానికంటే భిన్నంగా దరఖాస్తులు రావడంతో ఇందులో ఎంతమందికి అర్హత కల్పిస్తారనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. వితంతు, వృద్ధాప్య పింఛన్ల కోసం భారీగా దరఖాస్తులు అందినట్లు షేక్‌పేట మండల రెవెన్యూ అధికారులు పేర్కొంటున్నారు.
షేక్‌పేట మండల పరిధిలో వృద్ధాప్య పింఛన్ల కోసం 2,614, వితంతు పింఛన్ల కోసం 2,679, వికలాంగుల పింఛన్ల కోసం 1027. మొత్తం కలిపి 6320 దరఖాస్తులు అందాయి. ఇప్పటి వరకు మండల పరిధిలో కేవలం 3,100 మందికి మాత్రమే వృద్ధాప్య, వితంతు, వికలాంగుల పింఛన్లు పంపిణీ చేస్తున్నారు. తాజాగా రెట్టింపు సంఖ్యలో దరఖాస్తులు అందడంతో అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్లు లభిస్తాయా ఇందులో కూడా వడపోత ఉంటుందా అనే విషయంపై ఆందోళన వ్యక్తమవుతోంది. అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్ ఇవ్వాల్సిందేనని దరఖాస్తుదారులు పేర్కొంటున్నారు.
అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ పింఛన్ ఇవ్వాలని ఫిలింనగర్ మహాత్మాగాంధీనగర్‌కు చెందిన రమణమ్మ అనే వృద్ధురాలు డిమాండ్ చేసింది. కొత్త పింఛన్ల కోసం ఎప్పటి నుంచో చూస్తున్నామని ఈ సారి తప్పకుండా అర్హత కల్పించాలని బంజారాహిల్స్ రోడ్ నం. 2లోని ఇందిరానగర్ బస్తీకి చెందిన రాములు అనే చిరు వ్యాపారి కోరారు.
పింఛన్ల దరఖాస్తులు ఎక్కువగా ఉన్నాయని పాత సంఖ్య తరహాలోనే ఇస్తానంటే చాలా మంది నష్టపోతారని పంజగుట్ట రామకృష్ణానగర్ బస్తీకి చెందిన మొగులయ్య అనే వృద్ధుడు తెలిపారు. దాదాపు చర్చలో పాల్గొన్న వారంతా దరఖాస్తుదారులందరికీ అర్హత కల్పించాలని డిమాండ్ చేశారు. షేక్‌పేట మండల పరిధిలో నిర్దేశించిన లక్ష్యం ప్రకారం పింఛన్లు ఇస్తామని వెల్లడిస్తే మాత్రం చాలా మంది నష్టపోవాల్సి వస్తుందని జూబ్లీహిల్స్ డివిజన్ పరిధిలోని నందగిరిహిల్స్, గురుబ్రహ్మనగర్‌కు చెందిన నారాయణ అన్నారు.
వృద్ధులను కనికరించాలి
ఈ సారి పింఛన్ పెరగడంతో చాలా మంది ఆశలు పెట్టుకున్నారు. అర్హత ఉన్న అందరికీ పింఛన్లు ఇవ్వాలి. వృద్ధులను కనికరించాలి. కొంత మందికే ఇస్తామంటే కుదరదు.
- మొగులమ్మ
వస్తాయనే ఆశిస్తున్నాం
ఈసారి ప్రతి ఒక్కరికీ పింఛన్లలో మేలు చేకూరుతుందని భావిస్తున్నాం. పింఛన్ లబ్ధిదారుల ఎంపికలో ఈ సారి అక్రమాలు, అవినీతి చోటు చేసుకునే అవకాశాలు లేవని విన్నాం. పకడ్బందీగా దరఖాస్తుల విచారణ కూడా చేపడుతుండటంతో అర్హత ఉన్నవారందరూ లబ్ధిపొందుతారని అనుకుంటున్నాం.
- గంగారపు లక్ష్మి