widowed
-
ఆ కుమార్తెలకు ఫ్యామిలీ పెన్షన్ రాదు.. తెలంగాణ సర్కారు క్లారిటీ
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగి/పెన్షనర్ మరణానంతరం జీవిత భాగస్వామికి ఫ్యామిలీ పెన్షన్ (కుటుంబ పింఛను)ను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది. అయితే ఫ్యామిలీ పెన్షన్ పొందిన ఆ జీవిత భాగస్వామి మరణిస్తే.. ఆ వ్యక్తిపై ఆధారపడిన వితంతు/ విడాకులు పొందిన కుమార్తె ఆ తర్వాత ఫ్యామిలీ పెన్షన్ పొందడానికి అర్హురాలు కాదని తాజాగా రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఎవరైనా ఉద్యోగి/పెన్షనర్ మరణిస్తే..అంతకుముందే వారి జీవిత భాగస్వామి మరణించి/ విడాకులు పొంది ఉన్న సందర్భాల్లో మాత్రమే.. వితంతువు/విడాకులు పొందిన కుమార్తెకు ఫ్యామిలీ పెన్షన్ జారీ చేయాల్సిందిగా 2010లో నాటి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని తెలిపింది. ఈ ఉత్తర్వులను తప్పుగా అన్వయించుకుని ఫ్యామిలీ పెన్షనర్ల మరణానంతరం వారిపై ఆధారపడిన వితంతువు/విడాకులైన కుమార్తెలకు తదుపరిగా ఫ్యామిలీ పెన్షన్లు జారీ చేయరాదని ఆదేశించింది. ఈ మేరకు ఆర్థిక శాఖ అదనపు కార్యదర్శి డి.విజయకుమారి ఇటీవల అకౌంటెంట్ జనరల్ (ఏజీ)తో పాటు ట్రెజరీ విభాగానికి లేఖ రాశారు. -
భర్త చనిపోతే.. బొట్టు, గాజులు తీసేయాలా? శుభకార్యాలకు వెళ్లొద్దా?
భర్త అకాల మరణం చెందితే అది భార్య తప్పా?, అందుకు ఆమె జీవితాంతం శిక్ష అనుభవించాల్సిందేనా? ముమ్మాటికీ కాదు. అయితే విధవత్వం విషయంలో మాత్రం కట్టుబాట్లనేవి మాత్రం కచ్చితంగా ప్రస్తావనకు వస్తాయి. భర్త చనిపోతే.. ఆమె మంగళసూత్రం తొలగించి, గాజులు పగలకొట్టి, నుదిటి మీద తిలకం చెరిపేసి.. అప్పటికే పుట్టెడు బాధలో ఉండే స్త్రీ మూర్తికి మరింత శోకం అందిస్తుంటారు. అయితే ఇకపై అలాంటి ఆచారాలు నిషేధించుకుంది ఇక్కడో పల్లె. మహారాష్ట్ర కోల్హాపూర్ జిల్లా షిరోల్ తాలుకా హెర్వాద్(డ్) అనే గ్రామం.. తాజాగా ఓ తీర్మానం చేసింది. భర్త చనిపోయిన ఆడవాళ్లు.. సంప్రదాయాలను పక్కనపెట్టి నచ్చినట్లుగా, సమాజంలో గౌరవంగా జీవించేందుకు స్వేచ్ఛను ప్రసాదిస్తూ తీర్మానంలో పేర్కొంది. ఈ తీర్మానానికి మే 4వ తేదీన గ్రామ పంచాయితీ సైతం ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. దీంతో పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కరోనా టైంలో.. కరోనా టైంలో ఈ ఊరిలో మరణాలు చాలానే సంభవించాయట. అందులో పాతికేళ్లలోపు యువకులే ఎక్కువగా ఉన్నారట. దీంతో చిన్నవయసులోనే ఎంతో మంది వితంతువులుగా మారిన పరిస్థితి. బంధువుల ఇళ్లలో శుభకార్యాలకు కూడా వెళ్లకుండా.. వాళ్లు ఎదుర్కొంటున్న అవమానాలను చూసి గ్రామస్తులు భరించలేకపోయారు. ‘‘తమ తప్పు లేకున్నా.. పశ్చాత్తాపంతో కుంగిపోయిన బిడ్డలను చూశాం. తమ మధ్యే ఉంటూ వాళ్లు ఎదుర్కొంటున్న పరిస్థితులను చూశాం. అందుకే వాళ్ల జీవితాలను మార్చే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింద’’ని గ్రామ సర్పంచ్ శ్రీగోండ పాటిల్ చెప్తున్నారు. అయితే ఈ ప్రయత్నం అంత సులువుగా కావడానికి అంగన్వాడీ సేవికాస్, ఆశా వర్కర్ల కృషి ఎంతో ఉందని అంటున్నాడాయన. ఈ తీర్మానం విషయంలో మహాత్మా ఫూలే సోషల్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు ప్రమోద్ జింగాడే అందించిన ప్రోత్సాహం మరిచిపోలేమని, ఇది షాహూ మహరాజ్‌కు నివాళి అని అంటున్నారు హెర్వాద్ గ్రామ ప్రజలు. ఇక ఈ నిర్ణయంపై జిల్లా పరిపాలన విభాగం సైతం హర్షం వ్యక్తం చేసింది. మరోవైపు మంత్రి సతేజ్ పాటిల్ స్పందిస్తూ.. శివాజీ పుట్టిన గడ్డ మీద ఆడవాళ్ల గౌరవానికి భంగం కలగకూడదని, ఈ మేరకు.. ఇలాంటి నిర్ణయం తీసుకున్న హెర్వాద్ ప్రజలకు వందనాలు అని, కొందరికి ఇది చెంపపెట్టులాంటి సమాధానమని వ్యాఖ్యానించారు. మరికొన్ని గ్రామాలు కూడా ఇలాంటి బాటలో వెళ్తే.. మంచిదని అభిప్రాయపడ్డారాయన. :::సాక్షి ప్రత్యేకం -
అందగత్తె అని ఏరికోరి కొడుక్కిచ్చి పెళ్లి చేసింది, కానీ..
కోడలిని కూతురిలా స్వీకరించే అత్తలు ఎంతమంది? ఆ సంగతి ఏమోగానీ ఇక్కడో అత్త.. కోడలిని కూతురిగానే భావించింది. కారణం.. కొడుకు తన కళ్ల ముందే కన్నుమూయడం. ఆ విషాదాన్ని దిగమింగుకున్న ఆ అత్త.. కోడలిని కన్నకూతురిలా దగ్గరుండి చదవించింది. అంతేకాదు మరో వ్యక్తిని చూసి పెళ్లి చేసింది కూడా! ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చకు దారితీసింది. రాజస్థాన్ సికార్‌లో కమలా దేవి, దిలావర్ దంపతులు ఉన్నారు. వీళ్లకు శుభమ్ అనే కొడుకు ఉండేవాడు. 2016లో సునీత అనే అమ్మాయితో శుభమ్ వివాహం జరిగింది. సునీతది పేద కుటుంబం. కాకపోతే గుణం-రూపం రెండూ మంచివే. అందుకే పైసా కట్నం తీసుకోకుండా కోడలిగా స్వీకరించింది కమలా దేవి. చూడముచ్చటైన జంట అని ఊరంతా అంటుంటే.. దిష్టి తీసింది ఆ తల్లి. ప్చ్.. దురదృష్టం కొద్దీ ఆరు నెలలకే సునీత భర్త చనిపోయాడు. కొడుకు శుభమ్ బ్రెయిన్ డెడ్‌తో చనిపోయాడు. అయితే చిన్నవయసులో భర్త చనిపోయిన సునీతను దూరం చేసుకునేందుకు ఆ వృద్ధ దంపతుల మనసు అంగీకరించలేదు. నష్టజాతకురాలు అని బంధువులంతా తిట్టిపోస్తుంటే.. కమలాదేవి వాళ్లను వారించింది. కొడుకు చనిపోతే? కోడలి తప్పేంటని సునీతకు మద్దతు నిలిచింది. పైగా పేదింటి బిడ్డ కావడంతో అమ్మగారింటికి పంపకుండా.. తమతోనే ఉంచాలని నిర్ణయించుకుంది. సునీతను మంచిగా చదవించింది. మంచి ఉద్యోగం వైపు ఆమెను ప్రొత్సహించింది. ఎంఏ బీఈడీ చదివిన సునీత.. ఈమధ్యే జూనియర్ లెక్చరర్‌గా ప్రభుత్వ ఉద్యోగం కూడా సంపాదించింది. శనివారం(22, జనవరి 2022) సునీతను ముఖేష్ అనే వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేశారు. సునీత వివాహం చాలా ఘనంగా జరిగింది. ఆ వివాహంలో కాళ్లు కడిగి కన్యాదానం చేసింది కమలాదేవి-దిలావర్ దంపతులే. అంతేకాదు అప్పగింతల సమయంలో వాళ్ల బంధం చూసి.. అత్తమామలు కాదు.. అమ్మానాన్న అనుకున్నారట అంతా. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వివాహ వేడుక ఫొటోలు వైరల్ అవుతున్నాయి. -
పింఛన్.. టెన్షన్!
కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిన చందాన తయారైంది పింఛన్ల పరిస్థితి. బోగస్ పింఛన్లను ఏరివేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం పింఛన్ల కోసం కొత్తగా దరఖాస్తులను ఆహ్వానించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గతంలో ఉన్న పింఛన్లకు రెట్టింపు సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. ఏంచేయాలో తెలియక అధికారులు తలలు పట్టుకుంటూనే దరఖాస్తులను వడపోసే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. కొత్తగా రాబోయే పింఛన్లపై ‘సాక్షి’ దినపత్రిక ఆధ్వర్యంలో బంజారాహిల్స్‌లోని షేక్‌పేట మండల కార్యాలయ ఆవరణలో శనివారం ఏర్పాటు చేసిన చర్చావేదికలో మహిళలు తమ మనోగతాన్ని వెల్లడించారు. బంజారాహిల్స్: వృద్ధాప్య, వితంతు, వికలాంగుల పింఛన్ల కోసం ప్రభుత్వం ఈ నెల 13 నుంచి 20 వరకు దరఖాస్తులను ఆహ్వానించింది. అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవచ్చంటూ ప్రకటించగానే పెద్ద సంఖ్యలో వృద్ధులు, వితంతువులు, వికలాంగులు తరలివచ్చి ధ్రువపత్రాలు జతపరిచి దరఖాస్తులను అందజేశారు. ఊహించినదానికంటే భిన్నంగా దరఖాస్తులు రావడంతో ఇందులో ఎంతమందికి అర్హత కల్పిస్తారనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. వితంతు, వృద్ధాప్య పింఛన్ల కోసం భారీగా దరఖాస్తులు అందినట్లు షేక్‌పేట మండల రెవెన్యూ అధికారులు పేర్కొంటున్నారు. షేక్‌పేట మండల పరిధిలో వృద్ధాప్య పింఛన్ల కోసం 2,614, వితంతు పింఛన్ల కోసం 2,679, వికలాంగుల పింఛన్ల కోసం 1027. మొత్తం కలిపి 6320 దరఖాస్తులు అందాయి. ఇప్పటి వరకు మండల పరిధిలో కేవలం 3,100 మందికి మాత్రమే వృద్ధాప్య, వితంతు, వికలాంగుల పింఛన్లు పంపిణీ చేస్తున్నారు. తాజాగా రెట్టింపు సంఖ్యలో దరఖాస్తులు అందడంతో అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్లు లభిస్తాయా ఇందులో కూడా వడపోత ఉంటుందా అనే విషయంపై ఆందోళన వ్యక్తమవుతోంది. అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్ ఇవ్వాల్సిందేనని దరఖాస్తుదారులు పేర్కొంటున్నారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ పింఛన్ ఇవ్వాలని ఫిలింనగర్ మహాత్మాగాంధీనగర్‌కు చెందిన రమణమ్మ అనే వృద్ధురాలు డిమాండ్ చేసింది. కొత్త పింఛన్ల కోసం ఎప్పటి నుంచో చూస్తున్నామని ఈ సారి తప్పకుండా అర్హత కల్పించాలని బంజారాహిల్స్ రోడ్ నం. 2లోని ఇందిరానగర్ బస్తీకి చెందిన రాములు అనే చిరు వ్యాపారి కోరారు. పింఛన్ల దరఖాస్తులు ఎక్కువగా ఉన్నాయని పాత సంఖ్య తరహాలోనే ఇస్తానంటే చాలా మంది నష్టపోతారని పంజగుట్ట రామకృష్ణానగర్ బస్తీకి చెందిన మొగులయ్య అనే వృద్ధుడు తెలిపారు. దాదాపు చర్చలో పాల్గొన్న వారంతా దరఖాస్తుదారులందరికీ అర్హత కల్పించాలని డిమాండ్ చేశారు. షేక్‌పేట మండల పరిధిలో నిర్దేశించిన లక్ష్యం ప్రకారం పింఛన్లు ఇస్తామని వెల్లడిస్తే మాత్రం చాలా మంది నష్టపోవాల్సి వస్తుందని జూబ్లీహిల్స్ డివిజన్ పరిధిలోని నందగిరిహిల్స్, గురుబ్రహ్మనగర్‌కు చెందిన నారాయణ అన్నారు. వృద్ధులను కనికరించాలి ఈ సారి పింఛన్ పెరగడంతో చాలా మంది ఆశలు పెట్టుకున్నారు. అర్హత ఉన్న అందరికీ పింఛన్లు ఇవ్వాలి. వృద్ధులను కనికరించాలి. కొంత మందికే ఇస్తామంటే కుదరదు. - మొగులమ్మ వస్తాయనే ఆశిస్తున్నాం ఈసారి ప్రతి ఒక్కరికీ పింఛన్లలో మేలు చేకూరుతుందని భావిస్తున్నాం. పింఛన్ లబ్ధిదారుల ఎంపికలో ఈ సారి అక్రమాలు, అవినీతి చోటు చేసుకునే అవకాశాలు లేవని విన్నాం. పకడ్బందీగా దరఖాస్తుల విచారణ కూడా చేపడుతుండటంతో అర్హత ఉన్నవారందరూ లబ్ధిపొందుతారని అనుకుంటున్నాం. - గంగారపు లక్ష్మి -
ముగిసిన వృద్ధులు, వితంతువుల దీక్షలు
పింఛన్ రూ.వెయ్యికి పెంచాలని స్థానిక అంబేద్కర్ చౌక్ వద్ద వృద్ధులు, వితంతువులు చేపట్టిన దీక్షలు మంగళవారం ముగిసాయి. రిలే దీక్షలు మంగళవారం నాటికి వంద రోజులు పూర్తయ్యాయి. ముగింపు సందర్భంగా పట్టణంలోని ప్రధాన రహదారి మీదుగా సబ్‌కలెక్టర్ కార్యాలయం వరకు వృద్ధులు, వితంతువులు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యుడు రేగుంట కేశవరావు మాదిగ మాట్లాడుతూ వృద్ధులు, వితంతువుల పింఛన్ రూ.వెయ్యికి పెంచాలని డిమాండ్ చేశారు. ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో వంద రోజులు రిలే దీక్షలు నిర్వహించినా ప్రభుత్వం స్పందించకపోవడం శోచనీయమని అన్నారు. ఇతర రాష్ట్రాల్లో వృద్ధులకు చెల్లిస్తున్నట్లుగానే ఇక్కడా పింఛన్ పెంచాలని, లేనిపక్షంలో వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. ఎంపీలు, ఎమ్మెల్యేల వేతనాల పెంపుపై ఉన్న శ్రద్ధ వృద్ధులు, వితంతువుల పింఛన్‌పై లేదని విమర్శించారు. అనంతరం తహశీల్దార్ సురేశ్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు ఇప్ప దాసు, నాగరాజు, సాగర్, రాజేశ్వర్, వృద్ధుల సంఘం అధ్యక్షురాలు సోమ గుండమ్మ, వితంతువుల సంఘం అధ్యక్షురాలు రాపర్తి ప్రేమల, వృద్ధులు, వితంతువులు పాల్గొన్నారు. కాగా, వృద్ధులు, వితంతువుల ఆందోళనకు సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బద్రి సత్యనారాయణ, జేఏసీ కన్వీనర్ గంధం శ్రీనివాస్, బీజేపీ జిల్లా కార్యదర్శి చెర్ల మురళి మద్దతు తెలిపారు.