‘పెన్నిధి’ అన్నారు..ఉన్నది ఊడ్చారు
కొంకుదురు (బిక్కవోలు) : పింఛన్ల మొత్తాన్ని పెంచుతామన్న టీడీపీ అధికారంలోకి వచ్చినప్పుడు.. వృద్ధులు, వికలాంగులు, వితంతువుల్లో కొత్త ఆశలు చిగురించాయి. తమ బతుకుబండి కష్టాల గతుకుల నుంచి బయటపడి, సాఫీగా సాగుతుందన్న భరోసా కలిగింది. ఇంతలోనే వారిలో కొందరు హతాశులు కాక తప్పలేదు. వారి పరిస్థితి పరమాన్నం దక్కుతుందని నోరూరుతుండగా.. నోటి దగ్గరి గంజి కుండనే గుంజుకుపోయినట్టయింది. తనిఖీ పేరుతో తమను పింఛన్లకు అనర్హులను చేయడంతో ఆ నిస్సహాయులు నిర్ఘాంతపోతున్నారు. జిల్లావ్యాప్తంగా అలాంటి వారెందరో. బిక్కవోలు మండలం కొంకుదురులో పింఛన్లు రద్దయిన వారి గోడు ఆ వేదననే ప్రతిధ్వనిస్తోంది.
మండలంలో మొత్తం 501 పింఛన్లు రద్దు చేస్తే.. వాటిలో 113 కొంకుదురువే. తామంతా సర్కారీ సాయానికి నూరుశాతం అర్హులమే అయినా నిర్దాక్షిణ్యంగా పింఛన్ రద్దు చేశారని వారు వాపోతున్నారు. ఇందుకు అధికార పార్టీకి చెందిన వారే కారణమని ఆక్రోశిస్తున్నారు. గ్రామంలోని శెట్టిబలిజ పేటకు చెందిన కట్టా వెంకటరమణ తనకు ఓ కాలు అవిటిదని, 74 శాతం వైకల్యం ఉన్నట్టు సదరమ్ సర్టిఫికెట్ ఉన్నా.. ఇప్పుడు తనిఖీల్లో అనర్హుడనని పింఛన్ రద్దు చేశారని గొల్లుమన్నాడు. కొవ్వూరి సూర్యకాంతం అనే వితంతువు తన భర్త మరణ ధృవీకరణ పత్రాన్ని సమర్పించినా.. ‘నువ్వు వితంతువు కాదు’ అని పింఛన్ రద్దు చేశారని వాపోయింది.
రోగిష్టి వాడైన తన కొడుకు ఎన్నికల్లో వైఎస్సార్ సీపీలో తిరిగినందుకు తన పింఛన్ రద్దు చేయాలని టీడీపీకి చెందిన ఒక నాయకుడు బహిరంగంగా అన్నాడని ఆరోపించింది. నేకూరి సత్యవతి అనే యువతికి రెండు కాళ్లూ చచ్చుబడ్డాయి. ఆమెకు 81 శాతం వైకల్యం ఉన్నట్టు సదరమ్ శిబిరంలో ధృవీకరించారు. అయినా సత్యవతికి వైకల్యం లేదని పింఛన్ రద్దు చేశారు. నా అన్నవారు లేని కుక్కల ముత్యాలమ్మ అనే వృద్ధురాలికి వచ్చే పింఛన్, బంధువుల సాయమే జీవనాధారం. ఆమె ఇంట్లో ఇద్దరు పింఛన్‌దారులున్నారన్న సాకుతో పింఛన్ రద్దు చేశారు. ఇలా గ్రామంలో పింఛన్లు రద్దయిన తామంతా ఇంచుమించు అర్హులేనని బాధితులు అంటున్నారు. దీనిపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడానికి సిద్ధమవుతున్నారు.
వైకల్యమున్నా పింఛన్ రద్దు
నాకు ఒక కాలు పూర్తిగా పని చెయ్యదు. కష్టపడి ఏ పనీ చేయలేను. చిన్న కొట్టు పెట్టుకొని బతుకుతున్నాను. అటువంటిది నా పెన్షనే తీసివేశారు.
- కట్టా వెంకటరమణ
వితంతువును కాదట..
నా భర్త చనిపోయారు. నా కొడుకు ఆరోగ్యం బాగోదు. నా భర్త మరణ ధృవీకరణ పత్రాన్ని సమర్పించినా.. నేను వితంతువును కాదని పింఛన్ రద్దు చేశారు.
- కొవ్వూరి సూర్యకాంతం
డబుల్ సాకుతో ఏకాకికి ఎసరు
నా వయస్సు 70 సంవత్సరాలు. నా అన్నవారెవరూ లేని ఒంటరి దాన్ని. నాకు ఇల్లు తప్ప ఏ ఆస్తీ లేదు. డబుల్ పెన్షన్ ఉందన్న కారణంతో నా పెన్షన్ రద్దు చేశారు.
- కుక్కల ముత్యాలమ్మ