పింఛను పెరుగుతుందనే ఆశతో
ఏలూరు (వన్‌టౌన్) : వైకల్య ధ్రువీకరణ కోసం జిల్లాలోని ఏలూరు, భీమవరం, తణుకు ప్రభుత్వ ఆస్పత్రుల ఆవరణలో గురువారం నిర్వహించిన సదరం శిబిరాలు వికలాంగులు పోటెత్తారు. గతంలో ఈ శిబిరాలకు 100 నుంచి 150 మంది వచ్చేవారు. అయితే ప్రస్తుత టీడీపీ సర్కారు వికలాంగులకు పింఛను రూ.1500కు పెంచుతామని ప్రకటించిన నేపథ్యంలో ఈ శిబిరాలకు కుటుంబ సభ్యులతో కలిసి వేలాదిగా హాజరయ్యారు. అంతేకాకుండా శిబిరాల నిర్వహణలో, ధ్రువీకరణ పత్రాల జారీలో తీవ్ర జాప్యం కూడా రద్దీకి కారణంగా చెబుతున్నారు. ఇటీవల పింఛన్ల సర్వేలో అనర్హత వేటు పడిన కొందరు ధ్రువీకరణ పత్రాల కోసం శిబిరాలకు తరలివచ్చారు. ఇదిలా ఉండగా, శిబిరాలకు వచ్చిన వికలాంగులను నియంత్రించడం నిర్వాహకులకు కష్టసాధ్యమైంది. ఆయా ఆస్పత్రుల్లో సాధారణ ఓపీ సేవలకు కొంత ఆటంకం ఏర్పడింది. రోగులు నానాయాతన పడ్డారు.
నేడు, రేపు మళ్లీ పరీక్షలు
భీమవరం అర్బన్ : స్థానిక ప్రభుత్వాసుపత్రి ఆవరణలోని గురువారం నిర్వహించిన సదరం శిబిరానికి సుమారు 500కు పైగా వికలాంగులు పరీక్షలు నిమిత్తం వచ్చారు. దీంతో అక్కడ స్వల్పంగా తోపులాట చోటు చేసుకుంది. సరైన క్యూ విధానం లేకపోవడం, సౌకర్యాలు ఏర్పాటు చేయకపోవడంతో వికలాంగులు అవస్థలు పడ్డారు. 2010 సంవత్సరానికి సంబంధించిన వికలాంగ ధృవీకరణపత్రాలు జారీలో జాప్యం వల్లే రద్దీకి కారణమని అధికారులు చెబుతున్నారు. వీరు కూడా గురువారం శిబిరానికి హాజరయ్యారని అంటున్నారు. శిబిరంలో కొంతమందినే పరీక్ష చేసి మిగిలిన వారికిసీరియల్ నంబర్లు ఇచ్చి పంపించివేశారు. వీరిని శుక్రవారం, సోమవారం నిర్వహించే క్యాంపులో నిర్దారణ పరీక్షలు చేస్తామని వారికి తెలిపారు.
274 మందికి వైకల్య పరీక్షలు
తణుకు అర్బన్ : తణుకులో ప్రతి వారం సదరం శిబిరం నిర్వహస్తున్నా గురువారం ఒక్కసారిగా వెయ్యి మంది వికలాంగులు రావడంతో వారికి సౌకర్యాలు ఏర్పాటు చేయడంలో నిర్వాహకులు అవస్థలు పడ్డారు. వికలాంగులు భారీగా క్యూలో నిలబడ్డారు. ఊహించని విధంగా వచ్చిన సిబ్బందిని చూసి డీఆర్‌డీఏ సిబ్బంది ఉదయం 11 గంటల ప్రాంతంలో ఆస్పత్రి ఆవరణలో టెంట్లు వేయించారు. అప్పటివరకు వికలాంగులు, వారి బంధువులు ఎండలోనే నిరీక్షించాల్సి వచ్చింది. కాగా, శిబిరానికి వచ్చిన 1000 మందిలో 274 మంది వికలాంగులకు వికలాంగత్వ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఇందులో ఆర్థోపెడిక్ 131, కంటికి సంబంధించి 77, చెవిటి, మూగ వికలాంగులు 66 మందికి పరీక్షలు చేశారు. మిగిలినవారికి ఆసుపత్రి ఆవరణలో శుక్ర, శనివారాలు కూడా శిబిరం నిర్వహిస్తామని సదరం ఏపీఎం బాలకోటయ్య చెప్పారు. ఇందుకోసం మిగిలిపోయిన వికలాంగులు ఎవరు ఏరోజు రావాలో తేదీ ప్రకారం కూపన్లు అందచేశామని పేర్కొన్నారు.