భీమవరం.. రెవె’న్యూ డివిజన్’
భీమవరం.. రెవె’న్యూ డివిజన్’
Published Sat, Dec 24 2016 10:07 PM | Last Updated on Mon, Sep 4 2017 11:31 PM
నెరవేరనున్న భీమపురి వాసుల డిమాండ్
భీమవరం, ఉండి నియోజకవర్గాలతోపాటు గణపవరం, నిడమర్రు మండలాల్ని కలిపే అవకాశం
తుది ప్రకటనే తరువాయి
సాక్షి ప్రతిని«ధి, ఏలూరు :
జిల్లాకు ఆర్థిక రాజధానిగా.. డెల్టా ప్రాంతానికి ముఖ్య కూడలిగా ఉన్న భీమవరం పట్టణం కేంద్రంగా కొత్త రెవెన్యూ డివిజన్ ఏర్పాటు కానుంది. ఇందుకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ప్రస్తుతం జిల్లాలో ఏలూరు, నరసాపురం, కొవ్వూరు, జంగారెడ్డిగూడెం, కుక్కునూరు రెవెన్యూ డివిజన్లు ఉండగా, వాటిని పునర్వవస్థీకరిస్తూ భీమవరం కేంద్రంగా 6వ రెవెన్యూ డివిజన్ ఏర్పాటు కానుంది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలకు రెండు రోజులపాటు విజయవాడలో జరిగిన జిల్లా కలెక్టర్ల సమావేశంలో ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇందుకు సంబంధించిన తుది ప్రకటన త్వరలోనే వెలువడనుంది. కొత్తగా ఏర్పాటయ్యే భీమవరం డివిజన్ స్వరూపం ఎలా ఉంటుందనే విషయం అధికారికంగా స్పష్టం కాలేదు. అయితే, భీమవరం, వీరవాసరం మండలాలతోపాటు ఉండి నియోజకవర్గ పరిధిలోని కాళ్ల, ఆకివీడు, ఉండి, పాలకోడేరు మండలాలు కచ్చితంగా ఉంటాయని, వీటితోపాటు ఏలూరు డివిజన్ పరిధిలో ఉన్న గణపవరం, నిడమర్రు మండలాలను కలిపి 8 మండలాలతో కొత్త డివిజన్ ఏర్పాటు కాబోతోందని రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి. జనాభా ఆధారంగా జిల్లాలోని రెవెన్యూ డివిజన్ల సంఖ్యను ఆరుకు పెంచేందుకు ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. సగటున 7.50 లక్షల జనాభా ఉండేలా రెవెన్యూ డివిజన్లను పునర్విభజన చేస్తారని సమాచారం. ప్రస్తుత నరసాపురం రెవెన్యూ డివిజన్ జిల్లాలోనే అతి పెద్దది కావడం, ఉండి నియోజకవర్గ ప్రజలు తమ పనుల కోసం నరసాపురం వరకూ వెళ్లడం కష్టంగా మారింది. ఈ నేపథ్యంలో నడిబొడ్డున ఉన్న భీమవరాన్ని రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేయనున్నారు.
ఇలా పెరుగుతూ వచ్చాయి
మన జిల్లా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో భాగంగా ఉన్నప్పుడు ఏలూరు, జంగారెడ్డిగూడెం, నరసాపురం, కొవ్వూరు రెవెన్యూ డివిజన్లు మాత్రమే ఉండేవి. రాష్ట్రం విడిపోయిన తరువాత విలీన మండలాలైన కుక్కునూరు, వేలేరుపాడులను కలిపి ప్రత్యేక రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేసి అక్కడ సబ్ కలెక్టర్‌ను నియమించారు. దీంతో 5 డివిజన్ల సంఖ్య ఐదుకు పెరిగింది. భీమవరం డివిజన్ ఏర్పాటుతో జిల్లాలోని రెవెన్యూ డివిజన్లు ఆరుకు పెరగనున్నాయి.
పోలీస్ విభాగం నరసాపురం డివిజన్‌లోనే..
జిల్లాలోని పోలీస్ సబ్ డివిజన్లు మాత్రం వేర్వేరుగానే ఉండనున్నాయి. తాజాగా పోలవరం పోలీస్ సబ్ డివిజన్ ఏర్పాటుకు అనుమతి రావడంతో జిల్లాలో ఐదు సబ్ డివిజన్స్ మాత్రమే ఉంటాయి. కొత్తగా ఏర్పడే భీమవరం రెవెన్యూ డివిజన్ నరసాపురం పోలీస్ సబ్ డివిజన్ పరిధిలోనే ఉంటుంది. రెవెన్యూ డివిజన్ల ఆధారంగా పోలీస్ వ్యవస్థను కూడా మార్చాలన్న ప్రతిపాదనలు ఇప్పటివరకూ కార్యరూపం దాల్చకపోవడంతో ఈ పరిస్థితి నెలకొంది.
Advertisement