ఉద్యోగ భద్రత కల్పించండి
భీమవరం క్రైం : ఎనిమిదేళ్లుగా పనిచేస్తున్న తమను తొలగించాలనుకోవడం దారుణమని, తమకు ఉద్యోగ భద్రతకల్పించేలా చూడాలని జిల్లాలోని ఆయుష్ ఉద్యోగులు ఏలూరు ఎంపీ మాగంటి బాబును శనివారం కలిసి వినతిపత్రం సమర్పించారు. జాతీయ గ్రామీణ ఆరోగ్య పథకం ప్రారంభించిన నాటి నుంచి గ్రామాల్లో ఆయుర్వేద, హోమియో, యునాని, నేచురోపతి వంటి వైద్య సేవలను అందిస్తూ వస్తున్నామన్నారు. తమకు జీతాలు చెల్లించడం ఆలస్యమవుతున్నా కష్టపడి పనిచేస్తున్నామని వారు ఎంపీకి వివరించారు. అధికారులు తీసుకుంటున్న ఈ నిర్ణయం వల్ల జిల్లాలో 81 మంది ఉద్యోగులు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడిందని వెల్లడించారు. దీనిపై స్పందించిన మాగంటి బాబు ఆయుష్ కమిషనర్‌తో ఫోన్‌లో మాట్లాడారు. ఆయుష్‌ను బలోపేతం చేయాలని, డాక్టర్లను నియమించి కార్యకలాపాలను విస్తరించేలా చూడాలని కమిషనర్‌ను ఎంపీ కోరారు. ఎంపీని కలిసిన వారిలో ఉద్యోగులు బి.రమేష్‌వర్మ, ఎన్.ఆంజనేయులు, వి.హైమావతి, చంద్రశేఖర్, సత్యనారాయణ తదితరులున్నారు.