ayush employees
-
ఆయుష్ కాంపౌండర్ ఆత్మహత్యాయత్నం
తిరుపతి (అలిపిరి) : 16 నెలల వేతనం చెల్లించకపోగా ఉద్యోగం నుంచి తొలగించడంతో మనస్తాపం చెందిన ఆయుష్ విభాగం కాంపౌండర్ గౌతమి(29) సోమవారం ఆత్మహత్యకు యత్నించింది. బాధితురాలి భర్త బ్రహ్మానందం కథనం మేరకు.. పాలసముంద్రం మండలంలోని ఆయుష్ డిస్పెన్సరీ కాంపౌండర్‌గా గౌతమి కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తోంది. ఆమె భర్తతోపాటు కార్వేటినగరంలో కాపురం ఉంటున్నారు. 16 నెలలుగా వేతనం ఇవ్వకపోయినా ఎప్పుడో ఒకసారి ఇస్తారులే అని పనిచేస్తోంది. వారం క్రితం డిస్పెన్సరీ వైద్యులు బదిలీపై వెళ్లడంతో రోగులు రావడం లేదని పేర్కొంటూ ఆయుష్ విభాగం ఉన్నతాధికారులు సిబ్బందిని తొలగించారు. దీంతో గౌతమి మానసికంగా కుంగిపోయింది. సోమవారం పురుగుల మందు తాగింది. ఆమెను కుటుంబ సభ్యులు వెంటనే తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఉద్యోగం నుంచి తొలగించడంతోనే.. జిల్లాలో ఆయుష్ విభాగంలో 47 మంది ఉద్యోగులను తొలగించారు. వారు వారం క్రితం అమరావతిలో ధర్నా చేశారు. ప్రభుత్వం స్పందించలేదు. ఈ క్రమంలో మానసికి ఒత్తిడికి లోనైన ఐదుగురు ఉద్యోగులు ఆత్మహత్యకు యత్నించినట్లు సమాచారం. మాకు న్యాయం చేయండి రాష్ట్ర వ్యాప్తంగా 850 మంది ఆయుష్ ఉద్యోగులను తొలగించారు. జిల్లాలో 47 మంది ఉన్నారు. 16 నెలలగా వేతనం ఇవ్వలేదు. నేను ఆత్మహత్య చేసుకుంటే కనీసం మిగతా వారికైనా న్యాయం జరుగుతుందని భావించా. ప్రభుత్వం ఆయుష్ ఉద్యోగులకు న్యాయం చేయాలి. – గౌతమి, బాధితురాలు, పాలసముంద్రం మండలం -
మమ్మల్ని ఆదుకో అన్నా..!
రాష్ట్రంలో ఉన్న ఆయుష్ కేంద్రాల్లో సిబ్బందిని ఆదుకో అన్నా అంటూ ఆయుష్ ఎన్ఆర్హెచ్ఎం పారామెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డికి విజ్ఞప్తి చేశారు. ప్రజా సంకల్పయాత్రలో భాగంగా శనివారం వారు జననేతను కలుసుకుని సమస్యలు ఏకరువు పెట్టారు. ఈ పథకం కింద రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్‌కు 587 ఆయుష్ డిస్పెన్సరీలను కేటాయించగా వీటిలో కేవలం 136 డిస్పెన్సరీల్లో మాత్రమే వైద్యాధికారులు ఉన్నారన్నారు. మిగిలిన 451 డిస్పెన్సరీల్లో ఆరేళ్లుగా పోస్టులను భర్తీ చేయలేదన్నారు. ఖాళీగా ఉన్న ఆయుష్ మెడికల్ ఆఫీసర్, పారా మెడికల్ సిబ్బంది భర్తీ కోసం 2014, 2016 సంవత్సరాల్లో ఆయుష్ కమిషనర్ వైద్య ఆరోగ్యశాఖకు లేఖ రాసినా భర్తీ కాలేదన్నారు. దీంతో అక్కడ పని చేస్తున్న సిబ్బందికి 2016 ఏప్రిల్ నుంచి జీతాలు, కాంట్రాక్టు రెన్యువల్స్ ఇవ్వడం లేదన్నారు. దీనివల్ల కుటుంబ పోషణ కష్టంగా మారడంతో పాటు ఉద్యోగ భద్రత లేక మానసిక ఆందోళనకు గురౌతున్నామన్నారు. ఈ విధంగా నలుగురు సిబ్బంది మరణించారని వాపోయారు. ఈ సమస్యపై ముఖ్యమంత్రి చంద్రబాబు అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి 2012లో లేఖ కూడా రాశారని, తీరా ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబు తమ సమస్యలు పట్టించుకోకపోవడం దురదృష్టకరమన్నారు. తక్షణమే మా సమస్యపై స్పందించి రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 451 ఆయుష్ డిస్పెన్సరీల్లో ఆయుష్ వైద్యులను నియమించడంతో పాటు తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని, తమకు జీతాలు చెల్లించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని ఆయుష్ ఎన్ఆర్హెచ్ఎం పారామెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు జె.లక్ష్మీనారాయణ, నాయకులు యూవీకే శాస్త్రి, పడాల పద్మావతి, వట్టికుళ్ల నాగమణి, పి.లలిత, మోహన్‌రాయ్ తదితరులు కోరారు. -
తక్షణమే వారి వేతనాలు చెల్లించండి: హైకోర్టు
సాక్షి, అమరావతి: ఆయుష్ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగుల వేతన బకాయిలను తక్షణమే చెల్లించాలని ఉమ్మడి హైకోర్టు ఆదేశించింది. ఆయుష్ శాఖలో పనిచేస్తున్న సుమారు వెయ్యి మంది ఉద్యోగులను తొలగించడమే కాకుండా వారికి ఇవ్వాల్సిన 17 నెలల వేతనాలు ప్రభుత్వం చెల్లించలేదు. దీంతో ఆయుష్ ఉద్యోగులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యాన్ని పరిశీలించిన ఉమ్మడి హైకోర్టు ధర్మాసనం తక్షణమే వారికి వేతనాలు చెల్లించి, వారిని తిరిగి ఉద్యోగంలోకి తీసుకోవాలని సర్కారును ఆదేశించింది. డాక్టర్లను నియమించని కారణంగా కాంపౌండర్లను, ఆర్డర్లీ నర్సింగ్ సిబ్బందిని ఎలా తొలగిస్తారని సర్కారు మొట్టిక్కాయలు వేసింది. కోర్టు తీర్పు అనంతరం ఆయుష్ శాఖ ఉద్యోగులు హనుమంతరెడ్డి, సురేష్‌గుప్తా, లక్ష్మినారాయణ, రాధకుమారి తదితరులు ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఆయుష్ ఉద్యోగులకు వేతన బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. -
ఆయుష్ ఉద్యోగులకు బదిలీల కౌన్సెలింగ్
అనంతపురం మెడికల్ : ఆయుష్ శాఖలో పని చేస్తున్న ఉద్యోగులకు ఆదివారం సాయంత్రం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో బదిలీల కౌన్సెలింగ్ నిర్వహించారు. జేసీ–2 ఖాజామొహిద్దీన్ పర్యవేక్షణలో ఆయుష్ రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ (ఆర్డీడీ) వెంకట్రామ్ నాయక్, డీఎంహెచ్ఓ డాక్టర్ వెంకటరమణ, నేషనల్ హెల్త్ మిషన్ డీపీఎం డాక్టర్ అనిల్‌కుమార్, డీఐఓ డాక్టర్ పురుషోత్తం సమక్షంలో బదిలీల ప్రక్రియ చేపట్టారు. ఆయుర్వేద, హోమియో, యునానీ ఆస్పత్రుల్లో పని చేస్తున్న 24 మంది కాంపౌండర్లు, 17 మంది క్లాస్–4 ఉద్యోగులకు బదిలీ చేశారు. ఎన్జీఓ సంఘం లేఖలతో వచ్చిన ఇద్దరు ఉద్యోగులకు యథాస్థానాల్లో ఉంచారు. కార్యక్రమంలో ఆయుష్ వైద్యులు డాక్టర్ తిరుపతినాయుడు, డాక్టర్ నాగేశ్వరరావు పాల్గొన్నారు. -
తీరిన ‘ఆయుష్షు’!
– వైద్యాధికారి లేని చోట ఉద్యోగుల తొలగింపు – ఏడాదిగా జీతాలూ చెల్లించని వైనం – మూసివేత దిశగా 30 డిస్పెన్సరీలు – ఆందోళనలో ఆయుష్ ఉద్యోగులు అనంతపురం మెడికల్ : బాబొస్తే జాబొస్తుందనుకుంటే ఉన్న ఉద్యోగాలూ ఊడాయి. ఏడాది పాటు జీతాలు లేకున్నా ఏదో ఒక రోజు వస్తాయనుకున్న వారి ఆశలపై ప్రభుత్వం నీళ్లు చల్లుతూ ఏకంగా ఉద్యోగాల నుంచే తొలగించేశారు. ఆ నెపాన్ని తెలివిగా కేంద్రంపై నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ప్రకృతి వైద్యంపై ప్రజల్లో ఆసక్తి పెరుగుతున్న నేపథ్యంలో ‘ఆయుష్’ను బలోపేతం చేయాల్సింది పోయి విధుల నుంచే తొలగిస్తూ నిర్ణయం తీసుకోవడంతో పలు కుటుంబాలు రోడ్డున పడ్డాయి. వివరాల్లోకెళ్లితే.. జిల్లాలో జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ (ఎన్ఆర్హెచ్ఎం) కింద 46 డిస్పెన్సరీలు ఉన్నాయి. ఇందులో అమడగూరు, అగళి, ఎర్రగుంట్ల ఆయుర్వేద డిస్పెన్సరీలు మూతపడ్డాయి. మిగిలిన వైద్యశాలల్లో 22 ఆయుర్వేద, 13 హోమియో, 6 యునానీ, రెండు న్యాచురోపతి డిస్పెన్సరీలు ఉన్నాయి. ఆయుష్ వైద్యశాలల్లో మెడికల్ ఆఫీసర్, కాంపౌండర్, స్వీపర్ కం నర్స్ (ఎస్ఎన్ఓ) పోస్టులు ఉంటాయి. ప్రస్తుతం 82 మంది కాంట్రాక్ట్ పద్ధతిలో పని చేస్తున్నారు. ఏటా వీరికి రెన్యూవల్ చేయాల్సి ఉంటుంది. ఈ ఏడాది మార్చినాటికి గడువు పూర్తికాగా ఒక్కరికీ రెన్యూవల్ చేయలేదు. వైద్యులు లేని చోట ఉద్యోగుల తొలగింపు తాజాగా ఆయుష్ ఉద్యోగులు అవసరం లేదని, వారిని ఇంటికి పంపేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ క్రమంలో వైద్యుల్లేని చోట మిగిలిన సిబ్బందిని తొలగించనున్నారు. జిల్లాలోని 22 ఆయుర్వేద డిస్పెన్సరీలకు సంబంధించి ప్రస్తుతం ఆరుగురు వైద్యులు, 17 మంది కాంపౌండర్లు, 17 మంది ఎస్ఎన్ఓలు పని చేస్తున్నారు. బుక్కపట్నం, చెన్నేకొత్తపల్లి, కిష్టిపాడు, పెద్దకౌకుంట్ల, రాప్తాడు, తిమ్మంపల్లిలో మెడికల్ ఆఫీసర్లు ఉన్నారు. అగళి, బొమ్మనహాళ్, చుక్కలూరు, కళ్యాణదుర్గం, కొర్రపాడు, ఎన్ఎస్ గేట్, నల్లచెరువు, పెద్దవడుగూరు, పేరూరు, పుట్టపర్తి, రామగిరి, రొద్దం, శెట్టూరు, తాడిమర్రి, యల్లనూరు, యర్రగుంట డిస్పెన్సరీల్లో డాక్టర్లు లేరు. జిల్లావ్యాప్తంగా 13 హోమియో డిస్పెన్సరీలుండగా బేవనహళ్లి, బుక్కరాయసముద్రం, కొనకొండ్ల, కుందుర్పిలో వైద్యులుండగా 9 డిస్పెన్సరీల్లో కాంపౌండర్లు, 13 ఆస్పత్రుల్లో ఎస్ఎన్ఓలున్నారు. అమడగూరు, ఆత్మకూరు, ఎద్దులపల్లి, కదిరి, కణేకల్లు, ఎన్పీ కుంట, పట్నం, పెనుకొండ, కొత్తచెరువులో డాక్టర్లు లేరు. ఇక నేచురోపతి డిస్పెన్సరీలకు సంబంధించి కూడేరు కేంద్రంలో డాక్టర్ ఉన్నా ఏనాడూ విధులకు హాజరైంది లేదు. చౌళూరులో వైద్యుడు లేరు. ఈ రెండు ఆస్పత్రులకు గాను ఒక కాంపౌండర్, ఇద్దరు ఎస్ఎన్ఓలు పని చేస్తున్నారు. యునానీకి సంబంధించి గార్లదిన్నె, కె.బసనహళ్లి, పరిగిలో డాక్టర్లు ఉన్నారు. బ్రహ్మసముద్రం, కేఎన్ పల్లి, వజ్రకరూరులు వైద్యుల్లేరు. ఆయా డిస్పెన్సరీల్లో నలుగురు కాంపౌండర్లు, ఐదుగురు ఎస్ఎన్ఓలు ఉన్నారు. ప్రభుత్వ నిర్ణయం మేరకు వైద్యులు ఉన్న చోట మాత్రమే ఉద్యోగులను కొనసాగించనున్నారు. బకాయి జీతాలు చెల్లించలేం! గతేడాది నుంచి ఉద్యోగులకు జీతాలు రావాల్సి ఉంది. తాజా ఉత్తర్వుల నేపథ్యంలో జీతాలు కూడా రాని పరిస్థితి తలెత్తింది. ఆయుష్ కమిషనర్ రేవతి గత నెల 20వ తేదీన రీజనల్ డిప్యూటీ డైరెక్టర్లకు జారీ చేసిన ఉత్తర్వులు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. 2016–17 సంవత్సరానికి సంబంధించి ఉద్యోగుల జీతాల బడ్జెట్‌తో పాటు 2017–18 సంవత్సరానికి సైతం జీతాలు ఇవ్వలేమని అందులో పేర్కొన్నారు. మెడికల్ ఆఫీసర్ లేని చోట విధులు నిర్వర్తిస్తున్న పారామెడికల్ సిబ్బంది జీతాలను విడుదల చేయలేమని ఢిల్లీలో జరిగిన సమావేశంలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, ఈ మేరకే ఉత్తర్వులు జారీ చేస్తున్నట్లు పేర్కొనడం విశేషం. ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయంతో జిల్లావ్యాప్తంగా 30 డిస్పెన్సరీలు మూతపడే సూచనలు కన్పిస్తున్నాయి. -
ఉద్యోగ భద్రత కల్పించండి
భీమవరం క్రైం : ఎనిమిదేళ్లుగా పనిచేస్తున్న తమను తొలగించాలనుకోవడం దారుణమని, తమకు ఉద్యోగ భద్రతకల్పించేలా చూడాలని జిల్లాలోని ఆయుష్ ఉద్యోగులు ఏలూరు ఎంపీ మాగంటి బాబును శనివారం కలిసి వినతిపత్రం సమర్పించారు. జాతీయ గ్రామీణ ఆరోగ్య పథకం ప్రారంభించిన నాటి నుంచి గ్రామాల్లో ఆయుర్వేద, హోమియో, యునాని, నేచురోపతి వంటి వైద్య సేవలను అందిస్తూ వస్తున్నామన్నారు. తమకు జీతాలు చెల్లించడం ఆలస్యమవుతున్నా కష్టపడి పనిచేస్తున్నామని వారు ఎంపీకి వివరించారు. అధికారులు తీసుకుంటున్న ఈ నిర్ణయం వల్ల జిల్లాలో 81 మంది ఉద్యోగులు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడిందని వెల్లడించారు. దీనిపై స్పందించిన మాగంటి బాబు ఆయుష్ కమిషనర్‌తో ఫోన్లో మాట్లాడారు. ఆయుష్‌ను బలోపేతం చేయాలని, డాక్టర్లను నియమించి కార్యకలాపాలను విస్తరించేలా చూడాలని కమిషనర్‌ను ఎంపీ కోరారు. ఎంపీని కలిసిన వారిలో ఉద్యోగులు బి.రమేష్‌వర్మ, ఎన్.ఆంజనేయులు, వి.హైమావతి, చంద్రశేఖర్, సత్యనారాయణ తదితరులున్నారు.