రుయాలో చికిత్స పొందుతున్న గౌతమి
తిరుపతి (అలిపిరి) : 16 నెలల వేతనం చెల్లించకపోగా ఉద్యోగం నుంచి తొలగించడంతో మనస్తాపం చెందిన ఆయుష్ విభాగం కాంపౌండర్ గౌతమి(29) సోమవారం ఆత్మహత్యకు యత్నించింది. బాధితురాలి భర్త బ్రహ్మానందం కథనం మేరకు.. పాలసముంద్రం మండలంలోని ఆయుష్ డిస్పెన్సరీ కాంపౌండర్‌గా గౌతమి కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తోంది. ఆమె భర్తతోపాటు కార్వేటినగరంలో కాపురం ఉంటున్నారు. 16 నెలలుగా వేతనం ఇవ్వకపోయినా ఎప్పుడో ఒకసారి ఇస్తారులే అని పనిచేస్తోంది. వారం క్రితం డిస్పెన్సరీ వైద్యులు బదిలీపై వెళ్లడంతో రోగులు రావడం లేదని పేర్కొంటూ ఆయుష్ విభాగం ఉన్నతాధికారులు సిబ్బందిని తొలగించారు. దీంతో గౌతమి మానసికంగా కుంగిపోయింది. సోమవారం పురుగుల మందు తాగింది. ఆమెను కుటుంబ సభ్యులు వెంటనే తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.
ఉద్యోగం నుంచి తొలగించడంతోనే..
జిల్లాలో ఆయుష్ విభాగంలో 47 మంది ఉద్యోగులను తొలగించారు. వారు వారం క్రితం అమరావతిలో ధర్నా చేశారు. ప్రభుత్వం స్పందించలేదు. ఈ క్రమంలో మానసికి ఒత్తిడికి లోనైన ఐదుగురు ఉద్యోగులు ఆత్మహత్యకు యత్నించినట్లు సమాచారం.
మాకు న్యాయం చేయండి
రాష్ట్ర వ్యాప్తంగా 850 మంది ఆయుష్ ఉద్యోగులను తొలగించారు. జిల్లాలో 47 మంది ఉన్నారు. 16 నెలలగా వేతనం ఇవ్వలేదు. నేను ఆత్మహత్య చేసుకుంటే కనీసం మిగతా వారికైనా న్యాయం జరుగుతుందని భావించా. ప్రభుత్వం ఆయుష్ ఉద్యోగులకు న్యాయం చేయాలి. – గౌతమి, బాధితురాలు, పాలసముంద్రం మండలం
Comments
Please login to add a commentAdd a comment