– వైద్యాధికారి లేని చోట ఉద్యోగుల తొలగింపు
– ఏడాదిగా జీతాలూ చెల్లించని వైనం
– మూసివేత దిశగా 30 డిస్పెన్సరీలు
– ఆందోళనలో ఆయుష్ ఉద్యోగులు
అనంతపురం మెడికల్ : బాబొస్తే జాబొస్తుందనుకుంటే ఉన్న ఉద్యోగాలూ ఊడాయి. ఏడాది పాటు జీతాలు లేకున్నా ఏదో ఒక రోజు వస్తాయనుకున్న వారి ఆశలపై ప్రభుత్వం నీళ్లు చల్లుతూ ఏకంగా ఉద్యోగాల నుంచే తొలగించేశారు. ఆ నెపాన్ని తెలివిగా కేంద్రంపై నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ప్రకృతి వైద్యంపై ప్రజల్లో ఆసక్తి పెరుగుతున్న నేపథ్యంలో ‘ఆయుష్’ను బలోపేతం చేయాల్సింది పోయి విధుల నుంచే తొలగిస్తూ నిర్ణయం తీసుకోవడంతో పలు కుటుంబాలు రోడ్డున పడ్డాయి. వివరాల్లోకెళ్లితే.. జిల్లాలో జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ (ఎన్‌ఆర్‌హెచ్‌ఎం) కింద 46 డిస్పెన్సరీలు ఉన్నాయి. ఇందులో అమడగూరు, అగళి, ఎర్రగుంట్ల ఆయుర్వేద డిస్పెన్సరీలు మూతపడ్డాయి. మిగిలిన వైద్యశాలల్లో 22 ఆయుర్వేద, 13 హోమియో, 6 యునానీ, రెండు న్యాచురోపతి డిస్పెన్సరీలు ఉన్నాయి. ఆయుష్ వైద్యశాలల్లో మెడికల్ ఆఫీసర్, కాంపౌండర్, స్వీపర్ కం నర్స్ (ఎస్‌ఎన్‌ఓ) పోస్టులు ఉంటాయి. ప్రస్తుతం 82 మంది కాంట్రాక్ట్ పద్ధతిలో పని చేస్తున్నారు. ఏటా వీరికి రెన్యూవల్ చేయాల్సి ఉంటుంది. ఈ ఏడాది మార్చినాటికి గడువు పూర్తికాగా ఒక్కరికీ రెన్యూవల్ చేయలేదు.
వైద్యులు లేని చోట ఉద్యోగుల తొలగింపు
తాజాగా ఆయుష్ ఉద్యోగులు అవసరం లేదని, వారిని ఇంటికి పంపేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ క్రమంలో వైద్యుల్లేని చోట మిగిలిన సిబ్బందిని తొలగించనున్నారు. జిల్లాలోని 22 ఆయుర్వేద డిస్పెన్సరీలకు సంబంధించి ప్రస్తుతం ఆరుగురు వైద్యులు, 17 మంది కాంపౌండర్లు, 17 మంది ఎస్‌ఎన్‌ఓలు పని చేస్తున్నారు. బుక్కపట్నం, చెన్నేకొత్తపల్లి, కిష్టిపాడు, పెద్దకౌకుంట్ల, రాప్తాడు, తిమ్మంపల్లిలో మెడికల్ ఆఫీసర్లు ఉన్నారు. అగళి, బొమ్మనహాళ్, చుక్కలూరు, కళ్యాణదుర్గం, కొర్రపాడు, ఎన్‌ఎస్ గేట్, నల్లచెరువు, పెద్దవడుగూరు, పేరూరు, పుట్టపర్తి, రామగిరి, రొద్దం, శెట్టూరు, తాడిమర్రి, యల్లనూరు, యర్రగుంట డిస్పెన్సరీల్లో డాక్టర్లు లేరు. జిల్లావ్యాప్తంగా 13 హోమియో డిస్పెన్సరీలుండగా బేవనహళ్లి, బుక్కరాయసముద్రం, కొనకొండ్ల, కుందుర్పిలో వైద్యులుండగా 9 డిస్పెన్సరీల్లో కాంపౌండర్లు, 13 ఆస్పత్రుల్లో ఎస్‌ఎన్‌ఓలున్నారు. అమడగూరు, ఆత్మకూరు, ఎద్దులపల్లి, కదిరి, కణేకల్లు, ఎన్‌పీ కుంట, పట్నం, పెనుకొండ, కొత్తచెరువులో డాక్టర్లు లేరు.
ఇక నేచురోపతి డిస్పెన్సరీలకు సంబంధించి కూడేరు కేంద్రంలో డాక్టర్ ఉన్నా ఏనాడూ విధులకు హాజరైంది లేదు. చౌళూరులో వైద్యుడు లేరు. ఈ రెండు ఆస్పత్రులకు గాను ఒక కాంపౌండర్, ఇద్దరు ఎస్‌ఎన్‌ఓలు పని చేస్తున్నారు. యునానీకి సంబంధించి గార్లదిన్నె, కె.బసనహళ్లి, పరిగిలో డాక్టర్లు ఉన్నారు. బ్రహ్మసముద్రం, కేఎన్ పల్లి, వజ్రకరూరులు వైద్యుల్లేరు. ఆయా డిస్పెన్సరీల్లో నలుగురు కాంపౌండర్లు, ఐదుగురు ఎస్‌ఎన్‌ఓలు ఉన్నారు. ప్రభుత్వ నిర్ణయం మేరకు వైద్యులు ఉన్న చోట మాత్రమే ఉద్యోగులను కొనసాగించనున్నారు.
బకాయి జీతాలు చెల్లించలేం!
గతేడాది నుంచి ఉద్యోగులకు జీతాలు రావాల్సి ఉంది. తాజా ఉత్తర్వుల నేపథ్యంలో జీతాలు కూడా రాని పరిస్థితి తలెత్తింది. ఆయుష్ కమిషనర్ రేవతి గత నెల 20వ తేదీన రీజనల్ డిప్యూటీ డైరెక్టర్లకు జారీ చేసిన ఉత్తర్వులు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. 2016–17 సంవత్సరానికి సంబంధించి ఉద్యోగుల జీతాల బడ్జెట్‌తో పాటు 2017–18 సంవత్సరానికి సైతం జీతాలు ఇవ్వలేమని అందులో పేర్కొన్నారు. మెడికల్ ఆఫీసర్ లేని చోట విధులు నిర్వర్తిస్తున్న పారామెడికల్ సిబ్బంది జీతాలను విడుదల చేయలేమని ఢిల్లీలో జరిగిన సమావేశంలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, ఈ మేరకే ఉత్తర్వులు జారీ చేస్తున్నట్లు పేర్కొనడం విశేషం. ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయంతో జిల్లావ్యాప్తంగా 30 డిస్పెన్సరీలు మూతపడే సూచనలు కన్పిస్తున్నాయి.
తీరిన ‘ఆయుష్షు’!
Published Tue, May 2 2017 11:51 PM | Last Updated on Tue, Sep 5 2017 10:13 AM
Advertisement