ఏడిపింఛన్
నత్తనడకన బయోమెట్రిక్ ప్రక్రియ పూర్తయితేనే చెల్లింపులు
మూడు నెలలుగా నిలిచిన పెన్షన్లు లబ్ధిదారుల ఆందోళన
పెన్షన్‌దారులు సంఖ్య రావాల్సింది (రూ..)
వృద్ధులు 1,78,914 10,73,48,400
వితంతువులు 94,567 5,67,40,200
వికలాంగులు 64,855 9,72,85,500
చేనేత కార్మికులు 11,668 70,00,000
గీత కార్మికులు 60,333 36,19,800
అభయహస్తం 40,846 6,12,69,000
మొత్తం 3,96,883 33,32,62,900
మూన్నెల్ల నుంచి ముప్పుతిప్పలు
ఇతని పేరు బిల్ల రాజమల్లు(78). ఊరు జమ్మికుంట. కొన్నేళ్ల నుంచి మంచానికే పరిమితమయ్యాడు. అధికారులు ఆయనను బయోమెట్రిక్ కోసం రమ్మంటున్నారు. కానీ మరొకరి తోడు ఉంటే తప్ప కదలలేని పరిస్థితి. మీరే వచ్చి వేలిముద్రలు తీసుకోండి అంటూ రాజమల్లు భార్య మూడు నెలలుగా తిరుగుతోంది. ఇంతవరకు వేలిముద్రలు తీసుకోలేదు. పింఛన్ ఇవ్వడం లేదు. మూడు నెలల నుంచి పింఛన్ రాక అరిగోస పడుతున్నామని ఆమె వాపోయింది.
జిల్లాలో మూడు నెలలుగా సామాజిక పింఛన్ల పంపిణీ ప్రక్రియ నిలిచిపోయింది. నెలనెలా వచ్చే పింఛన్ డబ్బులపైనే ఆధారపడ్డ అభాగ్యుల బతుకు దినదినగండంగా గడుస్తోంది. బయోమెట్రిక్ విధానంలో పింఛన్‌దారుల వేలిముద్రలు సేకరించి.. స్మార్ట్‌కార్డుల ద్వారా పింఛన్లు అందించాలని ప్రభుత్వం ఆదేశించింది. కానీ జిల్లాలో బయోమెట్రిక్ ప్రక్రియ పూర్తిగా నత్తనడకన సాగుతోంది. బయోమెట్రిక్ కాంట్రాక్టు పొందిన మణిపాల్, ఫినో ఏజెన్సీల నిర్లక్ష్యంతో ఈ పరిస్థితి తలెత్తింది. వీరు కొంతమంది సిబ్బందిని నియమించుకుని గ్రామాల్లో పింఛన్‌దారుల చేతి వేలిముద్రలు సేకరించాలి. ఏడాది క్రితమే ప్రభుత్వంతో ఒప్పందం కుదర్చుకున్న ఏజెన్సీలు బయోమెట్రిక్ నమోదు ప్రక్రియను ఆలస్యంగా ప్రారంభించాయి. గతేడాది డిసెంబర్ నుంచి బయోమెట్రిక్ నమోదు ప్రారంభించి ఈ ఏడాది ఫిబ్రవరి వరకు పూర్తి చేసి.. మార్చి, ఏప్రిల్ నుంచి పింఛన్లు అందాల్సి ఉంది. కానీ క్షేత్రస్థాయిలో ఏజెన్సీ సిబ్బంది అలసత్వంతో నేటికీ ప్రక్రియ పూర్తి కాలేదు. ఈ విషయమై డీఆర్‌డీఏ ప్రాజెక్టు డెరైక్టర్ విజయగోపాల్ వివరణ ఇస్తూ.. జిల్లాలో ఇప్పటివరకు సింహభాగం లబ్ధిదారుల బయోమెట్రిక్ ప్రక్రియ పూర్తయిందన్నారు. ఇంకా 27వేల మంది వేలిముద్రలు సేకరించాల్సి ఉందని, జూన్ ఒకటో తేదీలోగా ప్రక్రియ పూర్తి చేయాలని ఏజెన్సీలను ఆదేశించామని ఆయన చెప్పారు. బయోమెట్రిక్ ప్రక్రియ పూర్తయితేనే పెన్షన్లు ఇవ్వాలని సర్కారు పేర్కొనడంతో దాదాపు మూడు నెలలుగా పింఛన్ చెల్లింపులు నిలిచిపోయాయి. జిల్లాలో 3,96,883 మంది సామాజిక పింఛన్లు పొందుతున్నారు. వృద్ధులు, వితంతువులు, చేనేత, గీతకార్మికులకు నెలకు రూ.200, వికలాంగులు, అభయహస్తం సభ్యులకు రూ.500 చొప్పున పింఛన్ వస్తుంది. వీరిలో చాలామందికి పింఛన్ డబ్బులే జీవనాధారం. రేషన్ సరుకులు, మందులు ఆ డబ్బులతోనే కొనుక్కుని కాలం వెళ్లదీస్తున్నారు. వీరంతా మూడు నెలల నుంచి డబ్బులు రాకపోవడంతో ముప్పుతిప్పలు పడుతున్నారు. గతేడాది వరకు అర్హులకు స్మార్ట్‌కార్డుల ద్వారా పెన్షన్లు అందేవి. బోగస్ లబ్ధిదారులకు చెక్ పెట్టేందుకు సర్కారు బయోమెట్రిక్ విధానాన్ని ప్రవేశపెట్టింది. దాని అమలులో యంత్రాంగం విఫలమవడం, ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపించడం అభాగ్యులకు ఆశనిపాతంగా మారింది.
వీరి సంగతేంది?
బయోమెట్రిక్‌లో చేతి వేలిముద్రలు లేకుండా పెన్షన్లు అందని పరిస్థితులు నెలకొనడంతో జిల్లాలో వృద్ధులు.. వికలాంగులు ఆందోళన చెందుతున్నారు. వృధాప్యం కారణంగా వేలాది మంది చేతి ముద్రలు చెరిగిపోయాయి. చేయి లేని వికలాంగులు ఎంతో మంది ఉన్నారు. దీంతో వీరికి పెన్షన్ ప్రశ్నార్థకంగా మారింది. చేయి లేని వారికి కనీసం ఐరిస్ విధానంతో కళ్లు స్క్రీనింగ్ చేసైనా పెన్షన్ అందించాలనే డిమాండ్ ఉంది. కానీ ఐరిస్ విషయంలో ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని డీఆర్‌డీఏ ప్రాజెక్టు డెరైక్టర్ విజయగోపాల్ చెప్పారు.