సరైన ఆరోగ్య బీమా పథకమనేది దివ్యాంగులకు ఒక రక్షణ కవచంలాంటిది. ఒక్కొక్కరి అవసరాలు ఒక్కో విధంగా ఉంటాయి కాబట్టి వాటికి అనుగుణంగా తగిన పథకాన్ని తీసుకోగలిగితే ఆర్థిక భద్రత లభిస్తుంది. అయితే, సరైన బీమా పథకాన్ని ఎంచుకోవడంలో ఎన్నో అవరోధాలు ఉంటాయి. అర్థం కాని పరిభాష, పైకి కనిపించని నిబంధనలు, అనేకానేక ఆప్షన్లు మొదలైన వాటితో ఇదో గందరగోళ వ్యవహారంగా ఉంటుంది.
ఒక్క చిన్న తప్పటడుగు వేసినా సరైన కవరేజీ లేకుండా పోవడమో, ఊహించని ఖర్చులు పెట్టుకోవాల్సి రావడమో లేక అత్యవసర పరిస్థితుల్లో ఆటంకాలు ఎదురుకావడమో జరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో, దివ్యాంగులు ఆరోగ్య బీమాను ఎంచుకునేటప్పుడు నివారించతగిన తప్పిదాలపై అవగాహన కల్పించడం ఈ కథనం ఉద్దేశం. అవేమిటంటే..
కీలక వివరాలను పట్టించుకోకపోవడం:
ఆరోగ్య బీమాను ఎంచుకునేటప్పుడు స్పష్టంగా కనిపించే కీలక విషయాలను కూడా అంతగా పట్టించుకోకపోవడమనేది సాధారణంగా చేసే తప్పిదాల్లో ఒకటిగా ఉంటుంది. దివ్యాంగుల విషయానికొస్తే, పాలసీలోని ప్రతి చిన్న అంశమూ ఎంతో ప్రభావం చూపేదిగా ఉంటుంది. కాబట్టి అన్ని నియమ నిబంధనలు, షరతులు, మినహాయింపులు, పరిమితులు మొదలైన వాటి గురించి జాగ్రత్తగా చదువుకోవాలి.
నిర్దిష్ట అనారోగ్యాలు, చికిత్సలకు బీమా వర్తించకుండా మినహాయింపుల్లాంటివేమైనా ఉన్నాయేమో చూసుకోవాలి. ఇలాంటి వివరాలను పట్టించుకోకపోతే ఊహించని ఖర్చులు పెట్టుకోవాల్సి రావచ్చు లేదా క్లెయిమ్ పూర్తి మొత్తం చేతికి రాకపోవచ్చు. దీంతో ఆర్థిక సమస్యలు ఎదురుకావచ్చు.
కేవలం ప్రీమియంనే ప్రాతిపదికగా ఎంచుకోవడం:
ప్రీమియం అనేది ముఖ్యమైన అంశమే అయినప్పటికీ కేవలం ప్రీమియం తక్కువగా ఉందనే ఆలోచనతో పథకాన్ని ఎంచుకుంటే చాలా ఖరీదైన మూల్యం చెల్లించుకోవాల్సి రావచ్చు. సాధారణంగా ప్రీమియంలు తక్కువగా ఉంటే మన జేబు నుంచి ఎక్కువగా ఖర్చు పెట్టుకోవాల్సి రావచ్చు.
కవరేజీ పరిమితంగానే ఉండొచ్చు లేదా దివ్యాంగుల నిర్దిష్ట అవసరాలకు బీమా ఉపయోగపడని విధంగా పరిమితుల్లాంటివి ఉండొచ్చు. ప్రీమియం కాస్త ఎక్కువైనప్పటికీ గణనీయంగా మెరుగైన కవరేజీని ఇచ్చే పథకాన్ని ఎంచుకుంటే మంచిది. దీనివల్ల దీర్ఘకాలంలో డబ్బు ఆదా కావడంతో పాటు ఆరోగ్య సంరక్షణ కూడా మెరుగ్గా ఉంటుంది.
కో–పే, సబ్–లిమిట్స్ తెలుసుకోకపోవడం:
క్లెయిమ్ చేసేటప్పుడు చేతికి వచ్చే మొత్తంపై కో–పే, సబ్–లిమిట్స్ అనే కీలకాంశాలు చాలా ప్రభావం చూపుతాయి. కో–పే అనేది క్లెయిమ్ సమయంలో పాలసీదారు తాను భరించేందుకు అంగీకరించే నిర్దిష్ట శాతాన్ని తెలియజేస్తుంది. కో–పే పరిమితులు ఎంత ఎక్కువగా ఉంటే బీమా కంపెనీ చెల్లించే క్లెయిమ్ పేఅవుట్ అంత తక్కువవుతుంది.
అలాగే, సబ్–లిమిట్స్ అనేవి నిర్దిష్ట అనారోగ్యాలు లేక చికిత్సలు, అంటే ఉదాహరణకు క్యాటరాక్ట్, మోకాలి మార్పిడి మొదలైన వాటికి వర్తించే కవరేజీ మొత్తాన్ని ఒక స్థాయికి పరిమితం చేస్తాయి. ఈ పరిమితులను చూసుకోకపోతే జేబుకు గణనీయంగా చిల్లు పడే అవకాశం ఉంటుంది.
భవిష్యత్‌ను పరిగణనలోకి తీసుకోకపోవడం:
కాలం గడిచే కొద్దీ ఆరోగ్య అవసరాలు మారుతుంటాయి. కాబట్టి భవిష్యత్ అవసరాలను కూడా పరిగణనలోకి తీసుకునే ప్లాన్‌ను ఎంచుకోవడం కీలకం. దివ్యాంగుల ఆరోగ్య పరిస్థితుల్లో మార్పులు వస్తుంటాయి కాబట్టి అదనపు సంరక్షణ లేక విభిన్నమైన చికిత్సలు అవసరమవుతాయి. ఆరోగ్య బీమా పథకాన్ని ఎంచుకునేటప్పుడు, ప్రస్తుత అవసరాలు మాత్రమే కాకుండా భవిష్యత్‌లో తలెత్తే అవకాశము న్న అవసరాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి.
వివిధ ఆప్షన్లను పరిశీలించకపోవడం:
ఆరోగ్య బీమా పథకాన్ని ఎంచుకునేటప్పుడు కనిపించిన మొదటి పథకాన్ని తీసేసుకోకుండా వివిధ ప్లాన్లను పరిశీలించి చూసుకోవాలి. కవరేజీ, ఖర్చులు, ప్రొవైడర్ నెట్‌వర్క్‌లు, అదనపు ప్రయోజనాలపరంగా వివిధ పథకాల్లో మార్పులు ఉంటాయి. పలు ప్లాన్లను పోల్చి చూసుకునేందుకు కాస్త సమయం వెచ్చించాలి. దివ్యాంగులకు సంబంధించి ఒక్కో ప్లాన్‌లో కవరేజీ ఏ విధంగా ఉందనేది పరిశీలించి చూసుకోవాలి.
ఇందుకోసం కంపారిజన్ వెబ్‌సైట్ల వంటి సాధనాలను ఉపయోగించుకోవచ్చు. అవసరమైతే బీమా అడ్వైజర్ల సలహా తీసుకోవాలి. ప్లాన్ వివరాలను క్షుణ్నంగా అధ్యయనం చేయాలి. ఇలాంటి విధానాన్ని పాటిస్తే అవసరాలకు తగినట్లుగా ఉండే సమగ్రమైన, చౌకైన పథకాన్ని ఎంచుకోవడానికి వీలవుతుంది. స్థూలంగా చెప్పాలంటే, పాలసీ తీసుకునేటప్పుడు ప్రతి చిన్న అంశాన్ని క్షుణ్నంగా చదువుకోవాలి. ప్రీమియం మాత్రమే చూసుకోవద్దు. కవరేజీ పరిమితులను పరిశీలించుకోవాలి. భవిష్యత్ అవసరాల కోసం ప్లాన్ చేసుకోవాలి. వివిధ ఆప్షన్లను పోల్చి చూసుకోవాలి.
Comments
Please login to add a commentAdd a comment