కొరబడిన ‘సహకారం’.. కదం తొక్కిన ఉద్యోగులు | employees dharna in dcms office | Sakshi
Sakshi News home page

కొరబడిన ‘సహకారం’.. కదం తొక్కిన ఉద్యోగులు

Published Thu, Aug 24 2017 9:31 PM | Last Updated on Sun, Sep 17 2017 5:55 PM

కొరబడిన ‘సహకారం’.. కదం తొక్కిన ఉద్యోగులు

కొరబడిన ‘సహకారం’.. కదం తొక్కిన ఉద్యోగులు

– సహకారశాఖ రిజిస్ట్రార్‌, డీసీవో వైఖరి నశించాలని నినాదాలు
– నారాయణస్వామి మోనార్క్‌లా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం
– డీసీసీబీపై సెక‌్షన్‌ 51 విచారణ తక్షణం నిలిపేయాలని డిమాండ్‌
– మహా«ధర్నాకు మద్ధతు పలికిన పలు ట్రేడ్, రైతు సంఘం నేతలు
– సంఘీభావం ప్రకటించిన డీసీసీబీ చైర్మన్‌ లింగాల శివశంకరరెడ్డి


అనంతపురం అగ్రికల్చర్‌: సహకారశాఖ రిజిస్ట్రార్‌ మురళి, జిల్లా సహకార అధికారి (డీసీవో) ఇ.అరుణకుమారి, విచారణాధికారి నారాయణస్వామి వైఖరిని నిరసిస్తూ సహకార బ్యాంకు ఉద్యోగులు, ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల (పీఏసీఎస్‌) ఉద్యోగులు, సిబ్బంది గురువారం కదంతొక్కారు. వారికి మద్దతుగా  ఆంధ్రప్రదేశ్‌ యూనియన్‌, తెలంగాణ రాష్ట్ర కమిటీ నాయకులు, వివిధ జిల్లాల నాయకులు, బ్యాంకు ఉద్యోగుల సమన్వయ సంఘం, ఏఐటీయూసీ, సీఐటీయూ, రైతు సంఘం నాయకులు మద్ధతు పలకడంతో స్థానిక డీసీవో కార్యాలయం ఎదుట నిర్వహించిన మహా«ధర్నా విజయవంతమైంది. మొదట స్థానిక జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ) నుంచి ఉద్యోగులు పెద్ద ఎత్తున ర్యాలీగా వెళ్లి డీసీవో ఆఫీస్‌ ఎదుట మహాధర్నా నిర్వహించారు.

బ్యాంకు ఉద్యోగుల సమన్వయ సంఘం జిల్లా అ«ధ్యక్షుడు డి.రుషేంద్రబాబు అధ్యక్షతన జరిగిన మహాధర్నాలో సహకార బ్యాంకు ఉద్యోగుల యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వైఎస్‌ఆర్‌కే ప్రసాద్, తెలంగాణరాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.జనార్ధన్, జాతీయ ఉపాధ్యక్షుడు ఏవీ కొండారెడ్డి, రాష్ట్ర సలహాదారుడు రంగబాబు, రాష్ట్ర ఉపాధ్యక్షులు రాధాకృష్ణమూర్తి, బాలాజీప్రసాద్, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రత్నప్రసాద్, ప్రత్యేక ఆహ్వానితుడు సుఖదేవబాబు, వైఎస్సార్‌ కడప, కర్నూలు, ప్రకాశం జిల్లా అ«ధ్యక్షులు ప్రతాపరెడ్డి, మూర్తి, రంగస్వామిరెడ్డి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆకాశరామన్న ఉత్తరాలు, అనామక వ్యక్తులు ఇచ్చిన ఫిర్యాదుల ఆధారంగా డీసీసీబీ వ్యవహారాలపై సెక‌్షన్‌ 51 ప్రకారం విచారణ చేయాలని సహకార శాఖ రిజిస్ట్రార్‌ మురళీ ఉత్తర్వులు ఇవ్వడమే తప్పన్నారు.

విచారణాధికారిగా నియమితులైన ఆ శాఖ అధికారి నారాయణస్వామి మోనార్క్‌లా వ్యవహరిస్తూ ఉద్యోగులను వేధించడం దారుణమన్నారు. ఇంత జరుగుతున్నా డీసీవో అరుణకుమారి మౌనంగా ఉంటూ ప్రోత్సహించడం మంచిపరిణామం కాదన్నారు. దేనిపై విచారణ చేస్తున్నారనే విషయాలు చెప్పకుండా రికార్డులన్నీ స్వాధీనం చేయాలని విచారణాధికారి ఆదేశించడం చట్టవిరుద్ధమన్నారు. ఇది నిరంకుశ వైఖరికి అద్ధం పడుతోందన్నారు. ఏకపక్షంగా సాగిస్తున్న విచారణ వల్ల రైతులు, పేదలు, ఖాతాదారులు ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు.

అంతా పారదర్శకం
నష్టాల్లో ఉన్న డీసీసీబీ ఇప్పుడు లాభాల బాట పట్టిందంటే దానికి కారణం పారదర్శకంగా వ్యవహరించడమేనని చైర్మన్‌ లింగాల శివశంకరరెడ్డి తెలిపారు. దురుద్దేశంతో విచారణకు ఆదేశించడం వల్ల డీసీసీబీ ప్రతిష్టకు భంగం వాటిల్లుతోందన్నారు. నాబార్డు, ఆప్కో నుంచి రుణాలు రాకపోతే ఎవరు బాధ్యులని ప్రశ్నించారు. అనంతరం ఉద్యోగ సంఘం నాయకులు డీసీవో ఇ.అరుణకుమారిని కలిసి వినతి పత్రం అందజేశారు. మహాధర్నాలో యూనియన్‌ జిల్లా నాయకులు అనిల్‌కుమార్‌రెడ్డి, జానకీరామరెడ్డి, మల్లికార్జునుడు, సోమశేఖర్, శ్రీధర్, కుసుమకుమారి, డీసీసీబీ ఉపాధ్యక్షుడు ఆనందరంగారెడ్డి, డీసీఎంఎస్‌ ఉపాధ్యక్షుడు జయరామిరెడ్డి, పలువురు డైరెక్టర్లు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement