రాజకీయ జోక్యం! | Political interference | Sakshi
Sakshi News home page

రాజకీయ జోక్యం!

Published Sun, Sep 28 2014 2:58 AM | Last Updated on Wed, Sep 5 2018 3:38 PM

Political interference

విజయనగరం క్రైం : పదేళ్ల పాటు అధికారానికి దూరంగా ఉన్న పచ్చచొక్కా నాయకులు పదవి వచ్చిందే తడవుగా డబ్బులు సంపాదించే పనిలో పడ్డారు. జిల్లాలో ఏ శాఖలో ఉద్యోగ నియూమకాలు చేపట్టినా... తమ వారికే నియమించాలని బెట్టు చేస్తున్నారు. నిన్నగాక మొన్న ఎలక్ట్రికల్ షిప్ట్ ఆపరేటర్ పోస్టులకు ఒకొక్కరి దగ్గర నుంచి నాలుగైదు లక్షల రూపాయలు వసూలు చేశారని స్వయాన టీడీపీ కార్యకర్తలే నాయకులపై బహిరంగ విమర్శలు  చేసిన విషయం తెలిసిందే. తాజాగా జిల్లా గృహ నిర్మాణ సంస్థలో పనిచేసే అవుట్ సోర్సింగ్  ఉద్యోగులపై టీడీపీ నాయకుల కన్ను పడింది. ప్రస్తుతం ఆ శాఖలో పని చేస్తున్న ఉద్యోగులనే పనితీరు, సీనియార్టీ అధారంగా నియమించాలని గృహ నిర్మాణ సంస్థ రాష్ట్ర మేనేజింగ్ డెరైక్టర్ ఆదేశాలు జారీ చేశారు. దీనికి  కూడా టీడీపీ ఎమ్మెల్యేలు లేఖలు ఇవ్వడం ద్వారా అర్హులకు అన్యాయం జరుగుతుందని  అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు.
 
 జిల్లా గృహ నిర్మాణ సంస్థలో డేటా ఎంట్రీ ఆపరేటర్, ఆపరేటర్ ఉద్యోగాల నియూమకంలో రాజకీయ జోక్యం  ఎక్కువైందన్న వాదన వినిపిస్తోంది. గృహ నిర్మాణ సంస్థలో పని చేస్తున్న అవుట్ సోర్సింగ్ వర్కు ఇన్‌స్పెక్టర్లు,  డేటా ఎంట్రీ ఆపరేటర్లు, అకౌంట్ అసిస్టెంట్ ఉద్యోగాల్లో పని చేస్తున్న వారి విధి నిర్వహణ, సీనియార్టీ, విద్యార్హతలను బట్టి తీసుకోవాలని ఆ శాఖ మేనేజింగ్  డెరైక్టర్ నుంచి ఉత్తర్వులు వచ్చాయి. ప్రస్తుతం గృహ నిర్మాణ సంస్థలో వర్కు ఇన్‌స్పెక్టర్లు 86 మంది పని చేస్తుండగా, వీరిలో 54మందిని తీసుకునే అవకాశం ఉంది.  16 మంది డేటా ఎంట్రీ ఆపరేటర్లు, 9 మంది అకౌంట్ అసిస్టెంట్లు ఉన్నారు. వీరిలో 13 మందిని మాత్రమే సీనియార్టీ, విద్యార్హతలు, పనితీరు బట్టి నియమించాలని రాష్ట్ర అధికారులు ఆదేశించారు. అయితే వీటిలో కూడా  రాజకీయ జోక్యం మితిమీరుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. టీడీపీకి చెందిన ముఖ్య నాయకులు, ఎమ్మెల్యేలు తమకు అనుకూలంగా ఉన్న వ్యక్తులను నియమించాలని గృహ నిర్మాణశాఖ అధికారులపై  ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. సీనియార్టీ, ప్రతిభ ఆధారంగా కాకుండా ఎమ్మెల్యేలు అందించిన  లేఖల ప్రకారం అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను ఎంపిక చేసినట్లు తెలిసింది.
 
 అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను ఎంపిక చేసిన ఫైలు కలెక్టర్ వద్ద ఉన్నట్లు సమాచారం. పార్వతీపురం డివిజన్‌లో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఎక్కువగా ఉండడంతో  అధికార పార్టీ నాయకులు ఒత్తిళ్లు ఎక్కువగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. డేటా ఎంట్రీ ఆపరేటర్లు సీనియారిటీ, విద్యార్హతలు, పనితీరును కాకుండా అధికార పార్టీ ఎమ్మెల్యేలు లేఖలు ఇచ్చిన వారినే నియమించే అవకాశం ఉందని...  అన్ని అర్హతలు ఉన్న వారు ఆందోళన పడుతున్నారు. రాజకీయ నాయకుల జోక్యం వల్ల  అర్హతలు ఉన్న వారికి అన్యాయం జరిగే అవకాశం ఉంది.  ఇటీవల పార్వతీపురంలోని ఒక లాడ్జిలో క్రికెట్, పేకాట బెట్టింగ్‌లకు పాల్పడి పోలీసులకు చిక్కి కేసు నమోదు అయిన అకౌంట్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్‌కు అధికార పార్టీ నాయకులు రికమండేషన్ లెటర్ ఇచ్చి ఉద్యోగ అవకాశం కల్పించాలని హౌసింగ్ అధికారులపై ఒత్తిడి తెచ్చినట్టు సమాచారం. ఇదే కొనసాగితే తమకు అన్యాయం తప్పదని అర్హులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement