కాంట్రాక్టర్ల కర్రపెత్తనం | Rajahmundry corporation contractors running | Sakshi
Sakshi News home page

కాంట్రాక్టర్ల కర్రపెత్తనం

Published Sat, Nov 1 2014 12:16 AM | Last Updated on Sat, Sep 2 2017 3:39 PM

కాంట్రాక్టర్ల కర్రపెత్తనం

కాంట్రాక్టర్ల కర్రపెత్తనం

సాక్షి, రాజమండ్రి :రాజమండ్రి నగరపాలక సంస్థలో కాంట్రాక్టర్ల ఇష్టారాజ్యం నడుస్తోంది. ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల నియామకం నుంచి అభివృద్ధి పనుల వరకూ అన్నింటిలో వారిదే పెత్తనం. వివిధ విభాగాల్లో దీర్ఘకాలంగా కాంట్రాక్టులు నిర్వహిస్తున్న వారు రింగై కొత్త వారిని రాకుండా చూస్తుంటే.. ఎవరూ రాలేదు కాబట్టి పాత వారికే ఇస్తున్నామని అధికారులు సాకులు చూపుతున్నారు. తిష్ట వేసిన కాంట్రాక్టర్లకు సహకరిస్తున్న కొందరు అధికారులు వారి చేతుల్లో కీలుబొమ్మల్లా ఆడుతున్నారు. తమపై దాడులు చేస్తున్నా మిన్నకుంటూ, వారికే కొత్త కాంట్రాక్టులు కూడా అప్పగించేస్తున్నారు.ఔట్ సోర్సింగ్ పద్ధతిలో నగరపాలక సంస్థ పారిశుధ్య విభాగంలో 899 మంది, కంప్యూటర్ ఆపరేటర్లుగా 17 మంది, మంచినీటి సరఫరా, విద్యుత్తు దీపాల నిర్వహణా విభాగాల్లో 164 మంది, ప్రధాన కార్యాలయంతో పాటు పలు పాఠశాలల్లో సెక్యూరిటీ గార్డులుగా 20 మంది పని చేస్తున్నారు.
 
 ఔట్ సోర్సింగ్ సిబ్బంది నియామకానికి ప్రతి ఏడాదీ టెండర్లు పిలిచి నిబంధనల ప్రకారం ఏజెన్సీలకు అప్పగించాలి. కానీ కాంట్రాక్టర్లు  అధికారులను మచ్చిక చేసుకుని, చక్రం తిప్పుతున్నారు. టెండర్లలో ఎవరూ పోటీ రాకుండా చూసుకుంటున్నారు. 2012లో పాలక మండలి రద్దయ్యాక అధికారులు ఇష్టారాజ్యంగా ఔట్ సోర్సింగ్ కాంట్రాక్టును పొడిగిస్తూ వచ్చారు. ఈ వ్యవహారం విమర్శలకు దారితీసినా ఖాతరు చేయలేదు. ఈ ఏడాది జూలై మూడు నుంచి కొత్త పాలక వర్గం రావడంతో పరిస్థితులు మారతాయనుకున్నా..అధికారులు వంకలు చూపుతూ పాత కాంట్రాక్టర్లకే ఎర్ర తివాచీ పరుస్తున్నారు. గత కొనసాగింపుల అనంతరం ఈ ఏడాది జూలై 31తో ఔట్‌సోర్సింగ్ కాంట్రాక్టులు పూర్తవగా మరోసారి కొనసాగింపు కోసం తీర్మానాలను కౌన్సిల్ ముందు ఉంచారు. తాము 2014-15లో ఔట్ సోర్సింగ్ సేవలకు 2013 డిసెంబరులో టెండర్లు పిలిచినా ఎవరూ రాకపోవడంతో పాత వారినే కొనసాగిస్తున్నామని కౌన్సిల్ కు చెప్పుకొచ్చారు.
 
 కౌన్సిల్ కాదన్నా..
 ఈ ఏడాది జూలై 27 జరిగిన కౌన్సిల్ తొలి కౌన్సిల్ సమావేశంలో ఔట్ సోర్సింగ్ సిబ్బందిని కొత్తగా టెండర్లు పిలిచి నియమించాలని తీర్మానించారు. కాంట్రాక్టు సంస్థలు ఉద్యోగుల నియామకాల్లో అవకతవకలకు పాల్పడుతున్నాయని, ఒక్కో పారిశుధ్య కార్మికుడికి తమ ద్వారా కార్పొరేషన్‌లో ఉద్యోగం ఇవ్వాలంటే రూ.40 వేల వరకూ వసూలు చేస్తున్నాయని కార్పొరేటర్లు ఆరోపించారు. అప్పట్లో మార్చి 2015 వరకూ వారిని పొడిగించాలనే తీర్మానాన్ని తిరస్కరించి సెప్టెంబర్ వరకూ జీతాలు చెల్లించి తర్వాత టెండర్ల ద్వారా నియామకాలు చేపట్టాలని ఆదేశించారు. కానీ గురువారం జరిగిన కౌన్సిల్ సమావేశంలో కూడా అధికారులు వైఖరి మార్చుకోలేదు. అన్ని విభాగాల్లో ఔట్ సోర్సింగ్ సిబ్బందిని నియమించేందుకు టెండర్లు పిలిచినా ఒక్క టెండర్ కూడా వేయలేదని తాజా తీర్మానంలో పేర్కొన్నారు.
 
 కార్పొరేషన్ ను గుప్పిట్లో పెట్టుకున్న కాంట్రాక్లర్లు రింగై కొత్త వారిని రానివ్వకపోవడం ఔట్ సోర్సింగ్‌కే పరిమితం కాలేదు. వారే పదే పదే అన్ని టెండర్లలో పాల్గొంటూ పనులు దక్కించుకుంటున్నారు. కాంట్రాక్టర్ తమ్మయ్యనాయుడు అధికారుల్ని గుప్పిట్లో పెట్టుకుని, అనేక ఏళ్లుగా కార్పొరేషన్ పనులన్నీ తానే దక్కించుకుంటున్నాడని అధికార ప్రతిపక్ష కార్పొరేటర్లు సైతం ఆరోపించడం ఇందుకు నిదర్శనం. ఇటీవల ఇంజనీరింగు విభాగంలో డీఈఈ స్థాయి అధికారితో పాటు, మరో అధికారిణితోనూ దౌర్జన్యంగా వ్యవహరించినా అదే కాంట్రాక్టరుకు గోదావరి ఘాట్‌ల మరమ్మతు పనులు అప్పగించారు. ఈ విషయం స్థానిక ఎమ్మెల్యేకు కానీ, కౌన్సిల్ సభ్యులకు కానీ తెలియకపోవడం విశేషం. దీనిపై గురువారం నాటి కౌన్సిల్ సమావేశంలో రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఇంజనీరింగ్ విభాగం ఎస్‌ఈని ప్రశ్నిస్తే ఎవరూ లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయనందున చర్యలు తీసుకోలేదనడం ఆ కాంటాక్టరుకు అధికారులు దాసోహం అంటున్న తీరుకు అద్దం పడుతోందని కార్పొరేటర్లు విమర్శిస్తున్నారు. గతంలో వచ్చిన ఫిర్యాదులతో అతడిని బ్లాక్ లిస్టులో పెట్టినా మళ్లీ పనులు కట్టబెట్టడం గమనార్హం.
 
 పాత కాంట్రాక్టర్లతో అధికారుల కుమ్మక్కు
 నవంబరు 2013 నుంచి జనవరి 2014 వరకూ నగరపాలక సంస్థలో రూ.5 కోట్ల పనులు జరిగాయి. రింగైన కాంట్రాక్టర్‌లకు 0.01 శాతం లెస్‌కు టెండ ర్లు అప్పగించారు. ఆన్‌లైన్ టెండరింగ్ అయితే 14 శాతం వరకూ లెస్‌కు చేసే వారు ఉన్నా రు. దీనిపై నేను శాసనమండలిలో మున్సిపల్ మంత్రికి ఫిర్యాదు చేసినా మార్పు రాలేదు. ఔట్ సోర్సింగ్ సిబ్బంది నియామకం నుంచి అభివృద్ధి పనుల వరకు తక్కువకు చేసేందుకు కొత్త కాంట్రాక్టర్లు ముందుకు వస్తున్నారు. అయి నా అధికారులు పాత కాంట్రాక్టర్లతో కుమ్మైక్కవుతున్నారు.
 - ఆదిరెడ్డి అప్పారావు, ఎమ్మెల్సీ
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement