పండగ పూట పస్తులేనా
Published Thu, Oct 10 2013 3:59 AM | Last Updated on Wed, Aug 29 2018 4:16 PM
సాక్షి, నల్లగొండ :జిల్లాలో కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు, సిబ్బంది పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ఆనందోత్సాహాల నడమ పండగ జరుపుకోవడం అటుంచితే... కనీసం కడుపు నిండా భోజనం చేయలేని దుస్థితి దాపురించింది. సుమారు ఐదువేల మంది సిబ్బందికి కొన్నినెలలుగా జీతాలు ఇవ్వకపోవడంతో అప్పుతెచ్చి పూట గడుపుతున్నారు. దసరా పండగకైనా జీతాలు వస్తాయని ఎదురు చూస్తున్నవారికి నిరాశే ఎదురవుతోంది. ప్రభుత్వ ఉద్యోగులు, సిబ్బందితో సమానంగా పని చేస్తున్నా వేతనాలు అందజేయడానికి ప్రభుత్వానికి మనసొప్పడం లేదు. ఇచ్చే అరకొర వేతనం కూడా సకాలంలో విడుదల చేయకపోవడంతో నరకం అనుభవిస్తున్నారు. వెరసి వివిధ శాఖల్లో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు, సిబ్బంది అంటీముట్టనట్లు పండగ చేసుకోవాల్సిన దౌర్భాగ్యం దాపురించింది.
చితికిపోతున్న కోఆర్డినేటర్లు...
సాక్షర భారత్ కోఆర్డినేటర్లకు నెలల తరబడి వేతనాలు అందడం లేదు. సాక్షరభారత్‌లో జిల్లాలో 59మంది మండల కో ఆర్డినేటర్లు, రెండు వేలకుపైగా గ్రామ కో ఆర్డినేటర్లు పనిచేస్తున్నారు. గ్రామ కో ఆర్డినేటర్లు గతేడాది సెప్టెంబర్ నుంచి జీతాలకు నోచుకోలేదు. మండల కోఆర్డినేటర్లు ఈ ఏడాదిలో ఇంతవరకు వేతనం అందుకున్న దాఖలాలు లేవు. వేతనాలకుతోడు ఎఫ్‌టీఏ, టీఏ, డీఏ ఇస్తున్న పాపాన ప్రభుత్వం పోలేదు. దీంతో అప్పుతెచ్చి కుటుంబాలు పోషిస్తున్నారు.
పార్ట్‌టైమ్ ఇన్‌స్ట్రక్టర్ల పరిస్థితి అంతే..
గ్రామీణ పేద విద్యార్థులకు హెల్త్ అండ్ ఫిజికల్ ఎడ్యుకేషన్, వర్క్ ఎడ్యుకేషన్, ఆర్ట్ ఎడ్యుకేషన్ అందించడానికి పార్ట్‌టైమ్ ఇన్ స్ట్రక్టర్లుగా కాంట్రాక్ట్ పద్ధతిన ప్రభుత్వం నియమించింది. జిల్లాలో ఆయా ప్రభుత్వ పాఠశాలల్లో మొత్తం 436 మంది పనిచే స్తున్నారు. ప్రతిఒక్కరికి నెలనెలా రూ.4500 వేతనం ఇవ్వాల్సి ఉంది. అయితే గత జూన్ 15వ తేదీ నుంచి ఇప్పటివరకు జీతాలు ఇవ్వడం మరిచారు. దీంతో బతుకు దుర్భరంగా మారింది.
వైద్య ఆరోగ్య శాఖలో..
వైద్య ఆరోగ్య శాఖ పరిధిలో ఉన్న గ్రామీణ సంచార వాహనాలు 104లో పనిచేస్తున్న ఉద్యోగులకు, సిబ్బంది రెండు నెలలుగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 104 పరిధిలో అవుట్ సోర్సింగ్ విధానంలో సుమారు 200 మంది ఫార్మసిస్టులు, ల్యాబ్ టెక్నీషియన్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, డ్రైవర్లు, వాచ్‌మెన్లు పనిచేస్తున్నారు. ఆగస్టు, సెప్టెంబర్ నెలకు సంబంధించి వేతనాలు అందాల్సి ఉంది.
ఎన్‌ఆర్‌హెచ్‌ఎంలో....
జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్(ఎన్‌ఆర్‌హెచ్‌ఎం)పరిధిలో జిల్లాలో 450 మంది కాంట్రాక్ట్ పద్ధతిన ద్వితీయ ఏఎన్‌ఎంలు విధులునిర్వహిస్తున్నారు. వీరికి గత రెండు నెలలుగా వేతనాలు అందడం లేదు. వీరి వేతనం మీదే కుటుంబాలన్నీ ఆధారపడడం, వేతనాలు అందకపోవడంతో సంకట పరిస్థితి ఎదుర్కొంటున్నారు.
కాంట్రాక్టు బోధకులకూ....
ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో కాంట్రాక్ట్, గెస్ట్ లెక్చరర్లుగా దాదాపు 130 మంది పనిచేస్తున్నారు. ఒక్కో కాంట్రాక్ట్ లెక్చరర్‌కు వేతనంగా నెలకు రూ.20,700 చెల్లించాల్సి ఉంది. గతంలో వీరికి రెండు మూడు నెలలకోసారి అందజేసేవారు. అయితే ఈ ఏడాది జనవరి నుంచి ప్రభుత్వం వేతనాలు చెల్లించిన పాపాన పోలేదు. దీంతో 70మంది లెక్చరర్ల కుటుంబాలు తీవ్ర అవస్థలపాలవుతున్నాయి. గెస్ట్ లెక్చరర్లుగా 60మంది వరకు బోధిస్తున్నారు. వీరికి ఈ ఏడాదిలో జీతాలు ఇచ్చారు. అయితే గత రెండేళ్లకు సంబంధించిన జీతాలు ఇంకా అందలేదు.
‘జూనియర్’లదీ ఇదే పరిస్థితి...
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో జిల్లాలో కాంట్రాక్ట్ పద్ధతిన 330మంది లెక్చరర్లు పనిచేస్తున్నారు. వీరికి రెండు నెలలుగా వేతనాలు అందడం లేదు. సగటున ఒక్కొక్కరికి నెలకు రూ.10 వేలు వేతనం.
ఆర్వీఎంలో...
ఆర్వీఎం పరిధిలో దాదాపు 600 మందికి రెండు నెలల నుంచి వేతనాలు అందడంలేదు. 284మంది సీఆర్‌పీలు, మండలానికి ఒకరు చొప్పున ఎంఐఎస్ కో ఆర్డినేటర్లు, ఎల్‌డీఎల్‌లు, ఐఈఆర్‌టీలు, మెసెంజర్లు వేతనాలకు నోచుకోలేదు. వీళ్లేగాక వేతనాలు నోచుకోని వారు ఇంకా పలు శాఖల్లో వందల సంఖ్యలో ఉన్నారు. పండగలోపైనా వేతనాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. లేకుంటే పండగ పూట తమకు పస్తులు తప్పవని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Advertisement
Advertisement