ఇల్లు.. చక్కబెట్టుకుందాం!
సాక్షిప్రతినిధి, నల్లగొండ : గత ప్రభుత్వంలో జిల్లా నుంచి రాష్ట్ర గృహనిర్మాణ శాఖమంత్రిగా వ్యవహరించిన హుజూర్‌నగర్ ఎమ్మెల్యే ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మంత్రిగా తన నియోజకవర్గ కేంద్రంలో 4వేల ఇళ్లను మంజూరు చేశారు. హుజూర్‌నగర్‌లోనే ఓ మోడల్‌కాలనీ నిర్మించేందుకు భూములు సేకరిం చారు. 4వేల ఇళ్ల నిర్మాణ పనులను పర్యవేక్షించేందుకు అవుట్‌సోర్సింగ్ విధానంలో సిబ్బందిని నియమించుకోవడానికి అవకాశం కల్పించారు. ఇంతవరకూ ఎవరికీ ఎలాంటి అభ్యం తరం లేదు. ఎన్నికల కోడ్ వల్ల అటు పనులు, ఇటు నియామకాలు నిలిచిపోయాయి. ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్ అధికారాన్ని కోల్పోగా, టీఆర్‌ఎస్ అధికారాన్ని చేజిక్కించుకుంది.
ఈ కొత్త ప్రభుత్వంలో ఒకవేళ హుజూర్‌నగర్‌లోని మోడల్ కాలనీ నిర్మాణం కొనసాగే వీలున్నా, ఇక్కడొక చిక్కుంది. తాము అధికారంలోకి వస్తే బడుగు బలహీన వర్గాలకు డబుల్ బెడ్‌రూమ్ ఫ్లాట్ కిచెన్, హాలు, సకల సౌకర్యాలతో నిర్మిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. ఎన్నికల హామీ అమలు మొదలైతే, కొత్తగా ఇళ్లు మంజూరైన వారంతా, డబుల్ బెడ్‌రూమ్ ఫ్లాట్‌లకే మొగ్గుచూపుతారు. అలాంటప్పుడు పనులు మొదలు కానీ ఇళ్లన్నీ రద్దయ్యే అవకాశం ఉంది. కానీ, ఇవేవీ గృహనిర్మాణ శాఖ అధికారులు పట్టించుకున్న దాఖలాలు కనిపించడం లేదు. దీంతో పాత అనుమతులను అడ్డం పెట్టుకుని ఏకంగా 23 మంది అసిస్టెంట్ ఇంజినీర్లు, 17 మందికి వర్క్ ఇన్స్‌పెక్టర్లుగా ఉద్యోగాలు ఇచ్చారు. అదీ కేవలం ఒకే ప్రాంతానికి చెందిన వారితో భర్తీ చేయడంతో జిల్లాలోని ఇతర ప్రాంతాల్లోని నిరుద్యోగులు అభ్యంతరం వ్యక్తం చేశారు.
నిర్మాణాలన్నీ ...స్టాప్
వాస్తవానికి కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయ్యే వరకూ ఎలాంటి కొత్త నిర్మాణాలు చేపట్టొద్దన్న నిర్ణయం జరిగినట్లు సమాచారం. బిల్లులు కూడా చెల్లించడం లేదు. జిల్లాలో ఇందిరమ్మ, రచ్చబండ కార్యక్రమాల కింద మంజూరైన 4 లక్షల ఇళ్లలో ఇప్పటికే 2.30లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తయ్యింది. మరో 40వేల ఇళ్ల నిర్మాణం వివిధ దశల్లో ఉంది. కాగా, 1.30లక్షల ఇళ్ల నిర్మాణం పనులు మొదలు కానేలేదు. కొత్త మంజూరులు అసలే లేవు. కొత్త ప్రభుత్వంలో, డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణానికి ఉత్తర్వులు రావాల్సి ఉంది. కానీ, గృహనిర్మాణ శాఖ అధికారులు మాత్రం ఇళ్ల నిర్మాణాలే జరగని సమయంలో ఏకంగా నలభై మంది ఔట్‌సోర్సింగ్ సిబ్బందిని నియమించుకున్నారు. త్వరలోనే బదిలీ అయ్యే అవకాశం ఉందంటున్న ఓ అధికారి పోతూపోతూ సొమ్ము చేసుకోవడంలో భాగంగా హడావిడిగా ఈ నియామకాలు పూర్తి చేసినట్లు గృహనిర్మాణ శాఖ వర్గాలే చెబుతున్నాయి. అసిస్టెంట్ ఇంజినీర్లు, వర్క్ ఇన్స్‌పెక్టర్ల నియామకాల్లో భారీగానే సొమ్ములు చేతులు మారినట్లు ఆరోపణలు అందాయి. ఉన్నతాధికారులు విచారణ జరిపితే అసలు విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.