
రణరంగంగా ఎర్రగడ్డ ఈఎస్‌ఐ ఆస్పత్రి
హైదరాబాద్ : ఎర్రగడ్డలోని ఈఎస్‌ఐ ఆస్పత్రి గురువారం రణరంగంగా మారింది. అకారణంగా ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నారంటూ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు సకాలంలో జీతాలు చెల్లించడం లేదంటూ అవుట్ సోర్సింగ్ మహిళా ఉద్యోగిని అనురాధ నిన్న మూసాపేటలోని తన నివాసంలో ఆత్మహత్యాయత్నం చేసింది. దీనిపై సీఐటీయూ నేతలు ఇవాళ అవుట్ సోర్సింగ్ సిబ్బందితో కలిసి ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగారు.
సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని నిరసన తెలుపుతున్న సీఐటీయూ నాయకుడు ఈశ్వర్‌రావును అదుపులోకి తీసుకోవడంతో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు రోడ్డు పైకి వచ్చి ఆందోళన చేపట్టడంతో ఆస్పత్రి పరిసరాల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. మరోవైపు అవుట్ సోర్సింగ్ కాంట్రాక్టర్ మాట్లాడుతూ... సిబ్బందికి జీతాల చెల్లింపులో కొంత జాప్యం జరుగుతున్న విషయం వాస్తవమే అన్నారు. ప్రభుత్వం నుంచి బిల్స్ రావడంలో ఆలస్యం కారణంగా వేతనాలు చెల్లింపులో ఆలస్యం జరిగిందన్నారు.