
బాబూ.. తీయకండి వాళ్ల జాబు
సాక్షి, ఏలూరు: ‘జాబు కావాలంటే.. బాబు రావాలి’ అంటూ ఎన్నికల ప్రచారంలో ఊదరగొట్టిన చంద్రబాబు నాయుడు అధికారం చేపట్టాక ఉద్యోగుల మెడపై కత్తి వేలాడదీస్తున్నారంటూ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు. కాంట్రాక్టు ఉద్యోగులను తొలగించాలనే రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై శాసనసభలో వైఎస్ జగన్ నిప్పులు చెరిగారు. ఆయుష్ శాఖలో కాంట్రాక్టు ఉద్యోగుల వెతలపై ‘ఆయుష్ తీరనుందా..?’ శీర్షికన ఈనెల 21న, ‘అవుట్ సోర్సింగ్ సిబ్బందికి ఎసరు’ శీర్షికన ఈనెల 23న ‘సాక్షి’ పశ్చిమగోదావరి టాబ్లాయిడ్‌లో వరుస కథనాలు ప్రచురితమైన విషయం విదితమే. ఆయూ అంశాలను సోమవారం అసెంబ్లీ సమావేశాల్లో లేవనెత్తిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సర్కారు తీరుపై నిప్పులు చెరిగారు.
కొత్తజాబు రావడం మాటలా ఉంచితే ‘బాబు వచ్చాడు.. జాబు పోయేలా ఉంద’ని జగన్ ఆక్షేపించారు. జిల్లాలో అన్ని శాఖల్లో కలిపి కాంట్రాక్టు ఉద్యోగులు దాదాపు 6వేల మంది ఉన్నారు. వీరిలో ఆయుష్ సిబ్బంది 81 మంది. వైద్య ఆరోగ్యశాఖలో వివిధ విభాగాల్లో వందలాది కాంట్రాక్టు కార్మికులు ఉన్నారు. కాగా 18 మంది ఉపాధి ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగించాల్సిందిగా ఇటీవల నోటీసులు జారీ అయ్యాయి. ఈ విషయాలను సభ దృష్టికి తీసుకువెళ్లిన జగన్‌మోహన్‌రెడ్డి దాదాపు 4వేల మంది ల్యాబ్ టెక్నీషియన్లు, ఫార్మాసిస్టులు, పారామెడికల్ సిబ్బంది, ఫీల్డ్‌అసిస్టెంట్ల మెడపై కత్తి వేలాడదీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
కాగా ‘ఎన్‌ఆర్‌హెచ్‌ఎం’ కాల పరిమితి వచ్చే ఏడాది వరకూ ఉంది. మాతాశిశు మరణాలను తగ్గించే ప్రధాన లక్ష్యంతో ప్రా రంభించిన ఈ పథకానికి 2015 వరకూ పంచవర్ష ప్రణాళికలో నిధులు కేటాయించారు. వారి జీతాలను కూడా కేం ద్రమే భరిస్తోంది. అయినప్పటికీ వారిని తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిం చడం అన్యాయమని ఆ శాఖ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ కష్టాలపై వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పోరాడటంపై వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
జగన్ మా కోసం పోరాడటం సంతోషం
పన్నెండేళ్ల క్రితం కాంట్రాక్ట్ వ్యవస్థను తీసుకొచ్చారు. రెగ్యులర్ ఉగ్యోగికి ఇచ్చే జీతంతో ముగ్గురు కాంట్రాక్ట్ ఉద్యోగులను నియమిం చుకోవచ్చని చంద్రబాబు భావించారు. ఏటా వారిని రెన్యువల్ చేస్తున్నారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి బడ్జెట్ రిలీజ్ చేసి జీతాలు ఇస్తున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి గతంలో కమిటీ వేసి వీరందరినీ క్రమబద్ధీకరించాల్సిం దిగా సూచించారు. ఈలోగా వైఎస్ దూరమయ్యారు. ఇప్పుడు మళ్లీ వైఎస్ జగన్ మాకోసం పోరాడటం సంతోషంగా ఉంది. ఆయన అధికారంలోకి వచ్చి ఉంటే కచ్చితంగా కాంట్రాక్టు ఉద్యోగులందరినీ క్రమబద్ధీకరించేవారు. -జి.హరిబాబు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర హెల్త్ అసిస్టెంట్స్, సూపర్‌వైజర్స్ అసోసియేషన్