ఆలంపల్లి, న్యూస్‌లైన్: స్థానికత ఆధారంగానే ఉద్యోగుల విభజన జరగాలని టీజేఏసీ రాష్ట్ర కో చైర్మన్ సీ.విఠల్ అన్నారు. సోమవారం ఆయన రంగారెడ్డి జిల్లా వికారాబాద్‌లో నిర్వహించిన ఉద్యోగుల సమావేశానికి హాజరయ్యారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ఆంధ్రా ఉద్యోగులు ఆంధ్రా సచివాలయంలోనే పనిచేయాలని పేర్కొన్నారు. తెలంగాణలోని ప్రభుత్వ కార్యాలయాల్లో ఆంధ్రా ప్రాంత ఉద్యోగులు పనిచేయకూడదని జేఏసీ నిర్ణయం తీసుకుందన్నారు.
తెలంగాణ ప్రాంత ప్రజలంతా ఎన్నికల హడావుడిలో ఉండగా రెండు రాష్ట్రాల విభజనకు 21 కమిటీలు వేశారని, అందులో అందరూ ఆంధ్రా ప్రాంతానికి చెందిన వారే ఉన్నారని ఆరోపించారు. పనికిరాని భవనాలను తెలంగాణ కార్యాలయాలకు, అధునాతన భవనాలు ఆంధ్రా ప్రాంతం వారికి కేటాయించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా కల్పించేందుకు కృషి చేస్తామని, వికారాబాద్ జిల్లా ఏర్పాటు, స్థానికంగా జూనియర్ కళాశాల, ఎస్‌ఏపీ కళాశాలలో లెక్చలర్ల నియామకం, కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల రెగ్యులరైజ్, ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడం కోసం జేఏసీ పోరాటం చేస్తుందన్నారు.
సుస్థిరపాలన అందించే పార్టీకి, ప్రజలకు సేవచేసే సమర్థవంతమైన నాయకుడికి ఓటు వేయాలని కోరారు. పోలింగ్ విధుల తర్వాత ఉద్యోగులు ఇంటికి వెళ్లేందుకు ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేయాలని జిల్లా ఎన్నికల అధికారిని కోరతామని అన్నారు. కార్యక్రమంలో జిల్లా జేఏసీ చైర్మన్ శ్రీనివాస్, టీయూటీఎఫ్ నాయకులు యూ.విఠల్, నాయకులు ప్రతాప్, మారుతీ, దేవదాస్, నందకుమార్, ప్రేం కుమార్, దుర్గప్రసాద్, నర్సింహులు, రామారావుజోషి పాల్గొన్నారు.
స్థానికత ఆధారంగానే ఉద్యోగుల విభజన
Published Mon, Apr 28 2014 11:42 PM | Last Updated on Sat, Jun 2 2018 5:18 PM
Advertisement
Advertisement