కొత్త సంవత్సరం రోజు కూటమి ప్రభుత్వం షాక్
విశాఖలో 431 మలేరియా ఉద్యోగులపై వేటు
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ వర్సిటీలో 34 మంది తొలగింపు
ఆవేదన వ్యక్తం చేస్తున్న బాధితులు
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం/ఎచ్చెర్ల క్యాంపస్: వివిధ విభాగాల్లోని చిరుద్యోగులపై కూటమి ప్రభుత్వం కక్షసాధింపు చర్యలను కొనసాగిస్తూనే ఉంది. అందులో భాగంగా ఇప్పటికే వేలాదిమందిని ఉద్యోగంలోనుంచి తొలగించగా.. తాజాగా మంగళవారం మరో 465మందికి ఉద్వాసన పలికి కొత్త సంవత్సరంలోనూ వారికి చేదు అనుభవాన్ని రుచి చూపించింది.
వివరాల్లోకి వెళితే.. గ్రేటర్ విశాఖపట్నం మునిసిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ)తో పాటు కింగ్ జార్జ్ హాస్పిటల్ (కేజీహెచ్), విక్టోరియా గవర్నమెంట్ హాస్పిటల్ (వీజీహెచ్)లలో పనిచేసే 431 మంది మలేరియా సిబ్బందిని జనవరి 1వ తేదీ నుంచి పనిలోకి రావద్దంటూ జీవీఎంసీ ఆదేశాలు జారీచేసింది.
గత 14 నెలలుగా రోజువారీ వేతనం ఆధారంగా పనిచేస్తున్న సాధారణ ఉద్యోగులను తొలగిస్తూ ఆదేశాలు జారీకావడంతో వారంతా ఆందోళన చెందుతున్నారు. వాస్తవానికి జీవీఎంసీ పరిధిలో మలేరియా, డెంగ్యూ, చికున్ గున్యా కేసులు ఎక్కువగా నమోదవుతున్న నేపథ్యంలో గత ప్రభుత్వం వీరిని పనిలోకి తీసుకుంది. ఇప్పటికీ నగరంలో మలేరియా కేసులు నమోదవుతున్నాయి.
ఈ నేపథ్యంలో వీరి సేవలను కొనసాగించాల్సిన అవసరం ఉంది. అయితే, సీజన్ ముగిసినందున వీరి అవసరం లేదని పేర్కొంటూ తొలగిస్తున్నట్లు జీవీఎంసీ చీఫ్ మెడికల్ ఆఫీసర్ ఆఫ్ హెల్త్ (సీఎంహెచ్‌వో) ఆదేశాలు జారీచేశారు.
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ వర్సిటీలోనూ..
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న 34 మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను ఇకపై విధులకు హాజరు కావద్దంటూ ఆయా విభాగాల అధికారులు తేల్చి చెప్పారు. ఈ నేపథ్యంలో బాధిత సిబ్బంది అధికారులను కలిసే ప్రయత్నం చేయగా వీసీ రజిని, రిజిస్ట్రార్ సుజాత అపాయింట్‌మెంట్ ఇవ్వలేదు.
ఏజీఎస్ మేనేజ్‌మెంట్ సర్వీస్ ఔట్ సోర్సింగ్ సంస్థ రెన్యూవల్‌కు దరఖాస్తు చేసుకున్నా వర్సిటీ అధికారులు ఇప్పటి వరకు స్పందించకపోగా.. వారి సేవలకు ఉద్వాసన పలుకుతున్నట్లు సమాచారమిచ్చారు. ఉద్యోగాలు కల్పిస్తామని అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం.. ఉన్న ఉపాధిని తీసేస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొత్త సంవత్సరంలో తమ పొట్టకొట్టవద్దంటూ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment